..ఇది నడియేట తీరాల వేట

ABN , First Publish Date - 2021-06-24T06:22:26+05:30 IST

పూర్వకాలంలో వృత్తిసైనికులు ఉండేవారు. ఏది న్యాయపక్షం అన్నదానితో నిమిత్తం లేకుండా, తమకు తగిన ప్రతిఫలం లభించే పక్షం వైపు నిలబడి యుద్ధాలు చేసేవారు....

..ఇది నడియేట తీరాల వేట

పూర్వకాలంలో వృత్తిసైనికులు ఉండేవారు. ఏది న్యాయపక్షం అన్నదానితో నిమిత్తం లేకుండా, తమకు తగిన ప్రతిఫలం లభించే పక్షం వైపు నిలబడి యుద్ధాలు చేసేవారు. బౌద్ధిక శక్తియుక్తులను కూడా గుండుగుత్తగా కానీ, విడతకొకరికి కానీ విక్రయించుకునే వ్యూహకర్తలు పూర్వం కూడా ఉండేవారు. జడత్వంలో, అసమర్థతలో కూరుకుపోయి, సృజన, చేవ చచ్చిపోయిన సందర్భాలలో, ఒక బయటి వ్యక్తి ఎటువంటి రాగద్వేషాలు లేకుండా పరిస్థితిని సమీక్షించి, పరిష్కారాలు చూపగలుగుతాడు, కొత్త కోణాలను చూడడానికి సాయపడగలుగుతాడు. ప్రజల భాగస్వామ్యంతో, వారి భవితవ్యాన్ని నిర్ణయించవలసిన ప్రజాస్వామ్య ప్రక్రియలలో కూడా ఇటువంటి ‘కిరాయి’ నిపుణులు ఉండడమేమిటని ఆశ్చర్యం కలుగుతుంది కానీ, దృక్పథాలను, విధానాలను కూడా కార్పొరేట్ కన్సల్టన్సీలకు ప్రభుత్వాలే అప్పగిస్తున్న భావదారిద్ర్యపు రోజుల్లో, ఎన్నికల వ్యూహాలకు సాంకేతిక సహాయాలను, అపాయాలను తప్పించే ఉపాయాలను బయటి నుంచి రాబట్టుకుంటే తప్పేమిటి? 


వృత్తి వ్యూహకర్తల మంచిచెడ్డల చర్చ పక్కన పెడితే, నువ్వు కనుక నాయకత్వం చేపట్టి, వచ్చే మోదీ వ్యతిరేక ఎన్నికల యుద్ధానికి నేతృత్వం వహిస్తే, నేను నీ పక్షాన నిలబడతాను అని కృష్ణ పరమాత్మ లాగా ప్రశాంత్ కిశోర్ అభయం ఇచ్చినా కూడా కిక్కురుమనకుండా ముసుగు తన్నుకుని పడుకునే నాయకుడినే రాహుల్ గాంధీ అంటారు. ప్రశాంత్ కిశోర్‌కు ఏవో మహిమలూ లేవు, మంత్రాలూ రావు, కాకపోతే, ఆయన బయోడేటా బాగున్నది. 2012లో గుజరాత్ దగ్గర నుంచి మొదలుపెట్టి, 2021లో బెంగాల్ దాకా ప్రశాంత్ కిశోర్ అటు పడమటి నుంచి ఇటు తూర్పు దాకా విజయవిహారం చేశాడు. అన్నిటి కంటె మించి 2014లో నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి విజయానికి ఆయన తన తెలివితేటలను ఖర్చుచేశాడు. 2017లో యోగి విజయంలో కూడా ఆయనకు వాటా ఉన్నది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను దరిచేర్చిన నావికుడూ ఆయనే. అటువంటి వాడు, తనవల్ల దేశానికి అపకారం జరిగిందని పశ్చాత్తాప పడుతున్నాడో, లేక, కేవలం తాను ఏ పక్షాన్నైనా గెలిపించగలనని నిరూపించదలచుకున్నాడో, ఈ మధ్య బిజెపి వ్యతిరేక పక్షాలకు తన సేవలు అందించి, బెంగాల్‌లో మమతను, తమిళనాడులో స్టాలిన్‌ను గెలిపించడానికి కృషి చేశాడు. బెంగాల్ ఘనవిజయంతో ఢిల్లీ కోటనే గురిపెట్టాలని అనుకుంటున్నాడు. కొవిడ్ కల్లోలం వల్ల మోదీ ప్రతిష్ఠ దిగుముఖంలో ఉన్నది, రాహుల్ గట్టిగా నిలబడితే మంచి ఫలితం ఉంటుందని అనుకున్నాడు. ప్రశాంత్ కిశోర్ వంటి వాళ్లను ఆశ్రయించకూడదని కాంగ్రెస్‌కు ఏదో పెద్ద పట్టింపు ఉంటుందని ఎవరూ భ్రమించడం లేదు. అయినా, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ నుంచి మరెవరు కానీ నిశ్శబ్ద ముద్ర వీడలేదు.


