VHP: ఆలయాల రక్షణే మన దీక్ష
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:24 AM
హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది.

పార్టీలు, ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి.. ‘హైందవ శంఖారావం’ తీర్మానం
అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని.. ఆలయాలకు రక్షణ కల్పించాలని.. వాటిలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని తీర్మానించింది. సనాతన ధర్మ పరిరక్షణ, పూర్వ వైభవ పునరుద్ధరణ పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. విదేశీయుల పాలనలోనూ ఆలయాలను రక్షించుకున్నామని, కానీ స్వాతంత్ర్యానంతరం మాత్రం వాటిని కాపాడులేకపోతున్నామని స్వామీజీలు, సాధుసంతులు వాపోయారు. వాటి రక్షణకు హిందూ సమాజం నడుం బిగించి దీక్షపూనాలని పిలుపిచ్చారు. ఆలయాలను కాపాడాలని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు సభలో వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రసంగించారు. హిందూ దేవాలయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదన్నారు. వాటిని ఆయా ప్రభుత్వాలే స్వచ్చందంగా హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ‘దేశంలోని అన్ని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ఒకప్పుడు ఆలయాల సంరక్షణ పూర్తిగా హిందువులే చూసుకునేవారు. దేవాలయాల్లో పూజా కైంకర్యాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్వహణ చేపట్టే బాధ్యత వీహెచ్‌పీ తీసుకుంటుందా.. బ్రాహ్మణులు తీసుకుంటారా.. అని కొందరు అడుగుతున్నారు.. హిందూ సమాజం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి దేవాలయాల సంరక్షణ తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.
‘హిందువులకు అతిపెద్ద ఆలయమైన తిరుమలలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారా.. కంచి పీఠంలో బ్రాహ్మణేతర హిందువులు లేరా..’ అని నిలదీశారు.వీహెచ్‌పీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మాట్లాడుతూ.. మన సమాజంలో శక్తిమంతమైన ఆలయాలను విదేశీయులు స్వాతంత్ర్యానికి పూర్వం చేతుల్లోకి తీసుకుంటే, ఆ తర్వాత దురదృష్టవ శాత్తూ ప్రభుత్వాలు పెత్తనం చేస్తున్నాయన్నారు. ‘ప్రపంచం సుఖసంతోషాలతో ఉండాలంటే విశ్వ కల్యాణం కోసం కృషి చేసే భారతదేశం సురక్షితంగా ఉండాలి.. అందుకు హిందూ ధర్మం మరింత భద్రంగా ఉండాలి..’ అని అయోధ్య రామాలయ కోశాధికారి గోవిందదేవ్ గిరిజీ మహరాజ్ అన్నారు. హిందూ దేవాలయాల విముక్తి పోరాటానికి విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం మొదటి అడుగుగా వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుఅభివర్ణించారు.
ట్రస్టు బోర్డులు వీఐపీల సేవలకా?: చినజీయర్
ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. వీఐపీ దర్శనాల పేరిట పేదలను దేవుడికి దూరం పెడితే.. వారు ఇతర మతాల్లోకి ఎందుకుపోరని ప్రశ్నించారు. డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో అయినా అన్యమతాల్లోకి వెళ్తారని చెప్పారు. దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమలానంద భారతి మాట్లాడుతూ దేవదాయ శాఖనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.