Share News

వైసీపీ నేతల పక్కచూపులు

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:21 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది.

వైసీపీ నేతల పక్కచూపులు

పార్టీ పెద్దల్లో కలవరం

ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు జనసేనలో చేరిక

అదేబాటలో మరికొందరు కార్పొరేటర్లు?

సాధారణ ఎన్నికల్లోగా పది మందికిపైగా టీడీపీ, జనసేనల్లో చేరిపోతారనే ప్రచారం

తాజా పరిణామాలతో దిద్దుబాటు చర్యలపై అధిష్ఠానం దృష్టి

వాసుపల్లిని టికెట్‌ ఇస్తే పార్టీని వీడిపోతామని ‘సౌత్‌’లో ఐదుగురు కార్పొరేటర్లు అల్టిమేటం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఇప్పటివరకూ తప్పనిసరి పరిస్థితిలో సర్దుకుపోయిన వారంతా సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. మరో పది మంది కార్పొరేటర్లు త్వరలో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం వైసీపీ నేతల్లో కలవరం రేపుతోంది.

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 59 వార్డులను గెలుచుకుని మేయర్‌ పదవిని దక్కించుకుంది. అయితే పాలకవర్గం పనితీరు నగర వాసులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. వార్డు స్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో కార్పొరేటర్లు విఫలమయ్యారు. దీంతో కార్పొరేటర్లపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. వార్డు స్థాయిలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం ఉండడం లేదనేది వైసీపీకి చెందిన పలువురి కార్పొరేటర్ల వాదన. పైగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్నవారికే వైసీపీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం, జీవీఎంసీలో కూడా వారి సిఫారసుల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు తయారుచేస్తుండడంతో కార్పొరేటర్లలో అసంతృప్తి అధికమైంది. వార్డులో తాము ఏమీ చేయలేకపోతున్నామనే భావన వారిలో గూడు కట్టుకుంది. తమ ఆవేదనను పార్టీ నేతల వద్ద వ్యక్తపరిస్తే, అధిష్ఠానం దృష్టిలో పెట్టి క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా తేడా జరిగితే ఇప్పుడు చేసుకుంటున్న చిన్నపాటి పనులు కూడా ఆగిపోతాయని భయపడ్డారు. అంతేకాకుండా పార్టీని వీడిపోతే ఇతర ఇబ్బందులను కూడా ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో ఇంతకాలం తమ అసంతృప్తిని బయటపడకుండా నెట్టుకుంటూ వచ్చారు. అయితే మరో మూడు, నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ఒక్కొక్కరు తమ గళం విప్పుతున్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విషయాన్ని అధికార పార్టీ కార్పొరేటర్లు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదనే భావనతో ఉన్నవారంతా... ఇంకా గుర్తింపు, గౌరవం లేని పార్టీలో కొనసాగడం అనవసరమనే నిర్ణయానికి వచ్చి ప్రత్యామ్నాయంపై దృష్టిసారించారు. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేనలో చేరిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన ఏడుగురు కార్పొరేటర్లు కూడా పార్టీ పట్ల, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా తమ అసంతృప్తిని ఇటీవలే బహరంగంగా వ్యక్తంచేశారు. వాసుపల్లికి టికెట్‌ ఇస్తే పార్టీని వీడిపోతామంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. దీంతో ఉలిక్కిపడిన అధిష్ఠానం పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డిని నగరానికి పంపించి అసంతృప్త కార్పొరేటర్లతో చర్చలు జరపాలని ఆదేశించింది. సుబ్బారెడ్డి ఎదుట కూడా కార్పొరేటర్లు తమ నిర్ణయం మారదని, వాసుపల్లిని మార్చాల్సిందేనని స్పష్టంచేయడం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. వారిలో ఐదుగురు కార్పొరేటర్లు త్వరలోనే పార్టీని వీడిపోవడానికి ముహూర్తం పెట్టుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సాధారణ ఎన్నికలలోపు వైసీపీ నుంచి భారీగానే కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరిపోతారని వైసీపీ నేతలే చెబుతున్నారు. అదే జరిగితే జీవీఎంసీ మేయర్‌ పదవి కూడా వైసీపీ చేజారిపోవడం ఖాయం. పార్టీ పరిస్థితి బాగోలేనందున ఎవరి దారి వారు చూసుకుంటున్నారని, బుజ్జగించినా ఆగరని...వైసీపీ నేతలు నిట్టూరుస్తుండడం గమనార్హం.

Updated Date - Dec 26 , 2023 | 01:21 AM