శ్రీకాకుళం నుంచి తిరుపతికి చేరిన గుండె
ABN , First Publish Date - 2023-04-23T21:24:39+05:30 IST
బ్రెయిన్ డెడ్ అయిన కిరణ్ చంద్ (Kiran Chand) గుండెను శ్రీకాకుళం నుంచి తిరుపతిలోని టీటీడీకి చెందిన చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్
తిరుపతి: బ్రెయిన్ డెడ్ అయిన కిరణ్ చంద్ (Kiran Chand) గుండెను శ్రీకాకుళం నుంచి తిరుపతిలోని టీటీడీకి చెందిన చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళంలో పదోతరగతి విద్యార్థి కిరణ్ చంద్ బ్రెయిన్ డెడ్ (Braid dead) కావడంతో అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే తిరుపతి జిల్లా తడ మండలం రామాపురానికి చెందిన అంబరసు, గోమతి దంపతుల కుమార్తె ఐదున్నరేళ్ల రితికకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఈమెకు తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి హృదయాలయంలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థి గుండెను ఈమెకు అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. దీంతో శ్రీకాకుళం నుంచి భారీ బందోబస్తు నడుమ అంబులెన్స్ ద్వారా ఆ విద్యార్థి గుండెను విశాఖ ఎయిర్‌పోర్టు (Visakha Airport)కు తరలించారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.19 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడినుంచి ఎస్కార్ట్ వాహనాలతోపాటు రహదారి వెంబడి పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అప్పటికే వర్షం మొదలైనా విమానాశ్రయం నుంచి చిన్నపిల్లల ఆస్పత్రికి 6.46 గంటలకు.. 27 నిమిషాల వ్యవధిలో గుండె చేరుకుంది. అన్నీ సిద్ధం చేసుకుని ఉన్న వైద్యులు వెంటనే చిన్నారికి గుండెను అమర్చే శస్త్రచికిత్స ప్రారంభించారు.