Mallu Bhatti Vikramarka: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:58 PM
Mallu Bhatti Vikramarka: ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మాత్రం ఆగవని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిరుపేదలను పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.

ఖమ్మం, జనవరి 26: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ మాత్రం ఆగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేసీఆర్.. గత పదేళ్ల తన పాలనలో నిరుపేదలను పట్టించుకోలేదన్నారు. అలాగే ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతోన్న నాయకుడికి సైతం తాను స్పష్టంగా చెబుతున్నానని.. ఒక్క రేషన్ కార్డు సైతం ఆ సమయంలో వారికి మంజూరు చేయలేదని ఆయన మండిపడ్డారు. వారు.. ఆ సమయంలో ఈ పని చేసి ఉంటే.. నేడు తాము ఈ రేషన్ కార్డులు మంజూరు చేసే అవసరం ఉండేది కాదన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం జిల్లాలోని కోణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. భారతదేశానికి నేడు అత్యంత పవిత్రమైన రోజు.. ఈ దేశ రాజ్యాంగాన్ని ఆమోదింప జేసుకున్న రోజు అని గుర్తు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అమలు జరుపుతోన్న ఈ నాలుగు పధకాలకు రూ. 45 వేల కోట్ల ఖర్చు అవుతోందని ఆయన సోదాహరణగా వివరించారు.
పదేళ్ల మీ పాలనలో గడీలలో కూర్చోని లెక్కలు రాసి దోపిడీ చేశారంటూ బీఆర్ఎస్ అగ్రనాయకులను డిప్యూటీ సీఎం విమర్శించారు. తాము గ్రామ గ్రామాన సభలు నిర్వహించి ప్రజల మధ్యలో వారి ఆమోదంతో పధకాలు కేటాయిస్తున్నామని తెలిపారు. గత మూడు రోజులుగా రాష్టంలో పేట్రేగిపోయారంటూ బిఆర్ఎస్ నాయకులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరిపే సంక్షేమ పథకాల అమలుపై దుష్ప్రచారం చేసి అల్లరి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.
Also Read: అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఈ తరహా వ్యాఖ్యలు గమనించాలని.. అటువంటి వ్యక్తులకు బుద్ది చెప్పాలంటూ ప్రజలకు సూచించారు. మీకు ఎవరికీ అన్యాయం జరగదని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
Also Read: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్
ఎటువంటి షరతులు కానీ.. నిబంధనలు కానీ లేవని.. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకం వర్తింపు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పడం కానీ, మోసపూరిత వాగ్దానాలు చేయడం కానీ చేయదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు పాలన చేసి ఒక్క లక్ష రూపాయలు సైతం రుణమాఫీ చేయ లేక పోయారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం అందించిన హామీల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు.
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ. పది లక్షల వరకూ బిల్లులు చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఇక మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు కింద ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకోన్న బిఆర్ఎస్ నేతలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని వీటిని గమనించాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
Also Read : పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు.. గద్దెనెక్కి ఏడాది కాలం అయిన కానీ అమలు చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే... రేవంత్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రం సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ నిప్పులు చెరుగుతోన్నారు.
అంతేకాదు.. దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకు రావడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో వారికి ఈనో ప్యాకెట్లను కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు కోరియర్‌లో పంపిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఈనో యాడ్స్‌ను తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు.
For Telangana News And Telugu News