పదవుల పంపకం

ABN , First Publish Date - 2021-07-18T06:10:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం..

పదవుల పంపకం

జిల్లాలో 11 మంది నేతలకు నామినేటెడ్‌ పోస్టులు

ఐదుగురికి రాష్ట్రస్థాయి చైర్మన్‌ పదవులు

ఇద్దరికి ప్రాంతీయ, మరో నలుగురికి జిల్లాస్థాయి...

ఎస్‌డబ్ల్యూఐఐసీ చైర్మన్‌... మళ్ల విజయప్రసాద్‌

నెడ్‌ క్యాప్‌ చైర్మన్‌... కె.కె.రాజు

బ్రాహ్మణ కార్పొరేషన్‌.... సీతంరాజు సుధాకర్‌

క్రిస్టియన్‌ మైనారిటీ... బొల్లవరపు జాన్‌వెస్లీ 

ట్రైకార్‌....  సటకా బుల్లిబాబు

వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌... అక్కరమాని విజయనిర్మల

చింతకాయల అనితకు డీసీసీబీ, పల్లా చినతల్లికి డీసీఎంఎస్‌ పదవులు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టుల్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం లభించింది. ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు, మరో ఆరుగురికి జిల్లా, ప్రాంతీయస్థాయి పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ రాష్ట్ర విద్య, మౌలికవసతుల కల్పన కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌క్యాప్‌) చైర్మన్‌గా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకేరాజు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా సీతంరాజు సుధాకర్‌, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా బొల్లవరపు జాన్‌వెస్లీ, ట్రైకార్‌ చైర్మన్‌గా పాడేరుకు చెందిన సటకా బుల్లిబాబు నియమితులయ్యారు. ఇక విశాఖ-కాకినాడ పెట్రోలియం, కెమికల్‌ అండ్‌ పెట్రో-కెమికల్‌ పెట్టుబడుల ప్రాంతం అభివృద్ధి అథారిటీ(వీకేపీసీపీఐఆర్‌) చైర్మన్‌గా చొక్కాకుల లక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల నియమితులయ్యారు. గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(జీవీఎస్‌సీసీఎల్‌)చైర్మన్‌గా ప్రముఖ ఆడిటర్‌ గన్నమాని వెంకటేశ్వరరావు(జీవీ), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కొండా రమాదేవి, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా గాజువాక ప్రాంతానికి చెందిన పల్లా చినతల్లి, డీసీసీబీ చైర్‌పర్సన్‌గా నర్సీపట్నం మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత నియమితులయ్యారు. నామినేటెడ్‌ పదవులకు ఎంపికైన ఆయా నేతలకు వైసీపీ శ్రేణులు అభినందలు తెలుపుతూ, సత్కారాలు చేస్తున్నారు.


డీసీసీబీ చైర్‌పర్సన్‌గా నియమితులైన చింతకాయల అనిత గతంలో నర్సీపట్నం పంచాయతీ సర్పంచ్‌గా, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. బీఎస్సీ వరకు చదివారు. ఈమె మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసిపాత్రుడు భార్య. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 


డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున గాజువాక మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తరువాత వైసీపీలో చేరారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 67వ వార్డు నుంచి వైసీపీ తరపున  పోటీ చేసి ఓడిపోయారు.


రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్‌ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 


నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా నియమితులైన కె.కె.రాజు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తుండడంతో సీఎం జగన్‌ వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. 


రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన బి.జాన్‌వెస్లీ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఇతను రెండేళ్లుగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నగరంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు.


రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన సీతంరాజు సుధాకర్‌ నగరంలో ఐరన్‌ అండ్‌ స్టీల్‌తోపాటు బియ్యం ఎగుమతి వ్యాపారి. 2013లో వైసీపీలో చేరిన ఇతను వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహతుడు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. 


మారిటైం బోర్డు చైర్మన్‌గా నియమితులైన కాయల వెంకటరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మహింద్రవాడ గ్రామం. ఏయూలో పీజీ పూర్తిచేసిన ఇతను ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. ఉత్తరాంధ్రలో రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో రాణించారు. 2011 నుంచి వైసీపీలో వున్నారు. కేవీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. 


వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా నియమితులైన అక్కరమాని విజయనిర్మల వైసీపీ ఆవిర్భావం నుంచి భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 

 విశాఖ-కాకినాడ పెట్రోలియం, కెమికల్‌ అండ్‌ పెట్రో-కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ చైర్మన్‌గా నియమితులైన చొక్కాకుల లక్ష్మి భర్త చొక్కాకుల వెంకటరావు పోర్టు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వచ్చారు. భార్య లక్ష్మి గతంలో సబ్బవరం మండలంలో సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేశారు. 


గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) నగరంలో పేరొందిన ఆడిటర్‌. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఇతను నగరంలో స్థిరపడ్డారు. తండ్రి జనార్దనరావు గతంలో గోపాలపురం మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో నగరంలో పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేశారు. ఎంపీ ఎంవీవీకి అత్యంత ఆప్తుడు.


జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన కొండా రమాదేవి వైసీపీ యువజన విభాగం నేత కొండా రాజీవ్‌గాంధీకి స్వయాన అక్క. 2014 నుంచి వైసీపీలో వున్న రాజీవ్‌...  గత ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టిక్కెట్టు ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో నామినేటెడ్‌ పోస్టుపై ఆశపెట్టుకున్నారు. అయితే మహిళలకు సగం పదవుల కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా అతని సోదరికి అవకాశం వచ్చింది.


ట్రైకార్‌ చైర్మన్‌గా నియమితులైన సతకా బుల్లిబాబు సొంతూరు పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ సూకురుపుట్టు. ఇతను వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వున్నారు. అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మికి ముఖ్యఅనుచరుడు. వైసీపీ అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారన్న గుర్తింపు వుంది.

Updated Date - 2021-07-18T06:10:52+05:30 IST