వీరబ్రహ్మం అడుగుజాడల్లో...

ABN , First Publish Date - 2021-05-16T05:36:44+05:30 IST

బ్రహ్మంగారి పేరు తెలియని, కాలజ్ఞానం గురించి మాట్లాడని తెలుగు వారు ఉండడం అరుదు. 17వ శతాబ్దంలోనే ఒక సామాజిక విప్లవాన్ని సాధించి, కులమతాలకు అతీతంగా...

వీరబ్రహ్మం అడుగుజాడల్లో...

బ్రహ్మంగారి పేరు తెలియని, కాలజ్ఞానం గురించి మాట్లాడని తెలుగు వారు ఉండడం అరుదు. 17వ శతాబ్దంలోనే ఒక సామాజిక విప్లవాన్ని సాధించి, కులమతాలకు అతీతంగా, బ్రాహ్మణుల దగ్గరినుంచి మాదిగల వరకు ప్రజలందరిని అక్కున చేర్చుకొని ఒక సమాంతర ఆధ్యాత్మిక వ్యవస్థను సృష్టించిన మహాత్ముడు వీరబ్రహ్మం. భగవంతుడు వేరుగా ఉండడని ప్రతి వారిలోని ఆత్మ పరమాత్మ ఒకటేనని ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూడండి అని ఇందుకోసం గుడులు, అర్చనలు, విగ్రహారాధనలతో పనిలేదని ఒక సమాంతర జీవన విధానాన్ని ప్రతిపాదించారు. తమలో తాము పరమాత్మను చేరడానికి ప్రతి కులం వారికి యోగవిద్యాసాధనకు అర్హత ఉందని, స్త్రీలు అందుకు అర్హులేనని తనదైన విధానాన్ని ప్రజలకు అందించిన సామాజిక వీరుడు వీరబ్రహ్మం. ఆయన కడప జిల్లా కందిమల్లాయపల్లెలో 1672 ప్రాంతంలో జీవసమాధి పొందారు. అక్కడే బ్రహ్మంగారి మఠం ఏర్పడింది. నాటి నుంచి ఆయన వారసులు దానికి పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. నేటికి 7వ తరం వారు 11వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వర స్వాముల వారు ఇటీవల కన్నుమూశారు. సంప్రదాయం ప్రకారం శివైక్యం చెందారని అనుయాయులు భావిస్తారు.


వేంకటేశ్వర స్వాముల వారిని రెండు సార్లు కలిసి మాట్లాడే మహత్తర అవకాశం నాకు లభించింది. 1985లో రుంజలపై నా పరిశోధన నేపథ్యంలో వారిని నేను కలిసాను. వారు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎక్కువ సేపు వారితో మాట్లాడే వీలు కలుగలేదు. ఆరోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆయనను దర్శించుకోవాలని వారి పవిత్రమైన మాటలు వినాలని ఎదురుచూస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ ఒక పరిశోధన పథకాన్ని రూపొందించాను. ‘విప్లవకవియోగి వీరబ్రహ్మం’ అనేది ఆ పరిశోధన. దీనిలో భాగంగా కడప, కర్నూలు జిల్లాలలోను దాదాపు 24 గ్రామాలలో తిరిగాను. బ్రహ్మంగారు ప్రధానంగా బోధలు చేసిన గ్రామాలలో తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడాను. వీటిలో ప్రధానమైనవి బనగానపల్లె, రవ్వలకొండ, యాగంటి, కందిమల్లాయపల్లె, మడుమాల, వనిపెంట, అల్లాడు పల్లె. ఎక్కువ సమయం కందిమల్లాయపల్లెలోనే గడిపాను. అక్కడ వేంకటేశ్వర స్వాముల వారు, ఆయన మేనేజరు ఈశ్వరాచారి అన్ని సౌకర్యాలు అందజేయడంతోపాటు ఎంతో విలువైన సమాచారాన్ని కూడా అందించారు. 