వృత్తి వ్యూహకర్తలు ఒకరినే పట్టుకు వేలాడరు కదా, మరొక మార్గాన్ని అన్వేషిస్తారు. మోదీని, ఆయన పార్టీని ఎదుర్కొనాలని నిశ్చయంగా ఉన్నాడు కాబట్టి, అందుకు ఆలంబనగా నిలబడగలిగే నూతన పక్షాన్ని నిర్మించాలని కూడా ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే శరద్ పవార్‌తో ఆయన తరచు కలుస్తున్నారు. బుధవారం నాడు జరిగిన భేటీతో కలుపుకుని ఇప్పటికి మూడు సార్లు వాళ్లిద్దరూ కలుసుకున్నారు. మంగళవారం నాడు ఢిల్లీలో శరద్ పవార్ ఇంట్లో జరిగిన రాష్ట్ర మంచ్ సమావేశంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు భేటీ అయ్యారు. బిజెపికి ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఉద్దేశ్యంతో అనేక పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఏర్పాటు చేసుకున్న తటస్థ వేదిక రాష్ట్రమంచ్. కాంగ్రెస్ ప్రాతినిధ్యం కూడా మంచ్‌లో ఉన్నది కానీ, మంగళవారం సమావేశంలో వాళ్లెవరూ రాలేదు. దానితో, పవార్ ఆధ్వర్యంలో మూడో ఫ్రంట్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ మొదలయింది. అటువంటి ప్రయత్నాల వల్ల ఫలితం ఏమాత్రం ఉంటుంది, నాయకత్వం సంగతేమిటి వంటి ప్రశ్నలు చర్చల్లో వేడివేడిగా తలెత్తుతున్నాయి. 


ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. అప్పుడే, 2024 సార్వత్రక ఎన్నికల గురించిన సన్నాహాలా అనిపించవచ్చు. బెంగాల్ ఫలితాలు అందించిన ఉత్సాహం అది. కేవలం ఉత్సాహం ఉంటే సరిపోతుందా? అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిష్ఠ తగ్గిపోతే చాలా? అవకాశాన్ని అందిపుచ్చుకునే శక్తి ఉండాలి కదా? కేంద్రంలో సుదృఢ అధికారంలో ఉన్న బిజెపికి ఇప్పటికీ తిరుగులేని ప్రజాభిమానం ఉన్నది. యోగేంద్ర యాదవ్ అన్నట్టు, రాజ్య బలాన్ని రెట్టింపు చేయగలిగిన వీధి బలం కూడా ఉన్నది. సమస్త వ్యవస్థలనూ సంస్థలనూ విధేయం చేసుకోగలిగిన తెగింపు ఉన్నది. అన్నిటికి మించి విలువలను, ఆలోచనలను ప్రభావితం చేయగలిగిన సైద్ధాంతిక భావజాలం ఉన్నది. ఏ ప్రతిపక్షానికి మాత్రం వీటిలో ఏ శక్తి, ఏ సామర్థ్యం ఉన్నాయి? తామూ కొంత కాషాయం పులుముకుంటే, తమకూ ఆదరణ లభిస్తుందనుకునే పౌండ్రక బుద్ధులే తప్ప, సొంతంగా ఏమున్నదని? గొంతూ వెన్నెముకా బుద్ధీ లేని ఈ పక్షాలన్నీ పంచకూళ కషాయంగా మారి, ఓటర్లకు ఏమి ఆశ కలిగిస్తారు? నరేంద్రమోదీ మీద ఏమి విరక్తి కలిగిస్తారు? సారాంశం పెద్దగా లేనప్పటికీ, తిమ్మిని బమ్మిని చేసి ఫలితాలు రాబట్టడం తెలుసు కాబట్టి, ప్రశాంత్ కిశోర్ ఈ కొత్త ప్రయత్నాల ద్వారా ఒక ముందడుగు సాధించగలరేమోనన్న ఆశ లేకపోలేదు. మరి నాయకత్వం మాట? మమతాబెనర్జీకి ఆశ ఉండవచ్చును, ఆమె స్థైర్యాన్ని చూసి ప్రశాంత్ కిశోర్‌కు ముచ్చట కలిగి ఉండవచ్చును కూడా. కానీ జాతీయ చిత్రపటం మీద ఆమెకు ఇంకా అంత చెలామణి రాలేదని ఆయనకు తెలిసే ఉంటుంది. శరద్ పవార్ ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నా, అపారమైన రాజకీయ అనుభవం ఆయనకు గౌరవం కలిగిస్తున్నా, వయో భారం ఆయనను ప్రత్యామ్నాయనేతగా నిలబెట్టడానికి ప్రతికూల అంశం అవుతుంది. మహారాష్ట్రకు వెలుపల ఆయన ప్రఖ్యాతి పరిమితమే. పవార్ కూడా వ్యక్తిగతంగా ఎటువంటి ఆశలు లేకుండానే ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మొదటి స్థానానికీ రెండో స్థానానికీ మధ్య చాలా దూరమే ఉండవచ్చును కానీ, నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయే. రాహుల్‌కు ఉన్న ఆ ప్రతిపత్తి బలపడకుండా కాంగ్రెస్ అనే జడాత్మక సంస్థే అడ్డుపడుతున్నట్టు కనిపిస్తున్నది. అందుకే, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత ప్రయత్నాలు మొదలుపెట్టమని రాజ్‌దీప్ సర్దేశాయి సలహా ఇస్తున్నారు. రాహుల్ గాంధీ లేని ఫ్రంట్, నాయకత్వం లేని కూటమే అవుతుంది. రాహుల్ ఉంటే అది మూడోది కాదు రెండోదే అవుతుంది. అనేక రాష్ట్రాల్లో తమకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య సమస్యలున్నాయి కాబట్టి, యుపిఎ కూటమి భాగస్వాములు మినహా ఇతరులతో ఎన్నికలకు ముందు స్నేహం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. 


ఎంత చెడినా కాంగ్రెస్ దేశవ్యాప్త దృశ్యంలో పెద్ద పార్టీయే. భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్‌కూ మధ్య ముఖాముఖీ పోటీ జరిగిన లోక్‌సభ స్థానాలు 170కి పైనే ఉన్నాయి. ఏ ఇతర పార్టీతోనూ అన్ని ముఖాముఖీపోటీలు బిజెపికి లేవు. 2019 ఎన్నికలలో బిజెపి 38 శాతం ఓట్లను పొందగా, కాంగ్రెస్ 20 శాతం పొందింది. తక్కిన 42 శాతంలోనే ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు సర్దుకున్నాయి. గణాంకాలు సానుకూలత చూపుతున్నా, ప్రత్యామ్నాయ నిర్మాణం కోసం ఇతరులు చొరవతీసుకుని పిలుస్తున్నా, కాంగ్రెస్ కదలడం లేదు. తెలంగాణ పిసిసి అధ్యక్ష నియామకంలో సాగుతున్న జాప్యాన్ని చూస్తే ఆ పార్టీ దయనీయ స్థితి అర్థమవుతుంది. 


