బైకుల ‘రివర్స్‌ గేర్‌’

ABN , First Publish Date - 2022-10-31T03:29:14+05:30 IST

రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో పయనిస్తోంది. మధ్య తరగతిలో కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోంది.

బైకుల ‘రివర్స్‌ గేర్‌’

అమ్మకాల్లో దేశమంతా వృద్ధి, ఏపీలో తగ్గుదల

2022-23 తొలి అర్ధభాగంలో

6.5శాతం తగ్గిన టూవీలర్‌ విక్రయాలు

ఇతర వాహనాల విక్రయాల్లోనూ 1.76 శాతం తిరోగమనం

జగనన్న పన్నులు, పెట్రోల్‌పై సెస్‌,

రోడ్ల దుస్థితే కారణమా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో పయనిస్తోంది. మధ్య తరగతిలో కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోంది. కొన్ని గణాంకాలు, మార్కెట్‌ తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మూడేళ్ల క్రితం వరకూ వృద్ధిలో దూసుకుపోయిన వాహన మార్కెట్‌ 2019 నుంచి రివర్స్‌ గేర్‌లో నడుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు 26.05 శాతం పెరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 6.52 శాతం తగ్గిపోయాయి. ఇతర వాహనాల విక్రయాల్లోనూ 1.76 శాతం తగ్గుదల కనిపించింది. బైకుల విక్రయాల్లో దేశంలోనే అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌ అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెట్రోల్‌ ధరలు ఏపీలో అత్యధికంగా ఉండడం.. రోడ్లు గోతుల మయంగా మారడం.. జగన్‌ ప్రభుత్వం వాహనాలపై పన్నుల భారం పెంచడం.. ఇదే సమయంలో ఉపాధి అవకాశాలు తగ్గి పొరుగు రాష్ట్రాలకు వలసలు పెరగడం.. కొనుగోళ్లు తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి! పాలించే నాయకులు దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తే అందరిలోనూ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతేకాదు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. అయితే అప్పులు తప్ప ఉపాధి అవకాశాలు పెంచని జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజల ఆర్థిక ప్రమాణాలు ఏటా దిగజారుతున్నాయి. ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేకపోవడంతో ఉపాధి కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇక్కడున్న వారికైనా పని ఉందా..? అంటే అభివృద్ధి పనులు జరిగితే కదా..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఫలితంగా ప్రజల వద్ద డబ్బుల్లేక కొనుగోలు శక్తి తగ్గింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశమంతా వాహన విక్రయాలు 26 శాతం పెరిగితే ఏపీలో మాత్రం 6.52 శాతం క్షీణించాయంటేనే రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67.28 లక్షల బైక్‌లు విక్రయాలు జరిగితే గతేడాది ఇదే సమయానికి 53.37 లక్షలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏపీ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్యకాలంలో 3.32లక్షల బైక్‌లు రోడ్లపైకొస్తే.. ఈ ఏడాది అదే కాలంలో ఆ సంఖ్య 3.10లక్షలకు తగ్గిపోయింది. 2018లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 5.31లక్షల బైక్‌లు అమ్ముడయ్యాయి. 2019-20 తొలి అర్ధభాగంలో బైక్‌ల విక్రయాలు 6.11ు తగ్గితే.. 2020-21 ఫస్టా్‌ఫలో ఏకంగా 16.13ు, 2021-22 ఫస్టా్‌ఫలో 3ు పడిపోయాయి.

పొరుగు రాష్ట్రాల్లో టాప్‌ గేర్‌లో..

జగనన్న ప్రభుత్వ బాదుడే బాదుడు ఫలితంగా ఏపీలో వాహనాల కొనుగోలు భారీగా పడిపోతే.. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం కొత్త వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌.. ఏపీలో రెండు రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకోవాలని ప్రజలకు సూచించారు. ఆయన అధికారంలోకొచ్చాక ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేశారు. దీంతో పెట్రోలు ధరలకు దడిసి కూడా ప్రజలు బైక్‌లు కొనేందుకు ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో మనకన్నా లీటరుకు పది రూపాయలు తక్కువగా ఉన్న కర్ణాటకలో ద్విచక్రవాహనాల కొనుగోలు 58 శాతం పెరిగింది. తమిళనాడులో 31 శాతం, తెలంగాణలో 20 శాతం విక్రయాలు పెరగడం అక్కడి ప్రజల ఆర్థిక బలానికి సంకేతంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి సమీక్ష..

పొరుగు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాల విక్రయాల పెరగడం, మన రాష్ట్రంలో తగ్గుదల కనిపించడంతో.. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల రవాణా అధికారులతో సమీక్షించారు. మన రాష్ట్రంలో గణనీయమైన ప్రతికూల పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విక్రయాలు పెరిగేందుకు అనుకూలమైన పరిస్థితి తీసుకురావాలని సూచించారు. జిల్లాల్లోని ఆర్టీఏ అధికారులు, వాహన డీలర్లను ఆరా తీసిన రవాణా శాఖ అధికారులకు రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తి ఏటా తగ్గి పోతోందని, మధ్య తరగతి వద్ద డబ్బుల్లేవని అందుకే వాహన రంగం మందగిస్తోందనే సమాధానం వచ్చింది. పెట్రోలు లీటరుకు రూ.110కి పెరగడంతో పాటు వాహన లైఫ్‌ ట్యాక్స్‌ 9శాతం నుంచి 12శాతానికి పెంచడం, ఉద్యోగ ఉపాధి సరిగా లేక పోవడం, రోడ్ల దుస్థితి తదితర కారణాలు వివరించారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనలతో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి రవాణా శాఖ అధికారులు ప్రయత్నించారు. అదే సమయంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి బదిలీతో సమావేశం వాయిదాపడింది.

బైకు అవసరం ఉన్నా.. పరిస్థితి మారింది

మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు ద్విచక్ర వాహనం తప్పనిసరి అయినా కొనుగోళ్లు తగ్గిపోవడానికి చాలా కారణాలున్నాయని విజయవాడలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు విక్రయించే ముత్యాల అనిల్‌ కుమార్‌ అన్నారు. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి తారుమారైందని, ఉద్యోగాలు పోవడం, వాహనాల ధరలతోపాటు పెట్రోల్‌ ధరలు పెరగడం ప్రధాన కారణమైతే ఇన్సూరెన్స్‌ డాక్యుమెంటేషన్‌ పేరుతో ఒక బైకుపై 15వేల వరకూ దోచుకోవడం కూడా ఒక కారణమని చెప్పారు. ఒకప్పుడు షోరూమ్‌లు దసరా నుంచి డిసెంబరు వరకూ ఏదో ఒక ఆఫర్‌ ఇచ్చేవని ఇప్పుడు అవేవీ లేక పోవడం, ఫైనాన్స్‌ తీసుకున్నా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించేందుకు తగిన ఆదాయం లేకపోవడం కూడా కారణమేని విశ్లేషించారు.

Updated Date - 2022-10-31T03:29:16+05:30 IST