NARA LOKESH: జగన్‌ దగా సీఎం!

ABN , First Publish Date - 2023-05-25T02:53:32+05:30 IST

‘ఎన్నికల్లో గెలిచేందుకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఎన్నికలయ్యాక అన్ని వర్గాలనూ మోసం చేశాడు. రైతు రాజ్యం తెస్తానని చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక రైతులే లేని రాజ్యంగా తయారు చేస్తున్నాడు.

NARA LOKESH: జగన్‌ దగా సీఎం!

రైతు రాజ్యమన్నాడు.. రైతే లేని రాజ్యంగా చేస్తున్నాడు

మోటార్లకు మీటర్లతో ఉరి

యువగళంలో లోకేశ్‌ ధ్వజం

1,400 కి.మీ. దాటిన పాదయాత్ర

రేపటి నుంచి నాలుగు రోజులు బ్రేక్‌

కడప, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల్లో గెలిచేందుకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఎన్నికలయ్యాక అన్ని వర్గాలనూ మోసం చేశాడు. రైతు రాజ్యం తెస్తానని చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక రైతులే లేని రాజ్యంగా తయారు చేస్తున్నాడు. అన్నివర్గాలను మోసం చేసిన దగా ముఖ్యమంత్రి జగన్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. యువగళంలో భాగంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో 109వ రోజు పాదయాత్ర నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుద్దపల్లె బస కేంద్రం వద్ద ఉదయం గండికోట, రాజోలి రిజర్వాయర్ల ముంపు బాధితులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ తియ్యని మాటలు చెప్పారు. గండికోట ముంపువాసులకు రూ.10 లక్షలు ఇస్తామన్నారు. పోలవరంలో కూడా అలాగే చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక మోసం చేశారు’ అని ధ్వజమెత్తారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతుల మెడకు ఉరేనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థాన ంలో ఉందని చెప్పారు. ‘చంద్రబాబు హయాంలో రైతులకు రాయితీపై డ్రిప్‌, రైతు రథం, పోషక ఎరువులు, అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందేవి. జగన్‌ ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌, రాయితీలన్నిటినీ నిలిపివేసింది.

ఈ ప్రభుత్వం వచ్చాక ఈఎంఐలు కట్టలేక రాయలసీమ వ్యాప్తంగా వెయ్యి మంది ట్రాక్టర్లను వెనక్కి ఇచ్చినట్లు ఓ బ్రాండ్‌ అధికారి వెల్లడించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా రద్దు చేసింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎరువులు, విత్తనాలు ధరలు పెరిగాయి. పెట్టుబడులు రావడంలేదు. కడప జిల్లా నుంచి వెళ్లేలోపు రాయలసీమ రైతాంగానికి ఏం చేయబోతున్నామో వెల్లడిస్తాం’ అన్నారు. టీడీపీ హయాంలో రైతులపై తలసరి అప్పు రూ.70వేలు ఉండగా జగన్‌ వచ్చాక 2.50 లక్షలకు పెరిగిందని లోకేశ్‌ అన్నారు. వ్యవసాయ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారని.. ఆయన ఏనాడైనా రైతుల వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు.

1400 కి.మీ మైలురాయి..

400 రోజులు 4 వేల కి.మీ సాగనున్న యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద 1,400 కిలోమీటర్ల మైలురాయి దాటుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు శిలాఫలకం ఆవిష్కరించానన్నారు. పరిశ్రమ ఏర్పాటు ద్వారా రైతులకు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సుద్దపల్లె నుంచి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర మొదలైంది. జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, నెమళ్లదిన్నె మీదుగా సాగింది. ప్రతి గ్రామంలో జనం లోకేశ్‌కు అపూర్వ స్వాగతం పలికారు. కాగా.. రాజమండ్రిలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు లోకేశ్‌ హాజరు కానున్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి 30న యాత్రను కొనసాగిస్తారు.

Updated Date - 2023-05-25T02:53:40+05:30 IST