Chief Minister: శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..
ABN , First Publish Date - 2022-10-20T12:38:08+05:30 IST
బలమైన, శక్తిమంతమైన రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, పెరియార్, అన్నా, కలైంజర్ మార్గనిర్దేశకత్వంలో ముందుకుసాగుతోందని ముఖ్యమంత్రి

- కొత్తగా వెయ్యి బస్సుల కొనుగోలు
- 7,200 తరగతి గదుల నిర్మాణం
- అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడి
అడయార్(చెన్నై), అక్టోబరు 19: బలమైన, శక్తిమంతమైన రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, పెరియార్, అన్నా, కలైంజర్ మార్గనిర్దేశకత్వంలో ముందుకుసాగుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో 500 కోట్లతో కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలు చేయనున్నట్టు 110వ నిబంధన కింద ప్రకటన చేశారు. అలాగే ఛాసిస్ దృఢంగా ఉన్న వెయ్యి పాత బస్సులకు మరమ్మతులు చేయనున్నట్టు తెలిపారు. ఇదే కాకుండా, జర్మన్ డెవల్‌పమెంట్ బ్యాంకు సాయంతో మరో 2,213 డీజిల్ బస్సులు, 500 ఎలక్ట్రిక్ బస్సులు, ప్రపంచ బ్యాంకు నిధులతో మరో వెయ్యి బస్సులను కొనుగోలు చేయనున్నామన్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో డీఎంకే(DMK) ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఈ పథకం కింద రోజుకు సగటున 44 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇది కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే కాదనీ, మహిళాభివృద్ధి, సాధికారతకు ఎంతో సాయపడుతుందన్నారు. దీనివల్ల దాదాపు మహిళలకు రెండు వేల కోట్ల రూపాయల మేరకు ఆదా అయిందని తెలిపారు. దీనిని ప్రభుత్వం నష్టంగా భావిండం లేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన, అభివృద్ధి చర్యల్లో భాగంగా 26 వేల తరగతి గదులు, 7,500 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడల నిర్మాణం, మరమ్మతులకు రూ.12,300 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి, ఈ నిధులను దశలవారీగా సమకూర్చేందుకు వీలుగా ప్రొఫెసర్ అన్బళగన్ పాఠశాల అభివృద్ధి పథకం పేరుతో ఒక స్కీమ్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ‘‘ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,430 కోట్లను కేటాయించామని, పంచాయతీ యూనియన్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఆరు వేల తరగతి గదులను కొత్తగా నిర్మించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా, హైస్కూల్, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో కూడా రూ.250 కోట్లతో 12 వేల తరగతి గదులను కొత్తగా నిర్మించనున్నామని, వీటిలో 7,200 తరగతి గదులను ప్రస్తుత సంవత్సరంలోనే నిర్మిస్టామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 649 స్థానిక సంస్థల పరిధిలో 55,567 కిలోమీటర్ల రహదారులున్నాయి. వీటిలో 6,045 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి’’ అని సీఎం వివరించారు.