ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Beer Sales: తెలంగాణలో కింగ్‌ఫిషర్‌ బీర్లు విక్రయించం!

ABN, Publish Date - Jan 09 , 2025 | 03:43 AM

తెలంగాణలో తమ బ్రాండ్‌ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌(యూబీ) సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  • బకాయిలు చెల్లించలేదు.. ధరలు పెంచలేదు..

  • అమ్మకాలు నిలిపేస్తున్నాం.. ఎక్సైజ్‌కు యూబీ గ్రూప్‌ లేఖ

  • బకాయిలు 658 కోట్లు.. 33.1% ధరలు పెంచాలన్న సంస్థ

  • కమిటీ నివేదిక ఇవ్వకముందే ధరలు పెంచమంటే ఎలా?

  • ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదు: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తమ బ్రాండ్‌ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌(యూబీ) సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు బుధవారం లేఖ రాసింది. తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేసిన విషయాన్ని యూబీ గ్రూప్‌ బొంబాయి స్టాక్‌ ఎక్ఛ్సేంజీ, సెబీకి తెలిపింది. తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) ధరలు పెంచడం లేదని, 2019-20 నుంచి పాత ధరనే కొనసాగిస్తోందని, రెండేళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయలేదని, నిర్వహణ భారం పెరిగినందున రాష్ట్రంలో అమ్మకాలు చేయలేమని వెల్లడించింది. కింగ్‌ఫిషర్‌ ప్రీమియం లాగర్‌, కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌, కింగ్‌ఫిషర్‌ అల్ర్టాతోపాటు హీనెకెన్‌ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తోంది. రాష్ట్రంలోని బీర్ల మార్కెట్‌లో ఈ సంస్థ వాటా 69 శాతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ధరను 33.1 శాతం పెంచాలని యూబీ గ్రూప్‌ ప్రభుత్వాన్ని కోరింది.


బకాయిలు రూ.658 కోట్లు

యూబీ సంస్థకు ఎక్సైజ్‌ శాఖ రూ.658.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 2023-24లో 547.95 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా అందులో యూబీ గ్రూప్‌ బీర్లు 382.73 లక్షల కేసులు. 2024-25లో ఇప్పటి వరకు 413.23 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా.. యూబీ వాటా 275.22 లక్షల కేసులు. రాష్ట్రంలో బీర్లు, ఇతర మద్యం బ్రాండ్లకు సంబంధించిన మొత్తం బకాయిలు రూ.3600 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో యూబీ గ్రూప్‌ బీర్లకు టీజీబీసీఎల్‌ చెల్లించే ధరలు ఇలా ఉన్నాయి. కింగ్‌ఫిషర్‌ ప్రీమియం లాగర్‌ బీరు కేసుకు బేసిక్‌ ధర రూ.289గా ఉంది. కేసులో 12 సీసాలు ఉంటాయి. కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌ రూ.314గా ఉంది. కింగ్‌ఫిషర్‌ అలా్ట్ర ధర రూ.408, హీనెకెన్‌ ధర రూ.490గా ఉంది. వీటికి పన్నులు కలిపి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విక్రయాలు చేస్తుంది. అయితే ఈ ధరలను 2019-20 నుంచి పెంచడం లేదని, దీనివల్ల సంస్థ నష్టాల్లో ఉందనేది యూబీ గ్రూప్‌ వాదన. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలు ఇవ్వాలని గ్రూప్‌ పట్టుబడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధరల పెంపుపై ప్రభుత్వం స్పందించలేదన్న కారణంతో రాష్ట్రంలో అమ్మకాలు నిలిపివేస్తూ యూబీ గ్రూప్‌ నిర్ణయం తీసుకుంది.


ఒత్తిళ్లకు తలొగ్గం: మంత్రి జూపల్లి

గుత్తాధిపత్యం ఉండడంతో ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. యూబీ గ్రూప్‌ బీర్ల సరఫరా నిలిపివేయడంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే టీజీబీసీఎల్‌పై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యూబీ సంస్థ కోరుతోందని, అంత మొత్తంలో ధరలు పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. యూబీ కంపెనీకి కేవలం రూ.658.95 కోట్లే చెల్లించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం యూబీ సంస్థ బీర్లు 14 లక్షల కేసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ అప్పులకు నెలకు రూ.6500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని, ఇందులో ఎక్సైజ్‌ బకాయిలు రూ.2500 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

Updated Date - Jan 09 , 2025 | 03:43 AM