అమెరికాలో ఒక్కరోజే వెయ్యి కరోనా మరణాలు!
ABN , First Publish Date - 2021-08-19T13:58:47+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది. గడిచిన నెలరోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాజాగా అమెరికాలో మంగళవారం ఒక్కరోజే వెయ్యిపైగా కరోనా మరణాలు నమోదైనట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇక్కడ మంగళవారం నాడు 1,017 కరోనా మరణాలు సంభవించినట్లు సమాచారం. దీంతో అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,23,000లకు చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కరోనా మరణాలు సంభవించలేదు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో చాలా వేగంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో అమెరికాలో కరోనా హాస్పిటలైజేషన్లలో 70శాతం పెరుగుదల కనిపించిందని తెలుస్తోంది.