Sajjala Ramakrishna Reddy: కోర్టు స్పష్టంగా చెప్పినా... చంద్రబాబు నిబంధనలు అతిక్రమించారు
ABN, First Publish Date - 2023-11-01T16:53:51+05:30
ఏపీ హైకోర్టు ( AP High Court ) స్పష్టంగా చెప్పినా... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) నిబంధనలు అతిక్రమించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు.
విజయవాడ: ఏపీ హైకోర్టు ( AP High Court ) స్పష్టంగా చెప్పినా... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) నిబంధనలు అతిక్రమించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) తెలిపారు. బుధవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు అని కోర్టు బెయిల్ ఇచ్చింది. అత్యవసరంగా చికిత్స చేయకపోతే ఇబ్బంది అవుతుందని కోర్టు చెప్పింది. కోర్టు మానవతా ధృక్పధంతో బెయిల్ ఇచ్చి చికిత్స చేయించుకోమని చంద్రబాబుకు తెలిపింది... మరి నిన్న రాజమండ్రి నుంచి చంద్రబాబు ఎలా వచ్చారో అందరూ చూశారు. మీడియా ఫోకస్ కోసం తరలించిన టీడీపీ శ్రేణులతో రోడ్లపై చంద్రబాబు హడావుడి చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున సీఐడీ అధికారులు చంద్రబాబు నిన్న రాజమండ్రి నుంచి గన్నవరానికి వచ్చిన తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజమండ్రి నుంచి గన్నవరానికి మూడు గంటలు పట్టే ప్రయాణం 14 గంటలపైగా చంద్రబాబు సాగించారు. ఒక ఈవెంట్ లాగా చంద్రబాబు ప్రయాణం సాగింది. రోగి అని బెయిల్ తెచ్చుకుని చంద్రబాబు గన్నవరం 14 గంటలు ఎలా వచ్చారు. ఇది మోసం, వంచన కాదా... చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదు. రోగం ఉందని బెయిల్‌పై వచ్చి... పోరాటం అని ప్రచారం చేశారు. 2019లో యుద్ధం అయిపోయింది.. ఇప్పుడు యుద్ధం ఎక్కడది. టీడీపీ నేతలకు పోరాడే శక్తి లేకే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ని పొత్తు కోసం తెచ్చుకున్నారు. ఆయన భుజం మీద చేయి వేసి బలం ఉందని చెప్పేందుకు తహతహలాడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలనకి ప్రజల మద్దతు ఉంది... ఇక యుద్ధం లేదు. అయినా ధర్మ యుద్ధం చేసేవారు లేరు. మారీచా యుద్ధం వాళ్లు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ రోల్ టీడీపీలో ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. లోకేష్ ఢిల్లీ వెళ్తే... నారా భువనేశ్వరి వచ్చి యుద్ధం అంటున్నారు. ముందు వాళ్లలో యుద్ధం చేసేవారు ఎవరో వాళ్లే తేల్చుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవ చేశారు.
Updated Date - 2023-11-01T16:53:51+05:30 IST