ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది!

ABN , First Publish Date - 2022-11-03T04:01:55+05:30 IST

ఇవాళ్టితో మునుగోడు ముచ్చట ముగుస్తుంది. ఓట్లన్నీ ఈవీఎంలలోకి ఎక్కేస్తాయి. ఎవరో ఒకరైతే ఖాయంగా గెలుస్తారు. ప్రజలు మాత్రం ఓడిపోతారు అంటూ...

ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది!

ఇవాళ్టితో మునుగోడు ముచ్చట ముగుస్తుంది. ఓట్లన్నీ ఈవీఎంలలోకి ఎక్కేస్తాయి. ఎవరో ఒకరైతే ఖాయంగా గెలుస్తారు. ప్రజలు మాత్రం ఓడిపోతారు అంటూ అరిగిపోయిన సత్యం చెప్పవచ్చును కానీ, ఉన్నంతలో తామూ కొంత గెలవాలని జనం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫలితాల ప్రకటన తరువాత, నెలరోజుల కలకలం అంతా సద్దుమణిగి, మునుగోడు వెలవెలబోతుంది. ఖాళీచేసిన మందుసీసాల్లాగా, వాగ్దానాలన్నిటినీ పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చి పారేయాల్సిందే. రంగస్థలం హైదరాబాదుకో, కాదంటే న్యూఢిల్లీకో, కథ మరో మలుపు తిరిగితే మరో ఉపఎన్నిక కేంద్రానికో మారిపోతుంది.

కొనబోతే కొరివి అయిందంటారు, నిజంగా కొనబోయారా లేదో, చేతులు మాత్రం కాలిపోయాయి. దేశమంతా అధికారంలో ఉన్నారు, చాణక్యులూ చంద్రగుప్తులూ చక్రం తిప్పుతున్నారు అయినా, డబ్బు దొరికిపోకుండా చేసుకోలేకపోయారు, ప్రత్యర్థులు దాడులు చేయకుండా కాచుకోలేకపోయారు. ఇక అమ్మకాలూ కొనుగోళ్లు అంటే అసలే తెలియని అమాయకపు పార్టీ, వందకోట్లకు కూడా లొంగని వీరవిధేయ ఎమ్మెల్యేలను అపురూప జీవుల లాగా పరేడ్ చేయించి రాజకీయంగా సొమ్ముచేసుకుంది. ఫిరాయింపుదారు పుట్టింటిపార్టీ మాత్రం నిస్సహాయతలో కూరుకుపోయింది. ప్రాంతీయ పార్టీలు విమానాలు కొని జాతీయానికి ఎగిరిపోతున్న వేళ, పాదయాత్రలకు తప్ప డబ్బుల్లేని ఆ బీద పురాతన పార్టీ అనివార్యంగా సాపేక్షంగా నీతిగానే ఉండిపోయింది కానీ, విలువలకు ఓట్లు రాలవు కదా!

ప్రచారపర్వం ముగింపుదశలో, ఫామ్ హౌస్ ఘట్టం బిజెపిని బాగా దెబ్బతీసిందంటున్నారు. టిఆర్ఎస్ చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. నూటికి నూరుపాళ్లు ఏ ఒక్కరిదో నిజమని జనం అనుకోలేదు కానీ, సంశయ లాభం టిఆర్ఎస్‌కే దొరికినట్టు కనిపిస్తోంది. లేదా, తనకు తానే బిజెపి న్యూనభావంలో పడిపోయిందేమో తెలియదు. కేంద్రమంత్రులందరినీ మునుగోడు కోసం మోహరిస్తానన్న బిజెపి, గుజరాత్ ముఖ్యమనుకుని అటే దృష్టిపెట్టినట్టుంది. టిఆర్ఎస్ మాత్రం రాష్ట్రమంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడులో దించింది. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే లోపల ఏదో జరుగుతున్నది అని నమ్మేవారున్నారు. కమలం వికసించి గులాబి వాడిపోతుందని వాదించేవారున్నారు. ఏమో అదీ నిజం కావచ్చు. రాజగోపాలరెడ్డి సొంత బలం, బిజెపి దాని సోదరసంఘాల కార్యకర్తల బలం, పట్టణప్రాంతాలలో నిరుద్యోగ చిరుద్యోగ యువతలోని మోదీ మోజు అన్నీ కలిపి వారికి విజయాన్ని అందిస్తే ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. అయితే సవాళ్లు విసిరారు, విపరీత ప్రయత్నాలు చేశారు కానీ, వారికి గెలుపు జీవన్మరణ సమస్య కాదు. రెండో స్థానం వచ్చినా ఆ పార్టీ నేతలు పెద్దగా నిరుత్సాహపడేదేమీ ఉండదు, వారి కనీస లక్ష్యం అదే కాబట్టి. మూడోస్థానంలోకి పడిపోతేనే, బిజెపి 2023 మీద ఆశలు విరమించుకుని తనను తాను సమీక్షించుకోవాలి.

