మల్లు స్వరాజ్యం కన్నుమూత
ABN , First Publish Date - 2022-03-20T01:44:55+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె 13 ఏళ్ల వయస్సులో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళ స్వరాజ్యం కావడం గమనార్హం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డికి స్వరాజ్యం చెల్లెలు. మల్లు వెంకటరెడ్డి సతీమణి స్వరాజ్యం.
సాయధ పోరాటం సమయంలో ఆమెపై నిజా ప్రభుత్వం రూ. 10 వేల రివార్డును ప్రకటించింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో స్వరాజ్యం జన్మించారు. ఆమె నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచారు. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాట విరమణ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పోరాట సమయంలోనూ ఆ తర్వాత రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ‘నా మాటే తుపాకీ తూటా’ అనే పేరుతో స్వరాజ్యం ఆత్మకథలు రాశారు.