Share News

Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:53 AM

దీనికే ప్రాజెక్టు పూర్తయినట్లు అబద్ధాలు చెబితే ఎలా..? హరీశ్‌రావు దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

  • ప్రతిపాదనల్లోనే గోదావరి-బనకచర్ల అనుసంధానం

  • ఏపీ నీరు తరలిస్తోందంటూ హరీశ్‌ అసత్య ప్రచారం: ఉత్తమ్‌

  • గోదావరి-బనకచర్ల లింక్‌ను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖ

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘గోదావరి-బనకచ ర్ల అనుసంధానం.. ప్రతిపాదన మాత్రమే. ప్రాజెక్టు పూర్తికావడం కాదు కదా.. డీపీఆర్‌ కూడా తయారు కాలేదు. చుక్క నీరు పోలేదు. రూ.80 వేల కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా ప్రాజెక్టును ప్రతిపాదించారు. నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనికే ప్రాజెక్టు పూర్తయినట్లు అబద్ధాలు చెబితే ఎలా..? హరీశ్‌రావు దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంతో 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ శుక్రవారం సచివాలయంలో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల అనుసంఽధానానికి అనుమతి ఇవ్వరాదని కేంద్రానికి తాము ఇప్పటికే లేఖలు రాశామని తెలిపారు.


గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు. కేసీఆర్‌, హరీశ్‌ అసమర్థత, అహంకారం వల్లే కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. పాలమూరులో రూ.27,500 కోట్లు, సీతారామలో రూ.7 వేల కోట్లు పెట్టినా ఒక్క ఎకరం తడవలేదని ధ్వజమెత్తారు. కాగా, బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా గోదావరి-బనకచర్ల అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని.. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్‌లేఖ రాశారు. రూ.80,112 కోట్ల వ్యయంతో పోలవరం నుంచి 200 టీఎంసీలను తరలించేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని, 150 టీఎంసీలతో గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు పొందలేదని తెలిపారు.


సీతారామ ఎత్తిపోతలలో ప్యాకేజీ-2 తిరస్కరణ

సీతారామ ఎత్తిపోతల పథకంలో ప్యాకేజీ-2 కింద ప్రతిపాదించిన రూ.172 కోట్ల పనులను కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) తిరస్కరించింది. ప్యాకేజీ-2 పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పూర్వానుభవం లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్యాకేజీ-1లో రూ.369 కోట్లతో చేపట్టే పనులతో పాటు రూ.56 కోట్లతో ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పనులను పక్కనపెట్టింది.

Updated Date - Jan 25 , 2025 | 04:53 AM