వసంత వేంకటేశ్వర స్వాముల వారు నన్ను తమ సన్నిధిలో కూర్చుండ బెట్టుకొని దాదాపు గంటన్నరసేపు మాట్లాడారు. నేను, నా భార్య జయలక్ష్మి వారి మాటలు విని పరమానందం పొందాం. వారు ఆధ్యాత్మిక చింతన భావనలు సర్వమానవ కళ్యాణాన్ని సమానత్వాన్ని కోరుకునేవి. స్వామి వారు వేదవేదాంగాలలో పండితుడు మాత్రమే కాదు. తెలుగు సాహిత్యంలో అసాధారణమైన పాండిత్యం ఆయన సొంతం. మహాభారతం, ప్రబంధ కావ్యాలు, పోతన భాగవతం నుంచి ఎన్నో ఖండికలు అనర్గళంగా చదివి వ్యాఖ్యానించారు. వారి గురించి పూర్తిగా తెలియని నేను నిబిడాశ్చర్యానికి గురయ్యాను. ఆయన తెలుగు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి విలువైన ఆధ్యాత్మిక బోధలు చేశారు. బ్రహ్మంగారి సామాజిక చింతనను అహరహం అనుభవించి ఇతరులకు అనుభవింపచేసే ప్రయత్నం చేశారు. 


వారింట్లో పై అంతస్తులో కొన్ని వేల పుస్తకాలతో అపురూపమైన సంస్కృతాంధ్రగ్రంథాలయం ఉంది. ఆయన రోజు కొన్ని గంటలు అక్కడ గడుపుతారని కుటుంబసభ్యులు చెప్పారు. మరొక మాట కూడా తెలిసింది. ఆయన తన గ్రంథాలయంలోని పుస్తకాలను ఎవరికీ ఇవ్వరని. ఇవ్వక పోవడం తీవ్రమైన పఠితకుండే మరొక గుణం. 


వారితో మాట్లాడిన సమయం, తెలుసుకున్న జ్ఞానం, వారి ఆత్మీయత ఎన్నటికీ మరువలేనివి. బ్రహ్మంగారి వారసత్వంగా వచ్చిన అచలమతబోధన యోగమార్గాలను వారి వారసులు అందరు ప్రచారం చేశారు. ఆయన తండ్రి శ్రీనివాస స్వామి అశ్వారోహణం చేస్తూ దేశం నలుమూలలు తిరిగి బ్రహ్మం సంప్రదాయాన్ని, సమసమాజ భావాలను ప్రచారం చేశారని ప్రజలు చెబుతారు. ఆ సంప్రదాయాన్ని తను కూడా పాటించి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి వసంత వేంకటేశ్వర స్వామి వారు. ఆయన చేసిన మరొక గొప్ప సేవ కూడా ఉంది. అప్పటిదాకా ప్రచురించబడని వీరబ్రహ్మం గారి సమగ్ర సాహిత్య ప్రచురణను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. కాలజ్ఞానం ప్రతులు సేకరించి పండిత పరిష్కరణ చేయించి మఠం తరఫున ఒక ప్రామాణిక ప్రతిని ప్రచురింపచేశారు. అప్పటిదాకా అముద్రితంగా ఉన్న కాళికాంబ శతకం పద్యాలు, వేరు వేరు శీర్షికల కింద మకుటాలతో ఉన్న ఇతర పద్యాలు ఒక గ్రంథంగా వెలువరించారు. ఈ యజ్ఞంలో పనిచేసిన వారిలో కీర్తికాయులైన కొండవీటి వెంకటకవి, డా. వివియల్. నరసింహారావు ప్రముఖులు. ఎప్పుడూ బ్రహ్మంగారి పీఠంలో ఆస్థాన విద్వాంసులు ఉండడం ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది. వారిద్దరూ అలా ఆస్థాన విద్వాంసులుగా పనిచేసారు. తర్వాత ప్రస్తుతం పెదపాటి నాగేశ్వరరావు ఈ పనిచేస్తున్నారు. వారి ఇంట్లో ఆయన సన్నిధిలో నేను నా అర్ధాంగి జయలక్ష్మి భోజనం చేయడం మరువలేని అనుభూతి. వారి ఆత్మీయత. వచ్చిన భక్తుల పట్ల చూపే ప్రేమ నేను ప్రత్యక్షంగా చూశాను. వీరబ్రహ్మం సంప్రదాయానికి ఇంత సేవచేసిన వారు మననుండి కనుమరుగు కావడం, నేడు కీర్తికాయులు కావడం చాలా బాధాకరం. వారి వారసులు వీరబ్రహ్మం సంప్రదాయాన్ని అకుంఠితంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.

ప్రొ. పులికొండ సుబ్బాచారి

Updated Date - 2021-05-16T05:36:44+05:30 IST