ద్విచక్ర వాహనాలే దొంగల టార్గెట్
ABN, Publish Date - Jan 02 , 2025 | 04:49 AM
పోలీసులెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం అదను చూసి వారి చేతివాటం చూపిస్తున్నారు. అత్యంత చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చాలెంజ్ విసురుతున్నారు.
రద్దీ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ల కోసం కొన్ని ముఠాల కాపు
పోలీసులకు చాలెంజ్ విసురుతున్న దొంగలు
హైదరాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పోలీసులెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం అదను చూసి వారి చేతివాటం చూపిస్తున్నారు. అత్యంత చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చాలెంజ్ విసురుతున్నారు. ఖరీదైన సెల్‌ఫోన్లు దొంగలకు వరంలా మారాయి. ఫోన్లు కొట్టేయడం అత్యంత సులభం కావడంతో రద్దీ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ల దొంగతనాల కోసమే కొన్ని ముఠాలు కాపుకాస్తున్నాయి. గతంలో జేబు దొంగతనాలు ఎక్కువకాగా, మారుతున్న పరిస్థితుల్లో పర్సులు జేబుల్లో పెట్టుకునేవారే కరువై పోవడంతో సెల్‌ఫోన్ల చోరీనే దొంగలు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 19,480 దొంగతనం కేసులు నమోదు కాగా, అందులో 10.06 శాతం సెల్‌ఫోన్ల దొంగతనాలే కావడం కీలకాంశమైంది.
జేబుల్లోంచి సెల్‌ఫోన్లు కొట్టేయడం, నిర్మానుష్య ప్రాంతాల్లో వ్యక్తుల వద్ద నుంచి ఫోన్లు గుంజుకుని పారిపోవడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసు అధికారులంటున్నారు. ఇక దొంగతనాల్లో సెల్‌ఫోన్ల కన్నా ప్రథమ స్థానాన్ని వాహనాల దొంగలు ఆక్రమిస్తున్నారు. మొత్తం దొంగతనాల్లో మోటారు వాహనాల దొంగల వాటా 39 శాతం ఉందని పోలీసు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మోటారు వాహనాల దొంగతనాల్లో ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది 6,256 ద్విచక్ర వాహనాలు, 543 ఆటోలు, 168 కార్లు, 628 ఇతర వాహనాలు చోరీకి గురయ్యాయి. వాస్తవానికి తెలంగాణలో ప్రతిరోజు కొత్తగా 3,500 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రోజుకు 20 వాహనాలు చోరీ అవుతున్నాయి. దొంగలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలనే టార్గెట్ చేస్తున్నారని పోలీసు అధికారులంటున్నారు.
Updated Date - Jan 02 , 2025 | 04:49 AM