మా వాడు ఎలాగైనా సాధిస్తాడు!
ABN , First Publish Date - 2022-02-21T05:30:00+05:30 IST
ఇంట్లో అమ్మమ్మో.. నానమ్మో ఉంటే ఆ సంబరం.. సంతోషం వేరు!అమ్మ కోప్పడకుండా, నాన్న కొట్టకుండా చూసేది.. కాపు కాసేది వాళ్లే....

ఇంట్లో అమ్మమ్మో.. నానమ్మో ఉంటే ఆ సంబరం.. సంతోషం వేరు!అమ్మ కోప్పడకుండా, నాన్న కొట్టకుండా చూసేది.. కాపు కాసేది వాళ్లే.మనవడ్ని మహారాజుగా మార్చేదీ వాళ్లే.ఆ అదృష్టం హర్ష్ కనుమిల్లికి దక్కింది. ‘సెహరి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు తొలి ప్రయత్నంలోనే శభాష్ అనిపించుకున్నాడు. హర్ష్ హీరో అవ్వడం వెనుక నానమ్మ అనురాధ కనుమిల్లి ప్రోత్సాహం కొండంత ఉంది. హర్ష్‌ని తెరపై చూసుకుని అందరికంటే ఎక్కువగా మురిసిపోయింది ఆమెనే. మరి నానమ్మతో హర్ష్ అనుబంధం ఎలాంటిది? మనవడ్ని వెండి తెరపై చూసుకుని మురిసిపోయిన క్షణం ఏమనిపించింది? ఈ సంగతులన్నీ ‘నవ్య’తో పంచుకున్నారిలా..!
మొదటి సినిమా అనుభవం ఎలా అనిపించింది ?
హర్ష్: అద్భుతమైన అనుభవం అది. దాదాపు మూడేళ్ళు ప్రయాణం. కథ రాయడానికి ఏడాదిన్నర పట్టింది. మరో ఏడాదిన్నర షూటింగ్. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితి కూడా ఎదుర్కొన్నాం. అయితే ఎక్కడా రాజీ పడలేదు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా... ఓపిగ్గా థియేటర్ల కోసం ఎదురు చూశాం. నేను రాసిన కథని తెరపై చూసుకోవడం, సినిమాకి మంచి ఆదరణ రావడం గొప్ప ఆనందం ఇచ్చింది.
తొలిసారి మీ మనవడ్ని తెరపై చూసుకున్నప్పుడు ఏం అనిపించింది?
అనురాధ: నాకు చిన్నప్పటి నుంచి వాడ్ని హీరోగా చూడాలని కోరిక. చాలా అందంగా ఉంటాడు. కానీ వీళ్ళ నాన్నకిసినిమాలపై పెద్ద ఆసక్తి లేదు. ‘చదువు తప్ప మరో ధ్యాస పెట్టుకోకు’ అని చెప్పేవాడు. కానీ నాకు మాత్రం బాబుని తెరపై చూడాలని వుండేది. సినిమా విడుదలైన మొదటి రోజే అందరినీని తీసుకొని థియేటర్‌కి వెళ్ళా. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ సీటు అంచునే కూర్చున్నా. ఎక్కడా అసభ్యత లేకుండా అందరూ ఆనందించేలా వుంది. నిజానికి ఇంత బాగుంటుందని నేను ఉహించలేదు. బాబు తెరపై చాలా ఆనందంగా కనిపించాడు. సినిమా చూసినప్పటి నుంచి రెండు పూటలాని దిష్టి తీస్తున్నా. (నవ్వుతూ)
హీరో అవుతాడాని చిన్నప్పుడు అనిపించేదా ?
అనురాధ: అనిపించేది. వీళ్ళ నాన్నకి ఆసక్తిలేకపోయినా నేను ప్రోత్సహించేదాన్ని. ‘మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. నువ్వు సినిమాల్లోకి వెళ్లు... సాధించు’ అని చెప్పేదాన్ని.
ఈ విషయంలో మీకూ మీ అబ్బాయికీ గొడవలు జరిగేవా ?
అనురాధ: నా పిల్లలు నన్నేమీ అనరు. నా ఎదురుగా మాట్లాడాలంటే ఇప్పటికీ భయపడతారు. ముఖ్యంగా హర్ష్‌ని ఏమైనా అంటే నేను ఇంటినుంచి వెళ్ళిపోతానని భయపెట్టేదాన్ని(నవ్వుతూ). వీళ్ళ తాతగారు కథలు రాసేవారు. కానీ ఎవ్వరికీ ఇవ్వలేదు. వీడ్ని మాత్రం ఎలాగైనా నటుడిగా చూడాలనుకున్నా. ఆ కోరిక తీరింది. తాతయ్యలానే వీడూ కథలు రాస్తున్నాడు అనగానే చాలా ఆశ్చర్యపోయా. వాడికి తాతగారి పోలికలే వచ్చాయని ఇంట్లో చాలా సంతోషించాం.
