మొరం అక్రమ దందా..

ABN , First Publish Date - 2021-02-08T04:59:11+05:30 IST

మొరం అక్రమ దందా..

మొరం అక్రమ దందా..
మొరం తీసిన తర్వాత ఏర్పడిన గుంతలు

ప్రభుత్వ, పట్టా భూముల్లో అక్రమ తవ్వకాలు 

పట్టించుకోని అధికారులు

నడికూడ: నడికూడ, ఫిబ్రవరి 7: మొరం అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు నాయకులు అక్రమార్కులతో కలిసి ధనార్జనే ధ్యేయంగా పట్టా, ప్రభుత్వ భూముల్లోని మొరం తరలిస్తున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి వారి భూముల్లోంచి ఈ మొరంను తరలిస్తూ అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొడుతున్నారు. మండలంలోని కంఠాత్మకూర్‌, సర్వాపూర్‌, ధర్మారం, నడికూడ, చౌటుపర్తి, పులిగిల్ల, గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమార్కులు మొరం తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ అధికార పార్టీ నాయకుడి అండతో ఈ దందా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అనుమతులు లేకుండానే... 

మొరం తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకోని రెవెన్యూ భూగర్భ జలాలు, నీటి పారుదలశాఖ, వ్యవసాయ, ఇతర శాఖల వారు తవ్వకాలకు అనుమతి ఇస్తారు. ఒక్కో క్యూబిక్‌ మీటర్‌ మ ట్టికి రూ.30 రాయల్టీ చెల్లించాలి. ట్రాక్టర్‌కు సుమారు రూ.200 వరకు ఉంటుంది. ప్రభుత్వ భూములైనా, పట్టా భూములైనా అనుమతులు పొందాలి. ప్రస్తుతం మండలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సం బంధితశాఖ అధికారులు పేర్కొన్నారు. 

నడికూడ గుట్ట మాయం.. 

పరకాల–హుజూరాబాద్‌ రోడ్డు పనుల కోసం  కాంట్రాక్టర్‌ ఎకంగా గుట్టలను తొలగించి మొరం తరలించడంతో నడికూడ గుట్ట లేకుండా చేశారని ప్రజలు మండిపడుతున్నారు. నడికూడ రైతులు అడ్డుకోని అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు లేవంటున్నారు.


Updated Date - 2021-02-08T04:59:11+05:30 IST