Brahmini : లోకేశ్‌నూ అరెస్టు చేస్తే.. బరిలోకి బ్రాహ్మణి!
ABN, First Publish Date - 2023-09-18T02:42:17+05:30
‘చంద్రబాబు(Chandrababu)నే కాదు... లోకేశ్‌నూ జైలుకు పంపిస్తాం!’ ఇది వైసీపీ నేతలు(YCP leaders), ప్రభుత్వ పెద్దలు పదేపదే చేస్తున్న ప్రకటన! అంతేకాదు... చంద్రబాబు, లోకేశ్(Chandrababu, Lokesh)లను వరుస కేసుల్లో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేసి, ఎన్నికల దాకా రిమాండులోనే ఉంచాలనే వ్యూహం రచిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రత్యామ్నాయ ప్రణాళికతో టీడీపీ సిద్ధం
బాబు, లోకేశ్‌లను దీర్ఘకాలం రిమాండ్‌లో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం?
మళ్లీ తెరపైకి ఫైబర్ గ్రిడ్ కేసు
తన శాఖ పరిధిలో లేకున్నా
లోకేశ్ చుట్టూ ‘ఫైబర్’ కథలు
ఆయననూ అరెస్టు చేస్తారనే ప్రచారం
తప్పుడు ఆరోపణలతో నలుగురి అరెస్టు
అందరికీ బెయిలు ఇచ్చిన హైకోర్టు
రెండేళ్ల కిందటే ఆగిపోయిన దర్యాప్తు
అయినా.. మళ్లీ పావులు కదుపుతున్న సీఐడీ
దీటుగా ఎదుర్కోవాలని టీడీపీ నిర్ణయం
‘చంద్రబాబు అరెస్టు శాంపిల్ మాత్రమే.
తర్వాతి వంతు లోకేశ్‌దే!’ - మంత్రి గుడివాడ అమర్నాథ్
‘‘చంద్రబాబు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. స్కిల్ డెవల్‌పమెంట్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా చూశారు. అదే ఆయన చేసిన నేరమా? ఏ రోజూ మా అత్త భువనేశ్వరి బయటకు రాలేదు. ఈ రోజు వచ్చారు. రాష్ట్ర ప్రజలంతా మా కుటుంబ సభ్యులేనన్న ధైర్యం ఉంది. రేపు లోకేశ్‌నూ అరెస్టు చేసినా భయపడే ప్రసక్తే లేదు.’’
- బ్రాహ్మణి (శనివారం రాజమహేంద్రవరంలో)
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు(Chandrababu)నే కాదు... లోకేశ్‌నూ జైలుకు పంపిస్తాం!’ ఇది వైసీపీ నేతలు(YCP leaders), ప్రభుత్వ పెద్దలు పదేపదే చేస్తున్న ప్రకటన! అంతేకాదు... చంద్రబాబు, లోకేశ్(Chandrababu, Lokesh)లను వరుస కేసుల్లో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేసి, ఎన్నికల దాకా రిమాండులోనే ఉంచాలనే వ్యూహం రచిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీడీపీ ఏం చేస్తుంది? అధినేత, ఆయన కుమారుడు ఇద్దరూ అరెస్టయితే ఎన్నికల సమయంలో ఏం చేయాలి? విశ్వసనీయ సమాచారం ప్రకారం... తెలుగుదేశం పార్టీ ‘ప్లాన్-బీ’ సిద్ధం చేసుకుంది. చంద్రబాబుతోపాటు లోకేశ్‌నూ అరెస్టు చేస్తే... ‘నారా’ వారి కోడలు, నందమూరి ఆడపడుచు బ్రాహ్మణి(Brahmini) రంగంలోకి దిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా వచ్చే వారంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. స్కిల్ స్కామ్(Skill scam) పేరుతో చంద్రబాబును ఇప్పటికే అరెస్టు చేశారు. రిమాండ్‌ను అక్రమంగా ప్రకటించి, దానిని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు(High Court)లో విచారణ జరగనుంది.
ఈ ప్రక్రియను వీలైనంత కాలం పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు ఆయనను జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం. సీఐడీ(CID) అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం(Amaravati Inner Ring Road Scam) పేరుతో ఆయనపై మరో వారెంటు సిద్ధం చేసింది. ఇదిలా ఉండగానే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh)ను కూడా అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ‘ఫైబర్ గ్రిడ్ కుంభకోణం’ ( 'Fiber Grid Scam')పేరుతో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గౌతం రెడ్డి (Gautham Reddy) ఫిర్యాదుతో ఈ కేసు మొదలైంది. ఇందులో ఇప్పటికే సీఐడీ నలుగురిని అరెస్టు చేసింది. వారందరికీ బెయిలు వచ్చింది. దీంతో... ఎప్పుడో ఈ కేసు ఆగిపోయింది. ఇప్పుడు దానిని తిరగదోడుతున్నట్లు సమాచారం.
సంబంధం లేకున్నా...
ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో లోకేశ్‌కు ఎలాంటి సంబంధంలేదు. ఒప్పందాల అమలులోనూ ఆయన పాత్ర లేదు. ఆయన అప్పట్లో పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రిగా పని చేశారు. ఫైబర్ గ్రిడ్ పరిశ్రమలు-మౌలిక సదుపాయాల విభాగం (ఐ అండ్ ఐ) పరిధిలోనిది. అయితే... ఐ అండ్ ఐ చూసిన అధికారే ఐటీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన ఒక అధికారిక పనిమీద ఢిల్లీ వెళ్లేందుకు ఐటీ మంత్రి హోదాలో లోకేశ్ అనుమతి ఇచ్చారు. అంతకుమించి ఇంకేం లేదు. అయితే... లోకేశ్‌ను ఇరికించడమే లక్ష్యంగా రకరకాల కథలు అల్లారు. ఈ-గవర్నెన్స్ పాలక మండలి సభ్యుడిగా ఉన్న వేమూరి హరిప్రసాద్‌కు టెరాసాఫ్ట్ సన్నిహిత కంపెనీ అని ఆరోపించారు. ఫైబర్‌గ్రిడ్‌కు అవసరమైన సిబ్బంది నియామకానికి షెల్‌కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. అందులోనూ... విదేశాల్లో ఉన్న వేమూరి హరిప్రసాద్ కుమార్తెకు 1.35 లక్షల జీతం చెల్లించారని, ఆయన భార్య పేరిట ఒక ఫ్లాట్ కొనేందుకు రూ.39 లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించారని ఆరోపించారు. మొత్తంగా ఇది 284 కోట్ల రూపాయల స్కామ్ అని ‘తేల్చారు’. ఈ కేసులో అప్పట్లో ఐ అండ్ ఐ అధికారిగా పని చేసిన (రైల్వే నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు) సాంబశివరావుతోపాటు నలుగురిని అరెస్టు చేశారు. వీరందరికీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసు కూడా అక్కడితో ఆగిపోయింది. రకరకాల అక్రమాలు జరిగాయని చెప్పినా, దర్యాప్తు మాత్రం ముందుకు కదల్లేదు. ఇదంతా జరిగి రెండేళ్లయింది. ఇప్పుడు... తన సన్నిహితులకు మేలు చేసేందుకే ఈ స్కామ్ నడిపారంటూ లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్లాన్-బీతో టీడీపీ...
చంద్రబాబుతోపాటు లోకేశ్‌నూ అరెస్టు చేసి... దీర్ఘకాలం రిమాండులో ఉంచాలన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తే దానిని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ ‘ప్లాన్-బీ’ సిద్ధం చేసుకుంది. నారా బ్రాహ్మణి సారథ్యంలో ముందుకు వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా చంద్రబాబు కుటుంబంలో మహిళలెవరూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. భువనేశ్వరి, బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలు, ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల గురించి మాత్రమే మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరి మీద అప్పట్లో వికృతమైన ప్రచారం జరిగినప్పుడు కూడా సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడమే తప్ప అంతకుమించి ఎక్కువగా స్పందించలేదు. తాజాగా చంద్రబాబు అరెస్టు తర్వాతే భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ నిరసన ర్యాలీల్లో కూడా పాల్గొంటున్నారు. శనివారం రాజమండ్రిలో బ్రాహ్మణి మాట్లాడిన తీరు చూసిన తర్వాత... ఆమె సామర్థ్యంపై పార్టీ శ్రేణులకూ నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు. వెరసి... చంద్రబాబు, లోకేశ్‌లిద్దరినీ ఒకే సమయంలో అరెస్టు చేసిన పక్షంలో బ్రాహ్మణి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తద్వారా... అక్రమ అరెస్టుల వ్యవహారాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నది తమ లక్ష్యమని చెబుతున్నారు.
Updated Date - 2023-09-18T04:13:16+05:30 IST