మీ విషయంలో మీ నాన్న ఆలోచనలు ఎలా ఉండేవి?
హర్ష్: నేను అండర్ 14 ేస్టట్కి క్రికెట్ ఆడాను. మా నాన్నగారికి నేను క్రికెటర్ అవ్వాలనివుండేది. కానీ నాకు మాత్రం యాక్టింగ్ మీద ఎక్కువ ఆసక్తివుండేది. సినిమా గురించి చెప్పినపుడు ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే నేను మాత్రం షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్, ఆడిషన్స్ .. ఇలా చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేశా. కథ రాయడం మొదలు పెట్టిన తర్వాత నేను సినిమాల విషయంలో సీరియస్‌గా వున్నానే సంగతి నాన్నకి అర్థమైయింది. సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా మెచ్చుకున్నారు. సినిమా రిజల్ట్ చూసి చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు.
నటుడు అవ్వాలంటే నటనపై, డాన్సులపై, పోరాటాలపై దృష్టి పెడతారు. కానీ కథ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ?
హర్ష్: ఆప్షన్ లేక. ఆడిషన్స్ ఇస్తున్నాను కానీ ఓకే అవ్వడం లేదు. ‘నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేశాను.. చూడండి’ అని ఎవరికైనా ఇచ్చినా, కనీసం పట్టించుకునేవారు కాదు. మన అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలనుకుని కథ రాసుకున్నా.
చిన్నపుడు మీ మనవడికి కథలు చెప్పేవారా?
అనురాధ: చాలా. వాడు నా దగ్గరే నిద్రపోయేవాడు. పిల్లలకు కథలకంటే ఆసక్తికరమైన విషయాలు ఏముంటాయి? నాకు తోచిన కథలు వాడికి చెప్పేదాన్ని. చాలా ఆసక్తిగా వినేవాడు.
ఈ జనరేషన్ మారిపోయింది. పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోనులు వచ్చేశాయి. ఇలాంటి తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?
అనురాధ: చాలా బాధేస్తుంది. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులే కల్పించాలి. పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. అమ్మమ్మ, నానమ్మల చుట్టూ తిరగడం, వాళ్లు చెప్పే కథలు, మంచి విషయాలు బుర్రకి ఎక్కించుకోవడం, వాళ్లలో ఆడుకోవడం.. ఇలాంటి అనుభూతులేం ఈతరానికి దక్కడం లేదు.
సినిమా షూటింగ్‌కి మీరు వెళ్లారా? సెట్లో వాతావరణం చూస్తే మీకు ఏం అనిపించింది?
అనురాధ: ఒకసారి వెళ్లాను. మా ఇంట్లో కూడా షూటింగ్ జరిగింది. దూరం నుంచి చూస్తుండేదాన్ని. సినిమా వాతావరణం కాస్త కాస్త అర్థం అవుతుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా నా కళ్లన్నీ మనవడిపైనే ఉండేవి.
హర్ష్లో మీరు గమనించిన మంచి లక్షణం ?
అనురాధ: చాలా మంచోడు. మా బాబు అని చెప్పడం కాదు కానీ దయాగుణం ఉంది. ఎవరికైనా ఆపద వస్తే... చలించి పోతాడు. జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు. మూగ జీవాలంటే ప్రేమ.
మీరేం చదువుకున్నారు ?
అనురాధ: 1960లో నారాయణగూడ కాలేజ్ లో బిఏ పూర్తి చేశాను. తర్వాత పెళ్లి చేేసశారు(నవ్వుతూ).
ఆడిషన్స్‌లో తిరస్కారాలు చాలాసార్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఏం అనిపించేది? ఆ ఓటమిని ఎలా తీసుకునేవారు?
హర్ష్: మొదట్లో చాలా పెయిన్ వుండేది. తర్వాత అది అలవాటైపోయింది (నవ్వుతూ) అయితే కొన్నిసార్లు సెలెక్ట్ చేసి కూడా తర్వాత ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేేసవారు. పేర్లు చెప్పకూడదు కానీ అందులో కొన్ని పెద్ద సినిమాలూ వున్నాయి. వారి కారణాలు వారివి. అందరికీ అవకాశాలు ఇవ్వాలనే రూల్ లేదు కదా. తర్వాత మనదారి మనమే వేసుకోవాలని నిర్ణయించుకున్నా.
ఈ పరాభవాలు ఇంట్లో చెప్పి బాధ పడిన సందర్భాలు ఉన్నాయా?
హర్ష్: అస్సలు లేదు. బాధల్ని మనసులో దాచుకుని, ఆనందాల్ని మాత్రమే పంచుకునే వ్యక్తిత్వం నాది.
