మునుపటి గోడే!

ABN , First Publish Date - 2022-11-09T04:10:31+05:30 IST

నిన్నటిదాకా చిటికేస్తే చాలు.. తాగినంత మందు, తిన్నంత బిర్యానీ దొరికేది! పొద్దున లేచి ఇంట్లోంచి బయటకొస్తే..

మునుపటి గోడే!

కళాకారుల డప్పుచప్పుళ్లు, నృత్యాలు. కార్ల హోరు మాయం

నేతలంతా గాయబ్‌.. చడీచప్పుడు లేని మునుగోడు

హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వెలవెల

నిన్నటిదాకా జనానికి తాగినంత మందు, తిన్నంత బిర్యానీ

నెలపాటు రాజభోగం.. యవుసం పనులు మానుకొని ప్రచారానికి

ఇప్పుడిక మన చాయ్‌ మనదే.. మన వంట మనదేనని నిర్వేదం

ఇంటికొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్యలపై వెళితే పలకరిస్తారా?

నల్లగొండ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నిన్నటిదాకా చిటికేస్తే చాలు.. తాగినంత మందు, తిన్నంత బిర్యానీ దొరికేది! పొద్దున లేచి ఇంట్లోంచి బయటకొస్తే.. టీ, కాఫీ నుంచి టిఫిన్లు.. భోజనాలు అన్నీ సమకూర్చేవారు. బోనస్‌గా ఓ పెద్దనోటు చేతిలో పెట్టేవారు! ఇలా నెలరోజులుగా రాజభోగం అనుభవించి ఒక్కసారిగా సాధారణ జీవితానికి అలవాటు పడాల్సి వస్తే? మునుగోడు ఓటర్లది ఇప్పుడిదే పరిస్థితి!! ఓటేయండి బాబూ అని గడ్డం పట్టుకొని బతిమాలిన పార్టీ నేతలంతా విఠలాచార్య సినిమాలో మాదిరి ఒక్కసారిగా మునుగోడు నుంచి మాయమైపోయారు. షాక్‌తో దిక్కులు చూసి పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్న ఓటర్లు.. ‘ఓట్ల పండుగ అయిపోయింది... ఇగ పొద్దుగాల్ల మన చాయ్‌ మనమే తాగాలె.. అంబటాల్లకు మన బువ్వ మనమే తినాలె. పొద్దుగూకినంక మన మందు మనమే కొనుక్కోవాలె’ అని ఒకరినొకరు సర్దిచెప్పుకుంటున్నారు. అంతేనా.. ‘‘మొన్నటిదాకా అళ్లు (నేతలు) వచ్చిన్రు. ఇప్పుడు ఆళ్ల తాకి మనం పోవాలె.

నా ఇంటి కాడ స్తంభం లైటు పడ్తలేదని.. నల్లా నీళ్లొస్తలేవని అడుక్కోవాలె’’ అని చెప్పుకొంటున్నారు. వాస్తవానికి ఉపఎన్నిక పోలింగ్‌ ముందు వరకు నెల రోజులపాటు నియోజకవర్గంలో ఏ పల్లె చూసినా పండుగ వాతావరణమే కనిపించింది. తెల్లారగానే ఇంట్లో ఆడామగ అంతా రెడీ అయిపోయి ఇంటికి తాళం వేసి బయటకొస్తే.. టీ, టిఫిన్లు వచ్చేవి. ఎన్నిసార్లు చాయ్‌ అంటే అన్నిసార్లు తాపేటోళ్లు. మధ్యాహ్నం రుచికరమైన భోజనం దొరికేది. రాత్రికి ఆడవాళ్లు మటుకు ఇళ్లలో వండుకుంటే మగవాళ్లు బయటే మందుతో మస్త్‌ దావత్‌ చేసుకొని ఎంజాయ్‌ చేసేటోళ్లు. కూలీ పనికి పొయ్యేది లేదు.. యవుసం పని చూసేది లేదు.. బయట ఉత్త పుణ్యానికి తిన్నంత తిండి.

తాగినంత మందు. పైగా సభలు, ర్యాలీలకు వెళితే డబ్బే డబ్బు! ఫలితంగా మండల కేంద్రాల్లోని ఏ హోటల్‌, చాయ్‌ బండి చూసినా కిటకిటలాడిపోయేవి! హోటళ్లలో టేబుల్‌ దొరక్క నాయకులంతా బయట ఖరీదైన బెంజ్‌, ఫార్చునర్‌ వంటి ఖరీదైన కార్లలో కూర్చుని ఎదురుచూసేవారు. ఏ పల్లెలో చూసినా రోడ్ల మీద ఎక్కడ చూసినా కార్లు.. ప్రచారంలో పార్టీ జెండాలతో కార్యకర్తలు.. వారి నినాదాల హోరు, కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో సందడి వాతావరణం కనిపించేది. సమ్మక్క-సారక్క జాతరనే తలపించిన ఈ ప్రచార హోరు ఆర్టీసీ పంట పడించింది. ఉప ఎన్నిక ప్రచారం సాగిననన్ని రోజులూ ఆర్టీసీ ప్రత్యేకంగా మునుగోడు 250 బస్సులను నడిపింది. ఫలితంగా సంస్థకు రూ2కోట్ల ఆదాయం సమకూరింది.

