నిరసన ధ్వనుల మధ్య బిల్లుల ఆమోదం
ABN , First Publish Date - 2021-07-29T06:31:48+05:30 IST
పెగాసస్ నిఘా, సాగు చట్టాలు తదితర అంశాలపై బుధవారం పార్లమెంట్ ఉభయ

- పెగాసస్, సాగుచట్టాలు సహా పలు
- అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు
- లోక్‌సభ వెల్‌లోకి విపక్ష ఎంపీలు
- పేపర్లు చింపి విసిరి హల్‌చల్
- దివాలా, ఖాయిలా కోడ్, బాలల
- న్యాయ సంరక్షణ బిల్లులకు ఓకే
- భారత ప్రజస్వామ్య ఆత్మపై మోదీ, అమిత్ షా దెబ్బ: రాహుల్
- ఏకతాటిపైకి 14 పార్టీలు
- పెగాసస్‌పై విపక్ష నేతల భేటీ
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పెగాసస్ నిఘా, సాగు చట్టాలు తదితర అంశాలపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలూ దద్దరిల్లాయి. ప్రతిపక్షాల నిరసనలు, సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి గందరగోళం సృష్టించడంతో గురువారానికి వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం మధ్యే.. లోక్‌సభలో దివాలా, ఖాయిలా కోడ్ (సవరణ) బిల్లు, రాజ్యసభలో బాలల న్యాయ సంరక్షణ సవరణ బిల్లు ఎటువంటి చర్చా లేకుండానే ఆమోదం పొందాయి. లోక్ సభలో అనుబంధ పద్దులకు కూడా ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే.. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా తొలిసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా గంటసేపు నిర్వహించారు.
ఆ తర్వాత.. రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ స్థానంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలు తమ నిరసనను తీవ్రతరం చేశాయి. ముఖ్యంగా.. కాంగ్రెస్ నేతలు గుర్జీత్ అవుజలా, టీఎన్ ప్రతాపన్, హిబి ఎడెన్, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నేతలు పేపర్లు చింపి గాల్లోకి ఎగరేశారు. కాంగ్రెస్ నేత జస్బీర్ సింగ్ గిల్ ‘ఖేలా హోబె (ఆట జరుగుతుంది)’ అనే నినాదాన్ని చేశారు. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
ఇలా మధ్యాహ్నం 12 గంటల నుంచి సభ నాలుగుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదాపడ్డప్పుడు ప్రతిపక్ష నేతలు.. పెగాసస్ నిఘాపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేయించాలంటూ అతి పెద్ద బ్యానర్‌ను లోక్‌సభలోకి తీసుకువచ్చి ప్రదర్శించారు. గందరగోళం మధ్యే ప్రత్యేక ప్రస్తావనలను స్పీకర్ అనుమతించారు. ఆ తర్వాత.. దివాలా, ఖాయిలా, కోడ్ (సవరణ) బిల్లును, ఆర్థిక పద్దులను ఆమోదించారు. గురువారానికి లోక్ సభ వాయిదా పడింది.
రాజ్యసభలో..
రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైంది. కానీ.. తర్వాతఅయిదు నిమిషాలకే సభ వాయిదా పడింది. సభ మళ్లీ సమావేశమయ్యాక.. సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సభలో ఎలాంటి ప్లకార్డులనూ ప్రదర్శించవద్దని వెంకయ్య ఆదేశించారు. ఇలా, వాయిదాలు, విపక్షాల నిరసనల మధ్యే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ‘బాలల న్యాయ సంరక్షణ (సవరణ) బిల్లును’ ప్రవేశపెట్టగా దాన్ని ఎలాంటి చర్చా లేకుండా ఆమోదించారు. సభను గురువారానికి వాయిదా వేశారు.
కాగా.. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు, పేపర్లను చింపి గాల్లోకి విసిరివేసినందుకు పది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు.. మానిక్కం టాగోర్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్, హబి ఎడెన్, గుర్జిత్ సింగ్ అవుజలా, దీపక్ బైజ్, ఏఎం ఆరిఫ్, డీన్ కురియకో్‌సలపై సస్పెన్షన్ వేటు వేయాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లాకు నివేదించారు.
పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలపై బీజేపీ మండిపడింది. పెగాసస్ నిఘా ద్వారా.. మోదీ, షా భారత ప్రజాస్వామ్య ఆత్మను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో అధికారులను ప్రశ్నించడానికి బుధవారం జరగాల్సిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం.. చాలినంత సభ్యుల సంఖ్య లేకపోవడంతో వాయిదా పడింది.
ఏకతాటిపైకి 14 పార్టీలు
పెగాస్‌సపై విపక్ష నేతల భేటీ
న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): పెగాసస్ కుంభకోణంపై ప్రతిపక్షం పట్టు బిగిస్తోంది. బుధవారం అత్యంత అరుదైన రీతిలో దాదాపు 14 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై సంఘటిత కార్యాచరణపై చర్చించాయి. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆమ్ ఆద్మీ, ఆర్‌ఎ్‌సపీ, కేరళ కాంగ్రెస్, విదుతలయి చిరుతైగల్ కచ్చి, ఐయూఎంఎల్ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ పరిణామంతో దేశంలో ప్రతిపక్ష ఐక్యతకు గట్టి పునాది ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.