రాజగోపాలరెడ్డి గెలిస్తే ఏమవుతుంది? నెలరోజులలో ప్రభుత్వం పడిపోతుందని బిజెపి నాయకులూ అన్నారు, లీకయిన ఆడియో సంభాషణల్లో బిజెపి ప్రతినిధులుగా చెప్పుకున్న గొంతులూ అన్నాయి. నిజంగా అట్లా జరుగుతుందా? నీతికి పర్యాయపదాలైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కెసిఆర్‌కు అండగా ఉండగా, మూకుమ్మడిగా బిజెపిలోకి ఫిరాయింపులు జరుగుతాయా? ఎందుకు జరగవు? మన ప్రజాప్రతినిధులను ఆ స్థాయిలో నమ్మగలమా? వేరే ఏదో బలీయమైన కారణం వల్లనో, నిజంగా వందల కోట్ల ఒప్పందం లేకపోవడం వల్లనో ఫామ్ హౌస్ పథకం రచ్చ అయింది కానీ, లేకపోతే, ఈ పాటికి రాష్ట్రంలో అక్టోబరు విప్లవమో, నవంబర్ సంక్షోభమో జరిగి ఉండేది కాదా? ప్రజాప్రతినిధులలో మంచివాళ్లు ఉండరని కాదు, కానీ, అందరి విషయంలోనూ నైతికశక్తి ఒకేరకంగా ఉండదని గుర్తుంచుకోవాలి. నూరుకోట్ల ముందు ఎంతటి నిప్పు అయినా చల్లారిపోకుండా చూడడం కష్టం. కొనుగోళ్లకు అందరూ సిద్ధంగా ఉన్నంత మాత్రాన, లావాదేవీలు జరిగిపోవాలని లేదు. బిజెపి వ్యూహం ఏమిటో తెలియాలి. బిజెపికి కెసిఆర్ ప్రభుత్వం తక్షణం పడిపోవడం కావాలా? లేక, వచ్చే ఏడాది ఎన్నికలలో తప్పనిసరి విజయం కావాలా? తక్షణం పడగొట్టి, రాష్ట్రపతిపాలన విధించి, ఆ తరువాత ఎన్నికలు జరపడం ఒక పద్ధతి. లేదా, రాజగోపాలరెడ్డి మాదిరిగానే మరో ఇద్దరినో ముగ్గురినో రాజీనామా చేయించి, మళ్లీ ఉప ఎన్నికలు రప్పించడం. టిఆర్ఎస్ ఆర్థిక సంపత్తి మీద, రాష్ట్రప్రభుత్వ వనరుల మీద తీవ్రమైన ఒత్తిడి తేవడానికి ఉప ఎన్నికలు బాగా ఉపయోగపడతాయి.

