CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ABN, Publish Date - Feb 26 , 2025 | 05:07 AM
కంటిచూపు సమస్యలన్నీ కంటికి మాత్రమే పరిమితమై ఉండవు. చాలామందికి మెదడులో సమస్యల వల్ల కూడా చూపు తేడా వస్తుంది. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటివాటితో బాధపడేవారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.

ముఖం చూసి జబ్బులు చెప్పే కృత్రిమ మేధ.. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ పిల్లలకు ‘విజన్ నానీ’
బయో ఏషియా సదస్సులో పలు ఆసక్తికర ఆవిష్కరణలు
రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైన బయో ఏషియా సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ట్రేడ్ షోలో పలు ఆసక్తికర ఆవిష్కరణలు కనిపించాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
ఆటిజం పిల్లలకు తోడు.. విజన్ నానీ
కంటిచూపు సమస్యలన్నీ కంటికి మాత్రమే పరిమితమై ఉండవు. చాలామందికి మెదడులో సమస్యల వల్ల కూడా చూపు తేడా వస్తుంది. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటివాటితో బాధపడేవారిలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. కళ్లు ఏం చూస్తున్నాయో అర్థం చేసుకోవడంలో వీరి మెదడు ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటి సెరెబ్రల్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ (సీవీఐ) బాధితుల కోసమే విజన్ నానీ సంస్థ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సోర్స్ ఫ్లాట్‌ఫామ్‌తో ముందుకొచ్చింది. ఆటిజం తదితర సమస్యలతో బాధపడే చిన్నారులకు శిక్షణ ఇచ్చే టీచర్లతో పాటుగా పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుందని, ఖర్చు సగం తగ్గడంతో పాటుగా ఐదు రెట్లు వేగంగా పిల్లలు స్పందించడం సాధ్యమవుతుందని, థెరపి్‌స్టకు మూడు గంటల సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధి ప్రత్యూష.
దాతలను ఆపన్నులను కలిపేస్తుంది!
సహాయం కోసం ఎదురుచూసే వారు ఎంతోమంది ఉంటారు. సహాయం అందిస్తామనే వారూ చాలామందే ఉంటారు. ఈ రెండు వర్గాల వారినీ కలిపేందుకు.. సోలిక్స్ అనే సంస్థ ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ (టీఏఎల్)’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. పలు రంగాల్లోని కంపెనీలకు అవసరమైన విస్తృతస్థాయి డేటాను అందించే ఈ సంస్థ, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టీఏఎల్ హాస్పిటల్స్‌ను తీసుకువచ్చింది. అవసరార్థులైన రోగులను డాక్టర్లతో వర్చువల్‌గా కలుపుతోంది. అదీ ఉచితంగా! అంతేనా, ఆర్థిక సహాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ సహాయమూ అందిస్తామంటున్నారు ఈ సంస్థ ప్రతినిధులు.
ఇంపాక్ట్ చూపుతోంది
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి సమస్యకూ హాస్పిటల్‌కు పరుగుపెట్టాలంటే కష్టం. కానీ, రోగి ఆరోగ్యస్థితిని బట్టి ఓ 10-18 గంటలు ముందుగానే ఫలానా సమస్య వచ్చే అవకాశం ఉందనే హెచ్చరిక చేసే ఏర్పాటు ఉంటే? అదే చేస్తున్నామంటోంది ఏకేటీ హెల్త్ ఎనలిటిక్స్. ‘ఇంపాక్ట్ హెల్త్’ పేరిట.. ఈసీజీ మానిటర్, వేరబల్ టెంపరేచర్ మానిటర్, రెస్పిరేటరీ, బీపీ స్థాయులను తెలిపే వేరబుల్ మెడికల్ ఉపకరణాలను ఈ సంస్థ విడుదల చేసింది.
ఊబకాయులూ ఊపిరిపీల్చుకోండి!
ఉబకాయం.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్యలలో ఒకటి. ఈ ఊబకాయం కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలూ వస్తుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా.. వ్యాయామాలు, ఆకలిని మందగింపజేసే ఔషధాలు.. అవి ఫలితం ఇవ్వకపోతే లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ బాధలేవీ లేకుండా ఒక్క వ్యాక్సిన్‌తో ఊబకాయానికి చెక్ పెట్టలేమా అని అంటే.. ప్రస్తుతానికి లేదు కానీ మరో నాలుగైదేళ్లలో ఆ కల సాకారం కాబోతుందని చెబుతున్నారు యుటోపియా థెరపాటిక్స్ సంస్థ ప్రతినిధులు. డ్రగ్ డిస్కవరీలో అపార అనుభవం కలిగిన గోపి కడియాల నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజ వేసిందని ఆ సంస్ధ ప్రతినిధులు తెలిపారు. ఈ టీకా ఆకలిపై కాక.. ఫ్యాట్ మెటబాలిజమ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని వారు వివరించారు. కాలేయం, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంతో పాటు ట్రై గ్లిజరైడ్స్, విజరల్ ఫ్యాట్‌ను సైతం తగ్గిస్తుందని ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైనట్టు తెలిపారు. ఈ సంవత్సరమే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.
ముఖం చూసి రోగం చెప్పేస్తుంది
గతంలో వైద్యులు నాడి చూసి రోగం చెప్పేసేవారు. కళ్లు, నాలుక చూసి.. పేషెంట్ ఆరోగ్య సమస్యలను గుర్తించేవారు. ఇప్పుడు సాంకేతికతతో అదే పనిచేస్తామని సియానా హెల్త్ అనే సంస్థ చెబుతోంది. జెనెటిక్స్, ఏఐ సాయంతో.. ఒక వ్యక్తి ముఖం చూసి 88ు కచ్చితత్వంతో అతడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తామంటోంది. సియానా హెల్త్ యాప్ ద్వారా మన ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. 25 రకాల హెల్త్ పారామీటర్లను (బీఎంఐ, మధుమేహ ముప్పు వంటివి) అంచనా వేసి చెబుతుంది. అంతేనా, మందులు ఏ సమయంలో వేసుకోవాలి లాంటి వాటి గురించి అప్రమత్తం చేస్తుంది.
ఏఐతో క్యాన్సర్ గుర్తింపు
క్యాన్సర్ నిర్ధారణ కొంచెం క్లిష్టమైన పని. దాన్ని సులభతరం చేసేందుకు అమర్‌నాథ్ మెడికల్స్ అనే సంస్థ ఒక ఏఐ టూల్‌ను రూపొందించింది. కణజాలంలోని ప్రతి కణాన్నీ విశ్లేషించి క్యాన్సర్‌ను నిర్ధారించడంతోపాటు అది ఏ స్టేజ్‌లో ఉందనే విషయాన్ని కచ్చితంగా తెలుపుతుంది. ఏఐ వినియోగంతో.. క్యాన్సర్ నిర్ధారణ సమయం తగ్గడంతోపాటు, ఫలితాలు కచ్చితంగా ఉంటాయని నిర్వాహకులు శశాంక్ గుప్తా తెలిపారు.
Updated Date - Feb 26 , 2025 | 05:07 AM