India vs England: ఎవరిది పైచేయి!
ABN , First Publish Date - 2021-08-02T22:23:44+05:30 IST
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 4 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇది వచ్చే ప్రపంచ టెస్ట్

లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 4 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇది వచ్చే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో ఇరు జట్లు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాతో ఆ దేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భారత్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ 3-1తో విజయం సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
అయితే, ఈసారి మాత్రం ఇంగ్లండ్ సొంతగడ్డపై ఆడుతుండడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అయితే, చివరిసారి న్యూజిలాండ్ చేతిలో మాత్రం ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన పోరులో ఎవరిది పైచేయో ఒకసారి చూద్దాం.
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 122 టెస్టులు జరిగాయి. ఇండియా 29, ఇంగ్లండ్ 48 టెస్టుల్లో విజయం సాధించాయి. 49 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 1932లో లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 20 ఏళ్లకు గానీ ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయాన్ని రుచి చూడలేకపోయింది.1952లో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆ తర్వాత ఇంగ్లండ్‌పై మరో విజయం కోసం పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 1962లో ఇంగ్లండ్‌పై ఇండియా తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇరు జట్లు ఇప్పటి వరకు 122 సార్లు టెస్టుల్లో తలపడ్డాయి. 48 సార్లు విజయం సాధించిన ఇంగ్లండ్ భారత్‌పై పైచేయి సాధించింది. భారత జట్టు 29సార్లు విజయాన్ని అందుకుంది. మొత్తం టెస్టుల్లో 62 ఇంగ్లండ్‌లో జరగ్గా టీమిండియా 7సార్లు మాత్రం గెలిచింది. 34 మ్యాచుల్లో ఇంగ్లండ్ గెలుపొందగా, 21 డ్రా అయ్యాయి.