వైసీపీకి మరో షాక్
ABN , Publish Date - Dec 30 , 2023 | 01:34 AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు.

పార్టీకి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గుడ్‌బై
టీడీపీలో చేరనున్నట్టు సమాచారం
ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీని వీడిన 48 గంటల్లో మరో నేత రాజీనామా
సంక్రాంతిలోగా మరికొంతమంది నేతలు, ఐదారుగురు కార్పొరేటర్లు వెళ్లిపోతారని ప్రచారం
అధికార పార్టీలో కలవరం
అసంతృప్తులను బుజ్జగించేందుకు యత్నాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీపరంగా దక్షిణ నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు మనస్తాపం కలిగించాయని, అందుచేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీని విడిచిపెట్టిన 48 గంటల్లోనే సీనియర్ నేత అయిన సీతంరాజు సుధాకర్ రాజీనామా చేయడం అధికార పార్టీలో కలకలం రేపింది. సంకాంత్రిలోగా మరికొందరు నేతలు, ఐదారుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడిపోతారనే ప్రచారం జరుగుతోంది. నిన్నమొన్నటి వరకూ ‘వై నాట్ 175’ అంటూ రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మబ్బులు విడిపోతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండడం, మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అంచనాలు వెలువడుతుండడంతో పార్టీలో ఇన్నాళ్లూ అసంతృప్తిగా ఉన్నవారంతా ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీలో తమకు గౌరవం దక్కలేదని, తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ రాజీనామా బాటపడుతున్నారు. కొద్దిరోజుల కిందట దక్షిణ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు (నాగరాజు, సాదిక్) వైసీపీని వీడి జనసేనలో చేరారు. రెండు రోజుల కిందట ఎమ్మెల్సీ, పార్టీకి నగర అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పనిచేసిన వంశీకృష్ణశ్రీనివాస్ గుడ్‌బై చెప్పి...జనసేనలో చేరిపోయారు. ఆ పరిణామం నుంచి పార్టీ నేతలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పార్టీకి రాజీనామా చేస్తూ శుక్రవారం సీఎం జగన్‌కు లేఖ పంపించారు. మరో ఐదుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ నేతలే చెబుతున్నారు. వీరితోపాటు పార్టీ పదవిలో ఉన్న ఒక నేత, కొంతకాలం కిందటివరకూ ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేయడంతోపాటు, ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులో కొనసాగిన నేత కూడా పార్టీని వీడిపోతారని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం అధిష్ఠానానికి చేరడంతో వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించాలని జిల్లాలోని ముఖ్య నేతలను ఆదేశించింది. దీంతో పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు, కార్పొరేటర్లను గుర్తించి, వారిని బుజ్జగించే పనిలో ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరిని పిలిచి యోగక్షేమాలు అడిగి, పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి అవకాశం ఇస్తామో వివరిస్తున్నారు. పరోక్షంగా పార్టీ మారొద్దంటూ బుజ్జగిస్తున్నారు. కాగా వైసీపీ రాజీనామా చేసిన సీతంరాజు సుధాకర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలిసింది.