ఏం చేద్దాం..!
ABN , First Publish Date - 2022-10-26T12:48:24+05:30 IST
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల, తల్లిదండ్రుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ,

సందిగ్ధంలో డీఏవీ స్కూల్ పేరెంట్స్
పాఠశాల మార్పుపై సంతకాల సేకరణ
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కలిసే యత్నం
నేడు పాఠశాల డైరెక్టర్లతో సమావేశం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో హోం మంత్రి భేటీ నేడు
హైదరాబాద్ సిటీ: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల, తల్లిదండ్రుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ, విద్యార్థులను ఇతర పాఠశాలల్లోకి తరలించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ శాతం మంది పాఠశాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుని ఈ ఏడాది తమ పిల్లలను అదే పాఠశాలలో కొనసాగించాలని కోరుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
డీఏవీ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు కొనసాగుతుండగా, 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీబీఎ్‌సఈ స్కూల్ కావడంతో ఫీజులు ఎక్కువైనప్పటికీ చాలామంది తమ పిల్లలను ఇక్కడే చేర్పించేందుకు ఆసక్తి చూపారు. అయితే, పాఠశాలలో జరిగిన ఘటన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో విద్యార్థులను విద్యాసంవత్సరం మధ్యలో స్కూల్ మారిస్తే చదువులపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో సమ్మెటివ్ అసె్‌సమెంట్ (ఎస్-1) పరీక్షలు పూర్తిచేయగా.. మరికొన్ని చోట్ల ఈనెల 28 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో తమ పిల్లలను ఇతర పాఠశాలలకు పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారనే భావనలో 65 శాతం మంది తల్లిదండ్రులున్నట్లు తెలిసింది. ఈ మేరకు తమ పిల్లలను డీఏవీలో ఉంచాలా.. ఇతర పాఠశాలకు పంపించాలా.. అనేదానిపై సంతకాల సేకరణ చేపట్టారు. అందులో 65 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అదే పాఠశాలలో కొనసాగించాలని సంతకాలు చేసినట్లు సమాచారం. అలాగే, పలువురు తల్లిదండ్రులు మంగళవారం లక్డీకా పూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి వెళ్లి డైరెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్దకు వెళ్లి డీఈఓ రోహిణిని కలిశారు. బుధవారం మరోసారి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనను కలుస్తామని తల్లిదండ్రులు తెలిపారు. మరోపక్క డీఈవో బుధవారం పాఠశాల డైరక్టర్లతో సమావేశం కానున్నారు. అలాగే, పాఠశాల భద్రత ప్రమాణాలపై విద్యాశాఖ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సమావేశం కానున్నారు.
అనుమతులు లేకుండానే..
డీఏవీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తాజాగా అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైనట్లు తెలిసింది. వాస్తవంగా ఈ పాఠశాలకు 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉంది. అదీ స్టేట్ సిలబ్‌సకు మాత్రమే. కానీ, అక్కడ సీబీఎ్‌సఈ సిలబస్ చెబుతున్నారు. డీఏవీకి చెందిన సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఇక్కడ 6, 7 తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
ఇదిలా ఉండగా, డీఏవీ స్కూల్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి విజ్ఞప్తి చేశాయి. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి కె. నాగలక్ష్మి. డీవైఎ్‌ఫఐ నగర కార్యదర్శి జావిద్, ఎస్‌ఎ్‌ఫఐ కార్యదర్శి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.