నాద నీరాజనం

ABN , First Publish Date - 2022-02-05T05:07:28+05:30 IST

నవరత్న నీరాజన ఝరి, రామబంధువు కీర్తనల తెమ్మరలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, రామగీతామృత మాధుర్యం, భక్తుల కోలాటాల నడుమ భక్తరామదాసు జయంత్యుత్సవ ప్రారంభ సంబరం అంబరాన్నంటింది. ఎటు చూసినా రామనామ స్మరణే. ఏ నోట విన్నా భ

నాద నీరాజనం
నవరత్న కీర్తనలు ఆలపిస్తున్న కళాకారులు, భక్తులు

 భద్రాద్రిలో  కన్నులపండువగా భక్తరామదాసు  జయంత్యుత్సవాలు

 సంప్రదాయబద్ధంగా ప్రయుక్త వాగ్గేయకారోత్సవం

 రామదాసు విగ్రహానికి పంచామృత స్నపనం

 గోదారమ్మకు పసుపు, కుంకుమ సారె సమర్పణ

  సంగీత సాగరంలో ఓలలాడిన దక్షిణ అయోధ్య

భద్రాచలం, ఫిబ్రవరి 4:  నవరత్న నీరాజన ఝరి, రామబంధువు కీర్తనల తెమ్మరలు,  మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, రామగీతామృత మాధుర్యం, భక్తుల కోలాటాల నడుమ భక్తరామదాసు జయంత్యుత్సవ ప్రారంభ సంబరం అంబరాన్నంటింది. ఎటు చూసినా రామనామ స్మరణే. ఏ నోట విన్నా భక్తరామదాసు కీర్తనలే. దీంతో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి సంగీత సాగరంలో ఓలలాడింది. ప్రముఖ సంగీత విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మల్లాది సూరిబాబు, ఆయన కుమారులు మల్లాది సోదరులు శ్రీరామ్‌కుమార్‌, రవికుమార్‌తో పాటు సంగీత కళాకారులు హాజరయ్యారు. భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ అజరామరమైన కీర్తనలు రాసి గానం చేసిన అపర భక్తాగ్రేసరుడు భక్తరామదాసుగా ప్రసిద్ధిగాంచిన కంచర్ల గోపన్న జయంతిని పురస్కరించుకొని ఆలపించిన నవరత్న కీర్తనలతో  భద్రాద్రిలో భక్తిభావం వెల్లి విరిసింది. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తరామదాసు విగ్రహంతో శోభాయమానంగా  శోభాయాత్ర సాగింది. భక్తరామదాసు 389వ జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శుక్రవారం స్ధానిక చిత్రకూట మండపంలో కొవిడ్‌ ఆంక్షల మేరకు నిర్వహించారు. కాగా ప్రతీ ఏడాది ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను ఒక్క రోజుకే పరిమితం చేశారు. 

గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు 

రామదాసు జయంతిని పురస్కరించుకొని గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, సారెను గోదారమ్మకు సమర్పించి పూజలు నిర్వహించారు. నగర సంకీర్తన,  భాజభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛా రణల నడుమ రామాలయ ప్రాంగణంలో ఉన్న రామదాసు విగ్రహానికి దేవస్థానం అర్చక స్వాములు పంచామృతాలతో సహస్త్రధార, ప్రత్యేక స్నపనాన్ని నిర్వహించారు. 

నవరత్న కీర్తనలతో రామయ్యకు నీరాజనం

భద్రాచలం రామదాసు నవరత్న కీర్తనలను సంగీత కళానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు రూపొందించగా వాటిని రామదాసు జయంతిని పురస్కరిం చుకొని ఆలపించగా సంగీతాభిమానులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు. అదిగో భద్రాద్రితో ప్రారంభమై శ్రీరామనామమే, పలుకే బంగార మాయేనా, శ్రీరాముల దివ్యనామ, రామజోగి మందు, తారక మంత్రం, హరి హరి రామ, తక్కువేమి మనకు, కంటినేడు మా రాములతో నవరత్న కీర్తన లు ఆలపించగా భక్తులు ఆనంద పరవశుల య్యారు. ఒక్కొక్క కీర్తన ముగిసిన అనంతరం ప్రత్యేకహారతిని అర్చక స్వాములు రామయ్యకు సమర్పించారు. అంతకు ముందు  సీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుంచి చిత్రకూట మండపానికి మేళతాళాలతో తీసుకురాగా రజత సింహాసనంపై స్వామి వారిని ఆసీనులను చేశారు. అనంతరం భక్తరామదాసు జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో దేవ స్థానం ఈవో బి.శివాజీ, అలివేలు మంగ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన నేండ్రగంటి కృష్ణమోహన, కె.విజయ కుమార్‌, సంజయ్‌ కుమార్‌, ఏఈవో లు శ్రావణ్‌కుమార్‌, భవానీ, రామకృష్ణా రావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, నిరంజనకుమార్‌, కిషోర్‌, డీఈ వి.రవీంద్రనాధ్‌, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణ మాచార్యులు, దేవస్థానం వేద పండితులు లింగాల రామకృష్ణ ప్రసాద్‌, ద్వివేదుల సత్యసాయి సన్యాసి శర్మ, ఆస్థాన పారాయణ దారులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచా ర్యులు, అర్చకులు పొడిచేటి గోపాలకృష్ణమా చార్యులు, అమరవాది వెంకట్రా మన పాల్గొన్నారు.

భక్త్తరామదాసు విగ్రహంతో గిరి ప్రదక్షణ

 సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి భక్తరామదాసు విగ్రహంతో వేద పండితుల మంత్రోచ్ఛార ణలు, మంగళవాయిద్యాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించి ముందుగా విస్తాకాంప్లెక్స్‌ వద్ద ఉన్న తూము నరసింహాదాసు, కల్యాణ మండపం వద్ద ఉన్న భక్తరామదాసు విగ్రహం వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రగిరి ప్రదక్షిణను నిర్వహించారు. 

వచ్చే జయంత్యుత్సవాలు కొత్త ఆడిటోరియంలోనే

నేలకొండపల్లి, ఫిబ్రవరి4: 2023లో జరుగనున్న శ్రీభక్త రామదాస జయంత్యుత్సవాలను కొత్త ఆడిటోరియంలోనే జరుపుకుందామని జిల్లా కలెక్టర్‌ పీవీగౌతమ్‌ చెప్పారు. శ్రీభక్తరామదాస 389వ జయంత్యుత్సవాలను రామదాసు జన్మస్ధలమైన నేలకొండపల్లిలోని భక్తరామదాస ధ్యాన మందిరంలో శుక్రవారం ఉదయం కలెక్టర్‌ గౌతమ్‌ ప్రారంభించారు. కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత రామదాసు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్యానమందిరంలో ఉన్న రామదాసు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కలెక్టర్‌ సభలో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ఆడిటోరియం పనులను పూర్తి చేయాలని, ఉన్న నిధులతోనే ఆడిటోరియాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, విద్వత్‌ కళాపీఠం సభ్యులు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, హరి శ్రీనివాస్‌, మన్నె కోటేశ్వరరావు, వాసం లక్ష్మయ్య, గెల్లా జగన్మోహన్‌రావు, నెల్లూరి వీరబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పొన్నగాని శ్రీనివాస్‌, తహశీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీఓ శివ, ఎంఏఓ నారాయణరావు, అర్చకుడు సౌమిత్రి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-05T05:07:28+05:30 IST