రాజగోపాలరెడ్డి రెండో స్థానానికి పరిమితమైతే ఏమి జరుగుతుంది? బహుశా, అప్పుడు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తమ నైతికశీలం విషయంలో గట్టిగానే నిలబడతారు. కానీ, ఒకటిరెండైనా తెల్లమేకలు (బ్లాక్ షీప్‌లో రంగువివక్ష ఉంది కదా) దొరకకపోతాయా? ఈ పాటికే ఒక ఒప్పందానికి వచ్చి, సమయం కోసం అధికారశిబిరంలోనే ఉండిపోయినవారెవరో ఉండే ఉంటారు, అంతవరకు చాలు ఉప ఎన్నికలు రావడానికి. జాతీయపార్టీని తీర్చిదిద్దడం పోయి, అప్పుడిక కెసిఆర్ ఉప ఎన్నికలలోనే నిమగ్నం అయిపోవాల్సివస్తుంది. డబ్బుల్లేక వాయిదా వేస్తున్న చెల్లింపులన్నీ అప్పులు చేసి చేయాల్సి వస్తుంది. అది కాక, తలకింత చొప్పున ఓట్లకు వెలలు కట్టాలి. ఆదర్శాలతోనో సిద్ధాంతాలతోనో విధానాలతోనో కట్టిపడేసుకోవడం కాక, ఓటర్లను కొనుక్కోవడం మీదనే నమ్మకం ఉన్నవారు, కొనుక్కోవలసిందే, ఎంత రేటయినా ఇచ్చి కొనుక్కోవలసిందే. రెండో స్థానం కూడా బిజెపికి తన రాజకీయ స్థానాన్ని ప్రకటించుకోవడానికి పనికివచ్చేదే. తెలంగాణలో టిఆర్ఎస్‌కు ప్రత్యర్థి తాము మాత్రమేనన్నది ఈ ఉప ఎన్నిక స్థిరపరచాలి అన్నది బిజెపివారి కోరిక. తరువాతి దశలో మొదటిస్థానానికి చేరుకోవచ్చు. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపు, ఈ ఉప ఎన్నికలో ద్వితీయస్థానం కలిపి చూస్తే, కాంగ్రెస్ రంగంలోనే లేదని, తామే నిజమైన పోటీదారులమని చెప్పుకోవడానికి వీలవుతుంది. మునుగోడులో రెండో స్థానంలో ఉన్నంత మాత్రాన, కాంగ్రెస్ రాష్ట్రస్థాయి ద్వితీయస్థానానికి ప్రమాదం వచ్చినట్టు వెంటనే చెప్పలేము కానీ, బిజెపి తన కార్యకర్తల శ్రేణులను ఉత్సాహపరచి మరింతగా పునాదిని విస్తరించుకునేందుకు ఆ ఫలితం సంకేతాత్మకంగా పనిచేస్తుంది.

బిజెపి మూడో స్థానానికి మాత్రమే పరిమితమయితే? తెలంగాణ మీద ఆ పార్టీ పెట్టుకున్న ఆశలు నెరవేరాలంటే ఇంకా చాలా ప్రయత్నం అవసరమన్న గుణపాఠం లభిస్తుంది. తన విధాన వైఖరులను, సామాజిక సిద్ధాంతాలను తెలంగాణకు అనుగుణమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలన్న ఆత్మవిమర్శ కూడా అవసరం కావచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో ముగ్గురు మాత్రమే సభ్యులున్న పార్టీకి, తనది కాని ఒక స్థానాన్ని గెలుచుకోలేకపోవడం నిజానికి పెద్ద వైఫల్యం కాదు. దూకుడుకు మాత్రమే దెబ్బ తప్ప, ప్రయాణం కొనసాగించవచ్చు. ఆ ప్రయాణం, కాంగ్రెస్ కోలుకోలేకపోతే సునాయాసంగాను, పుంజుకుంటే కాస్త కష్టంగాను ఉండవచ్చు.

మునుగోడులో గెలిస్తే, కెసిఆర్ ఏం చేస్తారు? ఇది మోదీపైనో అమిత్ షా పైనో విజయం అనలేరు. ఎంతకాదన్నా, అది కిషన్ రెడ్డి మీదనో, బండి సంజయ్ మీదనో గెలుపు అవుతుంది. కాబట్టి, ఒక జాతీయస్థాయి ఉద్ఘాటనకు పెద్ద ఆస్కారం లేదు. బిఆర్ఎస్ ప్రయాణానికి లభించిన ఆమోదం అని కూడా అనలేరు. చాలా పెద్ద ప్రయాసతో ఒక గండం గడచినట్టు ఊరట పడవచ్చు. మరో గండం ఎదురయ్యేవరకు ఫామ్‌హౌస్‌లో విశ్రాంతిగా ఉండవచ్చు. తాను గెలిచినా, రెండోస్థానంలో బిజెపి ఉంటే అదొక తలనెప్పి. కెసిఆర్ తేలికపడే ఫలితం ఏమిటంటే, తాను విన్నర్, కాంగ్రెస్ రన్నర్ అయినప్పుడు. పాపం, ఒకప్పుడు ఇందుకు విరుద్ధమైన పరిణామాన్ని ఆయన ఆశించారు. తానే చేజేతులా బిజెపిని రెండోస్థానానికి పెంచి పోషించారు. ఇప్పుడు కావాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ ఒక మెట్టెక్కగలదా? అసలు కాంగ్రెస్ లోనే వాస్తవ ప్రత్యర్థిని చూసే కదా, ఒకరిని పెంచి మరొకరిని తగ్గించే క్రీడకు తెరలేపింది?

బంగారు, వజ్రాల తెలంగాణతో కాక, ఉద్యమ తెలంగాణతో అనుబంధం ఇంకా మిగిలి, మంచిరోజుల కోసం నిరీక్షిస్తున్న వారికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరిగా ఇప్పటి పరిస్థితి తయారైంది. వనరులు, అభివృద్ధి, స్వయంపాలన వంటి అంశాలు కాక, ఏవేవో విషయాలు మాట్లాడే బిజెపి అంటే వారికి అంతగా సహించదు. అట్లాగని, కోరి తెచ్చుకున్న ప్రభుత్వ పాలనపై మరొకవైపు విముఖత పెరుగుతున్నది. పెద్ద భూతాన్ని ఆవిష్కరిస్తే, తనను దేవతగా భావిస్తారనేది ఒక ఎత్తుగడ. 2018లో అది బాగానే పనిచేసింది. మునుగోడులో కూడా అదే మంత్రం. ఒక పార్టీ అని కాదు, అందరూ పెద్ద గీత గీసి, చిన్నగీతను మెప్పించాలనుకునేవారే. ప్రజలకు మాత్రం మెరుగైనవారిని కాక, మురుగు తక్కువ ఉన్నవారిని ఎంచుకోవలసిన దుస్థితి.

మునుగోడు జనం వేసే ఓట్లకు ఇన్ని పర్యవసానాలున్నాయా? ఫలితాలను బట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరకమైన భారీ ప్రయోజనమో తీవ్ర నష్టమో ఉన్నది. ఓటు వేసే వారు ఇంతదూరం ఆలోచించలేరు. ఇంత డబ్బు కుమ్మరిస్తున్నారంటే, గెలిచినవారికి అంతకు మించిన ప్రయోజనం ఉంటుందని మాత్రం వారికి తెలుసు. ఆ ప్రయోజనం పరిమాణం ఎంతో కూడా ఒక సాధారణ ఓటరు ఊహించలేరు. ఒక ఉప ఎన్నికను సాధ్యం చేయడానికి 18 వేల కోట్ల కాంట్రాక్టు, ఒక ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి 400 కోట్లు, అమ్ముడుపోని నిజాయితీని గెలిపించుకోవడానికి ఓటుకు నాలుగైదారేడువేల చొప్పున లెక్కవేసుకున్నన్ని కోట్లు, ఉప ఎన్నిక ఫలితం ఆధారంగా సంక్రమించబోయే లేదా చేజారిపోయే అధికారం మొత్తం విలువ లెక్కలేనన్ని కోట్లు... ఈ లెక్కలు అర్థం కావడం కష్టం. అంత డబ్బును టర్నోవర్ చేయగలిగే రాజకీయం ఎంతటి పెద్ద వ్యాపారమో జనం అంచనాకు అందదు.

ఈ మొత్తం సన్నివేశంలో, ప్రజలను ఉద్దేశించినదేమిటి, వారిని విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, ఆదాయసాధకులుగా తీర్చిదిద్దేందుకు జరగవలసిన అభివృద్ధి ఏమిటి, రేపటి తరానికి మనం అందించే భౌతిక, నైతిక వారసత్వం ఏమిటి..అన్న ప్రశ్నలకు చోటే లేదు. ఆదర్శాలు-, బంగారు తెలంగాణ అయినా, బంగారు భారతమయినా, సబ్ కా వికాస్ అయినా, క్షేత్రస్థాయిలో అందరూ చేసేది మానవ క్రయవిక్రయాలే!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-06T09:26:01+05:30 IST