నేడు, రేపు భీమవరంలో పూర్తిస్థాయి బంద్
ABN , First Publish Date - 2020-04-27T16:16:18+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు, రేపు పూర్తిస్థాయి బంద్ ఉంటుందని అధికారులు మీడియాకు వెల్లడించారు.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు, రేపు పూర్తిస్థాయి బంద్ ఉంటుందని అధికారులు మీడియాకు వెల్లడించారు. స్థానికంగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాలతోసహా అన్ని షాపులు బంద్ కానున్నాయి. కేవలం మెడికల్ షాప్‌లకు మాత్రమే మినహాయింపు ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భీమవరం తహసీల్దార్ హెచ్చరించారు.
కేసుల సంఖ్యలో గందరగోళం..
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్యలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్కారు విడుదల చేసిన నివేదికలో నిన్న ఒక్క రోజే 12 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 51కి పెరిగాయి. అయితే తాజాగా డియంహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో నిన్న ఒక్క రోజే 14 కేసులు నమోదైనట్లుగా సమాచారం ఉంది. దాంతో జిల్లాలో పాజిటివ్ కేసులు 53కి చేరాయని నివేదికలో వెల్లడించారు. ఈ క్రమంలో ఒకే రోజు రెండు రకాల నివేదికలు రావడంతో అన్ని వర్గాలలో అయోమయ పరిస్థితి నెలకొంది.