Share News

Ameenpur: రజిత కంట బొట్టు కన్నీరొస్తే ఒట్టు!

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:50 AM

పిల్లల యాదిలో ఆమె బొట్టు కన్నీరు కార్చితే ఒట్టు! భర్త చెన్నయ్య మాత్రం బిడ్డలను గుర్తుచేసుకుంటూ కుమలిపోతున్నాడు. ఆయనకు కునుకు కరువైంది. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం కళ్లముందు కదలాడుతోందని, డాడీ అంటూ పిల్లలు పిలుస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పాడు.

Ameenpur: రజిత కంట బొట్టు కన్నీరొస్తే ఒట్టు!

  • పిల్లలను చంపుకొన్నానన్న పశ్చాత్తాపమే లేదు

  • ప్రియుడితో ఫోన్లో కబుర్లు.. భర్త, పిల్లలపై చికాకు

  • పిల్లల్ని చంపేంత సీన్‌ నీకుందా అని ఆమెను రెచ్చగొట్టిన ప్రియుడు

అమీన్‌పూర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఆ రజిత మనసెంత కఠినం? నిలువెల్లా ఆవహించిన ప్రియుడి మత్తు ఆమెను ఇప్పటికీ వదల్లేదు!. తన ముగ్గురు పిల్లలనూ తానే చంపేసి.. ఆ నేరం భర్తపై నెట్టి.. అతడిని ఇరికించేందుకు విషాహారం నాటకమాడి అడ్డంగా దొరికిపోయినా కూడా ఆ తల్లిలో ఇసుమంతైనా పశ్చాత్తాపం కనిపించడం లేదు. పిల్లల యాదిలో ఆమె బొట్టు కన్నీరు కార్చితే ఒట్టు! భర్త చెన్నయ్య మాత్రం బిడ్డలను గుర్తుచేసుకుంటూ కుమలిపోతున్నాడు. ఆయనకు కునుకు కరువైంది. పిల్లలతో గడిపిన ప్రతి క్షణం కళ్లముందు కదలాడుతోందని, డాడీ అంటూ పిల్లలు పిలుస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పాడు. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన ఘోరం అటు స్థానికులనూ కలవరపాటుకు గురిచేస్తోంది. బిడ్డలను కన్నతల్లే పొట్టనబెట్టుకోవడం ఏమిటి? అని వారంతా చర్చించుకుంటున్నారు. రజితకు టెన్త్‌ బ్యాచ్‌కు చెందిన స్నేహితుల నుంచి గెట్‌ టు గెదర్‌కు ఆహ్వానం వస్తే వెళ్లేందుకు తాను ఓకే చెప్పడమే ఘోరానికి కారణమైందని భర్త చెన్నయ్య అంటున్నాడు. గెట్‌ టు గెదర్‌లో ఆమెకు శివకుమార్‌ అనే చిన్ననాటి మిత్రుడితో చనువు ఏర్పడి.. అది వివాహేతర సంబంధం దాకా వెళ్లి.. భర్త, పిల్లలను మరిచిపోయేలా చేసింది.


భర్తను వదిలేసి శివను పెళ్లిచేసుకోవాలని రజిత భావించింది. శివతో ఇదే అభిప్రాయాన్ని పంచుకుంది. ‘‘నీకు పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకునేవాడిని’’ అంటూ శివ బీరాలు పలికాడు. అతడి మాటలను సీరియ్‌సగా తీసుకున్న ఆమె పిల్లలను చంపి.. ఆ నేరాన్ని భర్తపైకి నెట్టి.. జైలుపాల్జేస్తే తనకు అడ్డే ఉండదని ఊహల్లో తేలియాడింది. నీతో పెళ్లికి నా ముగ్గురు పిల్లలు అడ్డు అనుకుంటే వారిని చంపేస్తానని రజిత చెప్పగా నీకు అంత సీన్‌ ఉందా? అంటూ శివ ఆమెను రెచ్చగొట్టినట్లు తెలిసింది. అయితే పిల్లలను ఎలా చంపాలి? అనే విషయంలో ప్రణాళికను శివే రూపొందించినట్లు తెలుస్తోంది. అతడు చెప్పినట్లే.. విషాహారం డ్రామాలో భాగంగా పెరుగున్నం, పప్పన్నం అంటూ పోలీసులను రజిత తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసింది. కడుపునొప్పంటూ ఆస్పత్రిలో చేరిన రజితకు ఏమీ కాలేదని డాక్టర్లు తేల్చడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాను అడ్డంగా దొరికిపోయినా కూడా రజితలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు పరిచయ్యాక గత ఆరునెలలుగా రజిత వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించిందని భర్త చెన్నయ్య చెప్పాడు. అతడితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడేదని.. తనపై ఎక్కడాలేని చికాకు ప్రదర్శించేదని.. పిల్లలను అకారణంగా కొట్టేదని వివరించాడు. తన ఆస్తిని లాక్కునేందుకూ రజిత కుట్ర చేసిందని, ఇంట్లో ఆస్తి పత్రాలు కూడా కనిపించడం లేదని చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 06 , 2025 | 03:51 AM