Srisailam: రథంపై ఊరేగిన ఆది దంపతులు

ABN , First Publish Date - 2023-02-19T21:32:16+05:30 IST

శివరాత్రి (Shivratri) బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీగిరిపై మల్లన్న, భ్రమరాంబదేవిల పెళ్లి వేడుకలు తెలవారుజామున కనులపండువగా జరిగాయి. అనంతరం ఆది దంపతులకు రథోత్సవం

Srisailam: రథంపై ఊరేగిన ఆది దంపతులు

శ్రీశైలం: శివరాత్రి (Shivaratri) బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీగిరిపై మల్లన్న, భ్రమరాంబదేవిల పెళ్లి వేడుకలు తెలవారుజామున కనులపండువగా జరిగాయి. అనంతరం ఆది దంపతులకు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక ఆద్యంతం నయనానందకరంగా సాగింది. ఆదివారం సాయంత్రం రథశాల వద్ద అర్చకులు రథాంగ దేవతాపూజ, రథాంగ దేవతా హోమం, బలిసమర్పణ క్రతువులు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవాలయ ప్రాంగణంలో విశేష పూజలు, అర్చనలు, హారతులు అందుకున్న ఉత్సవమూర్తులను వెండి పల్లకిలో తోడ్కొని భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ రథం వద్దకు చేర్చారు. రథంపై అధిష్టింపజేసి సాత్వికబలిగా కొబ్బరి, గుమ్మడి కాయలను సమర్పించారు. అనంతరం ఓంకార ధ్వనుల మధ్య భక్తులు (Devotees) రథాన్ని ముందుకు లాగారు. రథం ముందు నందికోలలు ఆడించారు. ఢమరుకలు మోగించారు. రథోత్సవం ముందు నిర్వహించిన పలు కార్యక్రమాలు అలరించాయి.

తెప్పోత్సవం..

రథోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయం వెలుపల ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణిలో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పను సుంగధ పరిమళ పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు జరిపి తెప్పోత్సవం నిర్వహించారు.

ధ్వజారోహణ, యాగ పూర్ణాహుతి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ క్రతువులకు పదో రోజు సోమవారం ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం, త్రిశూలస్నానం, వసంతోత్సవం సాయంత్రం సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాలు జరగనున్నాయి.

Updated Date - 2023-02-19T21:32:17+05:30 IST