నెలసరి గురించి నోరు విప్పాలంటే సిగ్గెందుకు..?

ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST

అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్టుతో పంపిన ఈ దేశంలో బహిష్ఠు సమస్యల మీద పెదవి

నెలసరి గురించి నోరు విప్పాలంటే సిగ్గెందుకు..?

అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్టుతో పంపిన ఈ దేశంలో బహిష్ఠు సమస్యల మీద పెదవి విప్పడం మాత్రం నిషిద్ధం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేందుకు పల్లెబాట పట్టింది ఆమె. ప్రపంచమే అరచేతిలోకి ఒదిగిన కాలంలోనూ శానిటరీ ప్యాడ్లు పరిచయం లేని ఊర్లు బోలెడు. అలాంటి చోట్లకు వెళ్లి నెలసరి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడమే కాకుండా, రక్తహీనతతో బాధపడుతున్న ఆడవాళ్లలో కొందరికి ప్రతినెలా పౌష్ఠికాహారాన్నీ అందిస్తున్నారు. డా. కడియం కావ్యా నజీరుల్లా. కడియం ఫౌండేషన్‌ ద్వారా తాను నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.


‘‘దేశం బావుండాలంటే, ముందు ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. కానీ తమ శరీర ధర్మాన్ని తాము అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది సగటు భారతీయ మహిళ. అవును మరి! ఒక మగాడు రోడ్డుమీద నిల్చొని దర్జాగా సిగరెట్‌ తాగినా, మందు కొట్టినా నోరు మెదపని సమాజం, శానిటరీ న్యాప్‌కిన్‌ను మాత్రం మరో కంట కనపడకుండా నల్లకవరులోనే తీసుకెళ్లాలంటుంది. ప్రకృతి సహజమైన క్రియ మీద మాట్లాడుకోవడానికి అంత సిగ్గెందుకో అర్థంకాదు. ఆడవాళ్లు అన్నీ రంగాల్లో దూసుకెళుతున్నా, ఇప్పటికీ నెలసరిని మైలగానే చూస్తున్నారు. తమ కూతురికి జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వగలిగిన తల్లిదండ్రులు కూడా రుతుస్రావం గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడటం చాలా కుటుంబాల్లో చూశాను. శానిటరీ ప్యాడ్స్‌ కొనగలిగిన వాళ్లు కూడా నెలసరి సమయంలో పాత వస్త్రాలనే వాడటం గమనించాను. అందుకు కారణం వారెవ్వరికీ దానిపై అవగాహన లేకపోవడమే. ఇవన్నీ చూస్తూ పెరిగిన నేను ఒక వైద్యురాలిగా కంటే ఒక మహిళగా నెలసరి సమస్యల మీద నోరు విప్పాలనుకున్నాను. 



ఒక లక్ష శానిటరీ ప్యాడ్లు...

నా కార్యసాధనకు ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తొలి వేదికలుగా మలుచుకున్నాను. అక్కడున్న అమ్మాయిలకు ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించాం. అదే సమయంలో అంతే వయసులో నాకెదురైన అనుభవాలనూ వారితో పంచుకోవడం ద్వారా బాలికలకు మరింత దగ్గరకాగలిగాను. దాంతో కొందరు అయితే వాళ్ల అమ్మలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలనూ నాతో పంచుకునేవారు. అలాంటి వారందరికీ ఒక వైద్యురాలిగా సలహాలు, సూచనలు ఇప్పటికీ ఇస్తుంటాను. బడిలో సరైన వసతులు లేకపోవడం వల్లే రుతుస్రావం సమయంలో చాలామంది స్కూలుకెళ్లక పోవడం కూడా గమనించాను.


‘బ్యాక్‌ టు స్కూల్‌’ ప్రోగ్రాంతో బడికి దూరమైన అమ్మాయిలను చదువుకు దగ్గర చేయగలిగాం. అందుకు వాళ్ల ఇళ్లల్లోని పెద్దలను ఒప్పించడం మొదట్లో కాస్త కష్టమైందనే చెప్పాలి. ఆపై ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ తదితర జిల్లాల్లోని మారుమూల పల్లెలు, తండాలకూ వెళ్లి ఆడవాళ్ల ఆరోగ్య పరిరక్షణపై సదస్సులు నిర్వహిస్తున్నాం. ఆ క్రమంలో చిన్నటౌన్లలో కూడా చాలాచోట్ల శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోవడాన్ని గ్రహించాను. దాంతో మా ఫౌండేషన్‌ తరపున ఒక లక్ష బయోడిగ్రేడబుల్‌ శానిటరీ న్యాప్కిన్లను పల్లెల్లో పంచాం. ఇప్పటికీ ప్రతినెలా రెండు వందలమందికి వాటిని అందిస్తున్నాం.