హర్ష్ ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకెలా అనిపించింది ?
అనురాధ: నిజమే.. వాడి బాధలేవీ నాకు చెప్పుకోలేదు. నేను బాధ పడతానని అనుకున్నాడేమో..? ఇవన్నీ చెప్పినా ‘నీ ప్రయత్నం మాత్రం మానకు’ అనేదాన్ని. ఎందుకంటే నాకు వాడిపై బాగా నమ్మకం. ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడనుకునేదాన్ని. అయినా... ఇలాంటి ఆటుపోట్లు లేకపోతే ఎలా ఎదుగుతాం?
చిన్నపుడు ఇంట్లో పాకెట్ మనీ భారీగా ఇచ్చేవారా?
హర్ష్: లేదండీ. నాకు క్రికెట్ ఆడటం, సినిమా చూడటం తప్పితే మరో ద్యాస లేదు. మహా అయితే రబ్బర్ బాల్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవారేమో. అంతే.
అనురాధ: వాళ్ళ నాన్న అన్నీ ముందే సమకూర్చేవారు. వాడికి కావల్సిన సమస్తం ఇంట్లోనే ఉండేవి. చిన్నపిల్లలకు పాకెట్ మనీ పేరుతో డబ్బులు ఇవ్వడం మంచిది కాదన్నది వాళ్ల నాన్న అభిప్రాయం.
నటుడు కావాలని ఎప్పుడు బలంగా అనిపించింది?
హర్ష్: చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఆసక్తి వుండేది. కానీ ‘టక్కరి దొంగ’ సినిమా చూసినప్పుడు మాత్రం బలంగా ఫిక్సయ్యా. హీరో అయితే నేనూ అలానే ఉంటా అనిపించేది. అయితే క్రికెట్ వదిలేసిన రోజే యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. ఒకసారి నాన్న ఆఫీస్ వెళ్ళా. అక్కడ ఒక రోజు ఉంటే మైండ్ అంతా పాడైపోయింది. నాకేం అర్థం కాలేదు. నేను సినిమాలు తప్ప ఇంకేం చేయలేనని ఆ రోజు ఇంకా గట్టిగా అనిపించింది.
మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి ?
అనురాధ: సరదాగా కాలక్షేపంగా సాగిపోయే సినిమాలంటే చాలా ఇష్టం. అప్పట్లో అమెరికా అమ్మాయి, నాలుగు స్థంభాలాట, పంతులమ్మ సినిమాల్ని బాగా చూశా. రంగనాథ్ నటించిన సినిమాలన్నీ ఇష్టమే.
యంగ్ హీరోల్లో చాలా పోటీ వుంది. ఈ పోటీలో నిలబడటానికి మీరేం చేయబోతున్నారు ?
హర్ష్: ప్రతి ఒక్కరికి ఒక యునిక్ నెస్ వుంటుంది. నాకూ ఒక స్టయిల్ వుంది. పోటీ అని లేదు.. ఎవరిదారి వారిది.
హర్ష్‌ని రానున్న రోజుల్లో ఎలా చూడాలని అనుకుంటున్నారు ?
అనురాధ: గొప్ప స్థితిలో వుండాలి. చాలా నమ్మకంగా వున్నాను. వాడి భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుందని.
నానమ్మ చాలా క్రియేటివ్. చిన్నప్పుడు తాను చెప్పిన కథలన్నీ చాలా ఆసక్తిగా ఉండేవి. బహుశా కథలు రాయాలి అనే ఆసక్తి నాకు తన నుంచే పుట్టిందేమో!
ఈ జనరేషన్ కి వేగం ఎక్కువ. ఫాస్ట్ ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అప్పట్లో మేం ఇలా లేం కదా? అనిపిస్తుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పటికీ టీవీనే కాలక్షేపం. ఏబీఎన్ క్రమం తప్పకుండా చూస్తా. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ నా ఫేవరెట్ ప్రోగ్రాం. అందులో వచ్చే ఇంటర్వ్యూలు క్రమం తప్పకుండా ఫాలో అవుతా.
మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?
హర్ష్: బాలకృష్ణ, చిరంజీవి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. చిరంజీవి ఇంటికి వెళ్లి టీజర్, సాంగ్స్ చూపించినప్పుడు ‘ఐ రియల్లీ లైక్ యువర్ మేనరిజమ్స్. చాలా బావుంది. అమాయకత్వం, ఎక్స్ప్రెషన్స్ చిన్న చిన్న డిటేయిల్స్ బావున్నాయి’ అన్నారు. చిరంజీవి నుంచి అలాంటి కాంప్లిమెంట్ వచ్చేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా. చాలా హ్యాప్పీగా అనిపించింది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
నవ్య డెస్క్
ఫొటోలు : అశోకుడు