కాంగ్రెస్ నిద్రాణ స్థితి ఒక ప్రతిబంధకమయితే, ప్రాంతీయ పార్టీల అవకాశవాద స్థితి ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు మరొక అవరోధం. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ, తెలంగాణలో కెసిఆర్ ఎన్నికల ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీ ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. పథకాలను ఆశపెడుతున్నారు. కానీ, ఆయన గురి, పరిధి తెలంగాణను దాటడం లేదు. దేశంలో మూడో ఫ్రంట్ గురించి, ఫెడరల్ ఫ్రంట్ గురించి ఇంత చర్చ జరుగుతుంటే, అందులో కెసిఆర్ పేరు వినిపించకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. నరేంద్రమోదీపై యుద్ధానికి ప్రతిపక్షాలకు శక్తీ ఆసక్తీ రెండూ లేవని చెబుతూ, బిజెపి పై పోరాటంలో కెసిఆర్‌ను నమ్మగలమా చెప్పండి అని స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. జగన్ కూడా ఎప్పటి వలెనే, బహుశా ప్రశాంత్ కిశోర్ చెప్పిన చిట్కాల మేరకే కాబోలు, తాకట్టులతో, అప్పులతో ధనం సేకరించి అనుచిత ఉచితాల పందేరాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బెయిలు రద్దు, జెయిలు వంటి మాటలు ఆయన ప్రయాణానికి అడ్డు తగలకపోతే, ఈ వితరణ కార్యక్రమమే తనను మళ్లీ గెలిపిస్తుందని అనుకుంటున్నారేమో లేక, అనుకోనిది జరిగి తన అధికారం పోయినా ఈ పథకాలు కుటుంబాధికారాన్ని కాపాడతాయని ఆశిస్తున్నారేమో-? ఈ రాష్ట్రాధినేత కూడా స్వచర్మ సంరక్షణలోనే నిమగ్నం కాక తప్పదు కాబట్టి, రెండోదో, మూడోదో ఏ కూటమిలోనూ చేరే అవకాశం లేదు. 


చిత్తశుద్ధీ లక్ష్యశుద్ధీ లేని పార్టీలను అతుకులు వేసి ఒక బొంత కుడితే ఉపయోగమేమిటి? అవినీతి ఆరోపణలు గుమ్మరించి, ప్రజావ్యతిరేకతను వ్యాపింపజేసి, ముప్పేటలా కమ్మేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు కూర్చోవడానికి నరేంద్రమోదీ మన్మోహన్ సింగ్ కాదు. సర్వశక్తులనూ సంధించి, విశ్వరూపం ప్రదర్శించగలరు. ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలనుకునేవారు, వాస్తవదృష్టిని కలిగి ఉండాలి, నిజమైన శక్తులను కూడగట్టుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే గింటే అది పార్టీల రూపం తీసుకుని తీరాలని ఏమీలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ప్రతిపక్షమూ పోరాడింది లేదు, ప్రజలు పోరాడుతుంటే వెనుక నిలబడి సొమ్ము చేసుకోవడం తప్ప. ఆసేతు హిమాచలం ఒకసారి పరికించి చూస్తే, ప్రజలు తమంతట తాము నిర్మించుకున్న ప్రతిఘటనలు కనిపిస్తాయి. వాటిలో నుంచి కొత్త ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయి.


కె. శ్రీనివాస్

Updated Date - 2021-06-24T06:22:26+05:30 IST