Sujana Chowdary: తొమ్మిదేళ్లలో నవభారత్ ఆవిష్కృతం.. మోడీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2023-06-01T11:44:43+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల‌ పాలనపై ఏపీలో యాభై లక్షల‌ కర పత్రాల‌ పంపిణీకి రాష్ట్ర బీజేపీ నేతలు శ్రీకారం చుట్టారు.

Sujana Chowdary: తొమ్మిదేళ్లలో నవభారత్ ఆవిష్కృతం.. మోడీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలి

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తొమ్మిదేళ్ల‌ పాలనపై ఏపీలో యాభై లక్షల‌ కర పత్రాల‌ పంపిణీకి రాష్ట్ర బీజేపీ నేతలు (BJP Leaders) శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు (AP Leaders Somuveerraju), మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి (Sujana Chowdari) కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారన్నారు. ఈ తొమ్మిదేళ్లలో నవ భారత్ ఆవిష్కృతమైందని.. ఈ‌ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థలే‌ చెబుతున్నాయని తెలిపారు. పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేదన్నారు. నేడు పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరపరా చేశామన్నారు. జనాభాలో చైనాను భారతదేశం మించి పోయిందన్నారు. అయినా కోవిడ్ సమయంలో ప్రాణ నష్టం చాలా వరకు నివారించారని చెప్పారు. ఏపీలో‌ విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారన్నారు. మోడీ పాలనలో ఏపీకి విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ‌ ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా‌ ఉందని స్పష్టం చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల‌ పోలవరం ఆలస్యం అయ్యిందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ఆపేశారని ఆయన అన్నారు.

వెనుకబడిన ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. మోడీ పాలనపై ప్రపంచ దేశాలు కూడా చర్చ చేసుకుంటున్నారన్నారు. ఎక్కడకి‌ వెళ్లినా మోడీ ధైర్యంగా మన దేశం గొప్పతనం గురించి చాటి చెబుతున్నారన్నారు. ఏపీ కూడా మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలో మొదటి‌ ఐదు స్థానాల్లో ఏపీ ఉంటుందని తెలిపారు. మోడీ సారధ్యంలో భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వచ్చిందన్నారు. నిబంధనల‌ ప్రకారం లేని మెడికల్ కళాశాలలను రద్దు చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని.. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. అధిష్టానం ఏం చెబితే తాము అలాగే నడుస్తామన్నారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి కేంద్రం ఎక్కువ సాయం చేసిందన్నారు. ఈ‌ విషయంలో చర్చకు ఎవరొచ్చినా తాను సిద్ధమని స్పష్టం చేశారు. రాజకీయంగా రాష్ట్రంలో బీజేపీ లబ్ది పొందలేక పోయింది కానీ.. అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సాయం అందిస్తూనే ఉందన్నారు. ఏపీలో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి సమయం పడుతుందని సుజనా చౌదరి పేర్కొన్నారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ.. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఏపీలో యాభై లక్షల కర పత్రాలను ఇంటింటికి పంచుతామని తెలిపారు. ఈనెల 20 నుంచి నెలాఖరు వరకు ఈ కరపత్రాల పంపిణీ మొదలు పెడతామన్నారు. బీజేపీని ప్రజలకు‌ చేరువ చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ 9090902024 నంబర్‌‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.

Updated Date - 2023-06-01T11:44:43+05:30 IST