low pressure: బలపడిన అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
ABN , First Publish Date - 2022-11-19T20:19:13+05:30 IST
అల్పపీడనం (low pressure) శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.
విశాఖపట్నం: అల్పపీడనం (low pressure) శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) నుంచి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారి నైరుతికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. తరువాత రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ (Rayalaseema), ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 21న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప (Chittoor Kadapa), 22న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదివారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. చేపల వేటలో వున్న మత్స్యకారులు ఆదివారంలోగా తీరానికి రావాలని సూచించింది. కాగా శనివారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15 డిగ్రీలు నమోదైంది.