Share News

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:55 AM

ఇద్దరు లంచగొండి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో టెక్నిషియన్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్‌ 3 నెలల క్రితం పదవీ విరమణ పొందారు.

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు

  • లంచంతో దొరికిపోయిన కోఠి ఈఎన్‌టీ ఏవో, డిండి ఆర్‌ఐ

డిండి/చంపాపేట/మంగళ్‌హాట్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు లంచగొండి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో టెక్నిషియన్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్‌ 3 నెలల క్రితం పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం ఏవోగా ఉన్న ఆర్‌.సంతోష్‌ తివారిని కలిశారు. ఆయన ఫైలు కదిలించేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో రూ.17 వేలు ఇచ్చారు. మిగిలిన రూ.3 వేలు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో శ్రీనివాస్‌ ఏసీబీని ఆశ్రయించారు. ఆస్పత్రిలో సంతోష్‌ తివారికి శ్రీనివాస్‌ రూ.3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.


నల్లగొండ జిల్లా డిండి మండలం పడమటితండాకు చెందిన రాత్లావత్‌ పాండు తన కూతురి వివాహం మూడేళ్ల కింద చేశాడు. అప్పుడే కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మి సాయం అందకపోవడంతో ఆర్‌ఐ శ్యాంనాయక్‌ను కలిశాడు. దీంతో ఆయన చెక్కు మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పాండు.. ఏసీబీని సంప్రదించాడు. ఈనేపథ్యంలోనే పాండు ఆర్‌ఐకి రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 04:55 AM