India-World Bank: ఇలా చేస్తే ఇండియా నంబర్ 1.. ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:15 PM
India-World Bank: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం టాప్‌లో ఉంది. ఈ విధానాలు గనుక ఇండియా అనుసరిస్తే అమెరికా, చైనాలను మించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే ఛాన్స్ ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

India-World Bank: ఇండియా ధనిక దేశంగా మారాలంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా మారాలంటే భారత్ ప్రతి ఏడాది సగటున 7.8శాతం వృద్ధిని సాధించాలి. ప్రస్తుతం ఇండియాలో తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ. 2.22 లక్షలుగా ఉంది. ప్రస్తుత స్థాయి నుంచి తలసరి స్థూల జాతీయ ఆదాయం 17.48 లక్షలు అంటే దాదాపు 8 రెట్లు పెరిగితేనే.. 2047 నాటికి భారతదేశం అధిక ఆదాయ దేశంగా మారుతుందని.. అందుకోసం ఈ సూత్రాలను ఆచరణలో పెట్టాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.
ఈ రంగాల్లో సమాంతరంగా అభివృద్ధి చెందితే..
ప్రపంచంలో నెం.1 దేశంగా భారత్ మారాలంటే.. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. దేశంలో కొత్త పెట్టుబడులు పెరగాలి. పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ సృష్టించగలగాలు. మరీ ముఖ్యంగా మౌలిక వసతులను బలోపేతం చేయాలి. రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపరచడం వల్ల వ్యాపార వాతావరణం మెరుగవుతుంది. దీనితోపాటు విద్యా వ్యవస్థను ఆధునికీకరించాలి. సాంకేతిక నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పరిశోధన (R&D) రంగంలో పెట్టుబడులను పెంచాలి.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలి..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారతదేశం 2032 నాటికి ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా మారుతుందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఇది సాకారం కావాలంటే దేశంలో ఉన్న యువశక్తిని సద్వినియోగం చేసుకుని.. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి. కార్మిక నిబంధనలను సరళీకరించి, మరింత మంది ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్పాదకతను పెంచేందుకు తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భార్ భారత్ లాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యాపార నిబంధనలను సరళీకరించాలి.
2047 నాటికి నెంబర్ 1 కావాలంటే..
భారత వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా మార్చాలి. కొత్త సాంకేతికతలను అందుబాటులోకి తేవాలి. కర్షకులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా వ్యవస్థను మార్చాలి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలి. ఈ మార్గంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందితే, 2047 నాటికి ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాలు, ప్రజల భాగస్వామ్యం, పరిశ్రమల సహకారం ఉంటే, భారతదేశాన్ని ధనిక దేశంగా మార్చడం అసాధ్యం కాదు.
Read Also : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఇంట్లో షూస్ వేసుకోని వివేక్ రామస్వామిపై భారీ స్థాయిలో ట్రోలింగ్!
ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా.. మెమొరబల్ ట్రిప్ కావాలంటే ఈ ప్రాంతాలు చూడండి..