ట..మోత!

ABN , First Publish Date - 2023-07-03T00:39:38+05:30 IST

టమాటా అసలు మాట వినడం లేదు.. ఽధరలు టమోత మోగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో కిలో రూ.120-150ల వరకూ విక్రయిస్తున్నారు.

ట..మోత!

టమాటా వినడం లేదు!

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 2 : టమాటా అసలు మాట వినడం లేదు.. ఽధరలు టమోత మోగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో కిలో రూ.120-150ల వరకూ విక్రయిస్తున్నారు. రాజమహేంద్రవరం రైతు బజార్లలోనే కిలో రూ.80ల ఽవరకూ విక్రయిస్తుండడం గమనార్హం. గత వారంతో పోల్చితే టమాట ధరలు దాదాపుగా రెట్టింపయ్యాయి. ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌ నుంచి టమాటాలను టోకుగా కొనుగోలు చేసి జిల్లాలోని రైతుబజార్లకు సరఫరా చేయనున్నట్టు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతు బజార్లకు మార్కెటింగ్‌ శాఖ టమాటాలను సరఫరా చేసింది. శనివారం విశాఖపట్నం జిల్లాకు కూడా పంపినట్టు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమవారం టమాటా లోడులు రానున్నట్టు సమాచారం. మార్కెటింగ్‌శాఖ కిలో రూ.70లకు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా రూ.50లకు విక్రయిస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలు కొంతమేర అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. సీతానగరం, కడియం ప్రాంతాల్లో రైతులు ప్రస్తుతం టమాటా సాగు చేయడంలేదు. ఆగస్టు, సెప్టెంబరు వరకూ లోకల్‌ టమాటా మార్కెట్లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో జిల్లాలోని హోల్‌సేల్‌ మార్కెట్లన్నీ ఇతర ప్రాంతాల దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

రైతు బజార్‌లో రూ.50

రాజమహేంద్రవరం, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : రైతు బజార్లలో సోమవారం నుంచి సబ్సిడీపై రూ.50లకే కేజీ టమాటా విక్రయించనున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి టమాటా తెప్పించి, మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతు బజార్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. సోమవారం ఉదయం ఆర్స్ట్‌కాలేజీ సమీపంలోని రైతు బజారులో తాను ఈ సబ్సిడీ టమాటా విక్రయాలను ప్రారంభిస్తానని చెప్పారు.

మిర్చి మంట!

కేజీ ధర రూ. 180

పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి.. ఘాటు తగ్గడం లేదు. ఎన్నడూ లేని విధంగా ధర అమాంతం పెరిగింది. రోజురోజుకు మండిపడుతూనే ఉంది. చాలాకాలంగా పచ్చిమిర్చి ఽధర నిలకడగా ఉంది. ఇటీవల అమాంతంగా పెరిగిపోయింది.. ఒక్కసారిగా కేజీ రూ.20 నుంచి రూ.60లకు వెళ్లింది. ఆ తరువాత కొనుగోలుదారుడికి చిక్కలేదు. ధర పెరుగుతూనే ఉంది. ఎందుకు ఒక్కసారిగా పెరిగిందనేది ఎవరికి అర్ధం కాని విషయం.. సాగు తగ్గడంతోనేధర పెరిగిందని చెబుతున్నారు. మడికి మార్కెట్లో పచ్చిమిర్చి ఆల్‌ టైం రికార్డు సాధించింది. పది కిలోల ధర రూ.1390లు పలికినట్టు సమాచారం. దీంతో హోల్‌సేల్‌లోనే కిలో రూ.139ల ధర ఉంది. రీటైల్‌ మార్కెట్లలో పచ్చిమిర్చి ధర వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సరఫరా లేకపోవడంతో ఉత్తరాఖండ్‌ ఏరియా నుంచి కూడా పచ్చిమిర్చిని దిగుమతి చేసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలోని బహిరంగ మార్కెట్లలో కిలో పచ్చిమిర్చి రూ.180ల వరకూ అమ్ముతున్నారు. రైతు బజార్లలో మిర్చి ధర రూ.86లుగా ఉంది. ఇలా టమాటా, మిర్చి ధరలు భారీగా పెరగడంతో వీటిని కొనాలంటేనే సాధారణ ప్రజానీకం భయపడుతున్నారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో అమ్మో ఇంతా అంటున్నారు. ఒక కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త తక్కువగా ఉన్న ధరలు అమాంతం పెరిగిపోయాయి. బెండ, వంగ, బీర, దొండ, ఆనబ, గోరుచిక్కుళ్లు, చిక్కుళ్లు తదితర రకాల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ధరలు చూసి కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. వానాకాలంలో ధరల పెరుగుదలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-07-03T00:39:38+05:30 IST