ఇళ్ల ఎదుటకు ఎమ్మెల్యేలు, మంత్రులు

ఊర్లలో ఎవరికైనా జ్వరం వచ్చిందని తెలిసినా.. ప్రచారంలో కాలు జారి కింద పడ్డారని తెలిసినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పరుగుపరుగున వచ్చి పలకరించ్చేవారు. నల్లగొండ, హైదరాబాద్‌ ఆస్పత్రులకు స్వయంగా తమ కార్లలోనే ఎక్కించి పంపేవారు. ఇప్పుడు ఏదైనా సమస్య కోసం వెళితే తమను పట్టించుకుంటారో లేదోనని జనం మాట్లాడుకుంటున్నారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం 6గంటల వరకు జనంతో కళకళలాడిన వీధులు వెలవెలబోయాయి. అప్పటిదాకా జనంతో కిటకిటలాడిన హోటళ్లు, బిర్యానీ పాయింట్లకు గిరాకీ లేకుండాపోయాయి. అద్దెకు తీసుకున్న ఇళ్లు, ఫంక్షన్‌ హాళ్లూ ఖాళీ అయ్యాయి. మునుగోడులోని 7 మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

ఊళ్లలో యువకులు మాయం

బైక్‌ మనదైనా ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోలు ఫ్రీగా కొట్టించేది నేతలు! పైగా మూడు పుటలా భోజనమూ ఫ్రీనే! ఫలితంగా పొద్దున లేచింది మొదలు కాలేజీకి బంద్‌ పెట్టి ప్రచారం పేరుతో యువకులంతా నెలపాటు ఊర్లు, మండల కేంద్రాల్లో రయ్‌రయ్‌ మంటూ తిరిగేశారు! ఇప్పుడు వారంతా మునుగోడును వదిలేసి తాము చదువుకుంటున్న హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి బుద్ధిగా చదువుకుంటున్నారు. దీంతో మునుగోడులో యువకుల సందడి కనిపించడం లేదు. అలాగే చేనేత కార్మికులు కూడా. తమ పని పక్కకు పెట్టి ప్రచారంలో మునిగితేలేవారు. ప్రస్తుతం వారు తమ పని మీద పడటంతో ఊర్లలో మళ్లీ మగ్గాల శబ్దాలు వినిపిస్తున్నాయి. మునుగోడు ప్రచారంలో 35వేల నుంచి 45వేల దాకా రైతులు, కూలీలు ప్రధాన పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. వీరికి రోజువారీ లెక్క కింద కొంత డబ్బు ఇచ్చేవారు. ఫలితంగా 15రోజుల్లోనే ఒక్కొక్కరికి రూ.7,500 నుంచి రూ.8వేల వరకు గిట్టుబాటయినట్లు చెబుతున్నారు.

రోజుకు 2లక్షల కౌంటర్‌ నడిచేది

ప్రతిరోజు రూ.2లక్షల కౌంటర్‌ నడిచేది. ప్రస్తుతం ఆ వ్యాపారం రూ.40వేల నుంచి రూ.50వేలు దాటడం లేదు, పార్కింగ్‌కోసం స్థలంలేక ఖరీదైన కార్లు ఇష్టారీతిన పెట్టిపోయేవారు. ఇప్పుడు పార్కింగ్‌ స్థలం అంతా ఖాళీగా కనిపిస్తోంది’

- చౌటుప్పల్‌ మండల పరిధిలో ఉన్న పల్లెరుచులు హోటల్‌ యజమాని నరేందర్‌

అంత గిరాకీ ఎన్నడూ చూడలే

ప్రచార సమయంలో రోజూ .20వేల గిరాకీ అయ్యేది. ఇంతటి గిరాకీ మునుపెన్నడూ రాలేదు. ఇప్పుడది 7వేలకు పడిపోయింది. అప్పట్లో పని ఒత్తిడి తట్టుకోలేక పనివాళ్లను పెట్టుకున్నా. ఇప్పుడు వాళ్లను తీసేశా.

-మునుగోడు మండలకేంద్రంలోని హోటల్‌ యజమాని లక్ష్మీనారాయణ

Updated Date - 2022-11-09T11:49:31+05:30 IST