దాంతో పాటు నెలసరి సమయంలో పాత వస్త్రాలు వంటివి వాడటం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల గురించి గ్రామీణులకు అర్థమయ్యేలా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరిస్తుంటాను. మెనుస్ట్రువల్‌ హైజీన్‌ మీదా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. తద్వారా నెలసరి సమయంలో వరిపొట్టు కూర్చిన గోనెసంచి ముక్కలు వంటివి వాడకుండా చాలా వరకు నిలువరించగలిగాం. ఒకవేళ పాత వస్త్రాలను ఉపయోగించినా, వాటిని బాగా ఉతికి, ఎండలో ఆరబెట్టమని చెప్పడం. ఒకే వస్త్రాన్ని రెండు లేదా మూడు సార్లకు మించి వాడకూడదు. అదీ కాటన్‌ వస్త్రాన్ని వాడటం మంచిది వంటి విషయాలను అవగాహన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ విషయంలో కొంత మేరకు సఫలీకృతమయ్యామని గర్వంగా చెప్పగలను. 


అనాగరిక ఆచారాలు...

ముట్టు పేరుతో ఆడవాళ్ల పట్ల వ్యవహరించే అనాగరిక ప్రవర్తన...ముఖ్యంగా ఆ సమయంలో వాళ్లను వంట గదికి దూరం పెట్టడం, ఒక గదికే పరిమితం చేయడం, ఊరగాయ జాడీని కూడా తాకనివ్వకపోవడం వంటి రకరకాల మూఢాచారాలు చలామణిలో ఉన్నాయి. అలాంటి వాటికి వ్యతిరేకంగానూ ఊరూరా ప్రచారం చేస్తున్నాం. దాంతో కొంత మేరకు మార్పు తేగలిగామని చెప్పగలను. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు, మహిళల్లో సిగ్గు, బిడియం పోగొట్టగలిగాం. నెలసరి అనేది చెడు కాదు, ఆరోగ్యానికి తొలి సూచి అనే విషయాన్ని అర్థం చేయించగలిగాం. 



పల్లీ చిక్కి పంచుతున్నాం...

వర్థన్నపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పాథాలజిస్టుగా నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నాను. నిత్యం మా వద్దకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఇద్దరు గర్భిణీలు రక్తహీనతతో బాధపడటం గమనించాను. కొందరికైతే కాన్పు సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నిజానికి అత్యంత చౌకగా లభించే పదార్థాలతో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుకోవచ్చు. బెల్లం, పల్లీలతో చేసిన చిక్కి, ఆకుకూరలు తినడం రక్తహీనతకు చక్కని పరిష్కారం.


ఆ సంగతి తెలియక, చాలామంది సమస్యను మరింతగా కొనితెచ్చుకుంటున్నారు. మా ఫౌండేషన్‌ తరపున ఐదో నెల నుంచి తొమ్మిదో నెలవరకు ఒక్కొక్కరికి కేజీ చొప్పున నూట యాభై మంది గర్భిణీలకు ప్రతినెలా పల్లీచిక్కి ఇస్తున్నాం. వసతిగృహాల్లోని రక్తహీనతతో బాధపడుతున్న వంద మంది బాలికలకు బెల్లంతో పాటు పల్లీచిక్కి ప్రతినెలా పంపిస్తున్నాం. నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండే ఆహారంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ల మీద అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. 


ఆంధ్రా కోడలిని...

నా భర్త మహమ్మద్‌ నజీరుల్లా ఎంబీబీఎస్‌లో నా సహాధ్యాయి. నేను చేసే ప్రతి మంచి పనిలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రస్తుతం తాను కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నజీరుల్లా సొంతూరు బాపట్ల. అలా ఓరుగల్లు బిడ్డనైన నేను ఆంధ్రా కోడలిని అయ్యానన్నమాట(నవ్వుతూ...). ప్రతియేటా రంజాన్‌కు అత్త, మామల వద్దకు వెళుతుంటా. వాళ్లు నన్ను సొంతబిడ్డలా చూసుకుంటారు. నాకు ఇద్దరు చెల్లెళ్లు. అమ్మ, నాన్నతో పాటు మేమంతా కలిసి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను వరంగల్‌లోని దివ్యాంగుల ఆశ్రమాల్లో చేసుకోవడం ఆనవాయితీ. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల చిన్న సమస్య కాస్త చావు వరకూ వెళ్లిన ఘటనలు చూసి, నావంతుగా ఏదైనా చేయాలనుకున్నాను.


అలా నా తోబుట్టువులతో కలిసి 2016లో ‘కడియం ఫౌండేషన్‌’ నెలకొల్పాం. తద్వారా ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, వయోధిక, దివ్యాంగుల ఆశ్రమాలకు రెగ్యులర్‌గా నిత్యవసరాలు ఇస్తుంటాం. నా జీతంతో పాటు నా చెల్లెళ్లు దివ్య, రమ్య ఇచ్చే ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాం. మా ముగ్గురు అక్కచెల్లెళ్లకు, ఒక్కొక్కరికి ఇద్దరేసి అమ్మాయిలు. అయితే, మా నాన్న కడియం శ్రీహరి దాన్నెప్పుడూ ఒక లోటుగా భావించలేదు. పైగా ఇల్లంతా అమ్మాయిలతో కళకళలాడుతుంటుందని సంబరపడతారు. 

 కె. వెంకటేశ్‌


Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST