Abn logo
Apr 25 2021 @ 00:00AM

సీత పాత్ర... అంత ఈజీ కాదు!

‘‘నేను చదివింది బీటెక్‌. ఇష్టపడింది మోడలింగ్‌. స్థిరపడింది నటిగా. ఎక్కడైనా నన్ను నేను నిరూపించుకోవడానికి కష్టపడతాను. నా గుర్తింపు ఆ కష్టంతో వచ్చిందే!’’ అంటారు కృతి సనన్‌. ‘1- నేనొక్కడినే’ తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన కృతి ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఆది పురుష్‌’ చిత్రంలో సీతగా... తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైన పాత్రను ఆమె పోషిస్తున్నారు. ‘ఆది పురుష్‌’ గురించీ, ‘సీత’గా తనను తాను మలచుకోడానికి చేస్తున్న ప్రయత్నం గురించీ కృతి మాటల్లోనే...


‘‘దర్శకుడు ఓమ్‌ రౌత్‌ ‘ఆది పురు్‌ష’లో సీత పాత్ర కోసం నన్ను కలిసినప్పుడు నాలో కలిగిన ఆనందాన్నీ, ఉద్వేగాన్నీ మాటల్లో చెప్పలేను. అదే సమయంలో ఎంతో భయం కూడా వేసింది. సీత మన దేశమంతా ఆరాధించే పవిత్రమైన స్త్రీమూర్తి. ఆమె గురించి తెలియనివారెవరూ లేరు. సీత పాత్రను ఔచిత్యం చెడకుండా నటించి, మెప్పించడం అంత సులభం కాదు. ఇది దేశమంతా విడుదలయ్యే సినిమా. ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ లాంటి స్టార్స్‌ నటిస్తుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. అందుకే ‘ఆది పురు్‌ష’లో నటించడం పెద్ద బాధ్యతగా ఫీలవుతున్నాను. కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న పాత్ర కాబట్టి నాలో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. సీత గురించి ఎంత తెలుసుకుంటే అంత సాధికారికంగా ఆ పాత్ర చెయ్యగలననిపించింది. ఇండో-అమెరికన్‌ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన ‘ది ఫారెస్ట్‌ ఆఫ్‌ ఎన్‌ఛాంట్‌మెంట్స్‌’ (హిందీలో ‘సీతాయణ్‌’) పుస్తకం గురించి విన్నాను. ఇది సీత కోణం నుంచి చెప్పిన రామాయణ కథ. ఈ పుస్తకం ద్వారా  సీత వ్యక్తిత్వం మరింత లోతుగా నాకు అర్థమయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ పుస్తకాన్ని తీసుకువెళ్తున్నాను. వీలున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. ‘ఆది పురుష్‌’ హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. నా మొదటి సినిమా.. మహేశ్‌బాబు హీరోగా ‘1-  నేనొక్కడినే’ తెలుగులోనే చేశాను. ఆ తరువాత నాగ చైతన్యతో ‘దోచెయ్‌’లో నటించాను. కానీ తెలుగు పెద్దగా రాదు. ‘ఆది పురుష్‌’ కోసం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. ఏ పదం ఎలా పలకాలో తెలుసుకుంటున్నాను. అంతేకాదు. సీతలా కనిపించడం కోసం డైట్‌ కూడా కచ్చితంగా ఫాలో అవుతున్నాను. ప్రభాస్‌కు సిగ్గెక్కువ!

‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. నా సహ నటులు, దర్శకుల్లో చాలామంది ‘ఆయనకు సిగ్గు చాలా ఎక్కువ’ అని చెప్పారు. తొలిసారి మేము కలుసుకున్నప్పుడు, ప్రభాస్‌ చాలా మొహమాటంగా ‘హాయ్‌!’ అన్నారు. కానీ ఆ తరువాత మేం సినిమాలు, తెలుగు భాష, ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నాక... ఆయన మొదట్లో ఇబ్బంది పడినా, ఒకసారి పరిచయం అయితే అందరితో బాగా కలిసిపోతారని అర్థమయింది. అన్నట్టు ప్రభాస్‌ భోజన ప్రియుడు. తన చుట్టూ ఉన్నవారితో మంచి ఫుడ్‌ తినిపించడం ఆయనకు సరదా. ఇంట్లో భోజనం వండించి తెప్పిస్తారు. వాటిలో హైదరాబాదీ రుచులు నాకు భలే ఇష్టం. చాలా ప్రశాంతంగా, నిజాయితీగా ఉండే మనిషి ప్రభాస్‌. రాముడి పాత్రకు ఆయన సరైన ఛాయిస్‌. అలా గుర్తుండిపోవాలి...

నేను చేసిన, చెయ్యబోతున్న పాత్రల్లో ఒకదానికీ మరోదానికీ పోలిక ఉండదు. ఇదంతా ఏదో ప్రణాళికతో చేస్తున్నదైతే కాదు. ఒక నటిగా మరింత అనుభవం సంపాదించాలనీ, భిన్నమైన పాత్రలు పోషించాలనీ నేను అనుకుంటాను. నా దగ్గరకు వచ్చే పాత్రల్లో అలాంటి అవకాశం ఉన్నవాటిని ఎంచుకుంటాను. ‘బచ్చన్‌ పాండే’లో డైరెక్టర్‌ పాత్ర చేశాను. నేను ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో చాలా అధునాతనంగా ఉన్న పాత్ర అది. అలాగే, ‘మిమీ’లో నటి కావాలనుకొని, చివరకు సర్రోగేట్‌ మదర్‌గా మిగిలిపోయిన డ్యాన్సర్‌ పాత్ర. నాకు తొలినాళ్ళలో మంచి బ్రేక్‌ ఇచ్చిన ‘దిల్‌వాలే’ హీరో వరుణ్‌ధావన్‌తో ఆరేళ్ళ తరువాత ‘భెడియా’లో కలిసి నటిస్తున్నాను. 


అయితే ‘ఆది పురుష్‌’ నాకు అన్ని రకాలుగానూ ప్రత్యేకం. దేశంలో ఎందరో హీరోయిన్స్‌ ఉండగా ఈ పాత్రకు నన్ను ఎంచుకోవడం నా అదృష్టం. ఈ పాత్ర నేను చేస్తున్నానని మా యూనిట్‌ ప్రకటించగానే, ‘ఈమె సీతగానా?’ అంటూ కొందరు విమర్శించారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేశారు. అవి నేను పట్టించుకోను. ప్రేక్షకులకు ‘సీత’గా గుర్తుండిపోవాలన్నది నా కోరిక! అందుకే ప్రస్తుతం నా దృష్టంతా ఆ పాత్రలో ఎలా మెప్పించాలన్న దానిపైనే!’’