Pancard: పాన్‌కార్డుపై కేంద్రం కీలక ప్రణాళికలు.. బడ్జెట్ 2023లో ప్రకటన!
ABN, First Publish Date - 2023-01-13T14:28:58+05:30
దేశంలో కొత్త వ్యాపారం ప్రారంభం, నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
న్యూఢిల్లీ: దేశంలో కొత్త వ్యాపారం (Business) ప్రారంభం, నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాన్‌కార్డ్ (Permanent Account Number) నంబర్‌కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా (Single Business Identification Number) చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్-2023లో (Budget 2023) కీలక ప్రకటన చేయవచ్చునని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాన్‌ను ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’ గుర్తించడం ద్వారా వ్యాపారాల పన్ను చెల్లింపులు (compliance) మరింత సరళీకృతం అవుతాయని కేంద్రం భావిస్తోంది.
కాగా ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం చేయాలంటే అవసరాలను బట్టి వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు తీసుకోవాల్సి వస్తోంది. ట్యాక్సుల రిజిస్ట్రేషన్, లోన్ లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్... ఇలా వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు ఉండాలి. అయితే ఇప్పటికే పాన్‌ను (PAN) పన్ను చెల్లింపుల్లో ఉపయోగిస్తున్నందున.. మున్ముందు వ్యాపార పక్రియ, నిర్వహణ సామర్థ్యాల పెంపునకు బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పాన్‌ను గుర్తిస్తే మరింత ప్రయోజనకరమని భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా 10-డిజిటల్ అల్ఫాన్యుమరిక్ నంబర్ అయిన పాన్‌కార్డును ఆదాయ పన్ను విభాగం (Income tax department) జారీ చేస్తుంది. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను రిటర్నులు, పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్‌కార్డు (Pancard) తప్పనిసరిగా ఉంది. ఒకవేళ సింగిల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా గుర్తిస్తే పలు విధాలుగా ఉపయోగపడనుంది. ఆచరణలోకి వస్తే చిన్న- మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్ఎంఈలు) ఎక్కువ ప్రయోజనకరంగా ఉండనుంది. ఎందుకంటే చిన్నచిన్న కంపెనీలకు పన్ను దాఖలు విధానం ప్రస్తుతం కాస్తంత సంక్లిష్టంగానే ఉంది. వేర్వేరు గుర్తింపు నంబర్ల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. పాన్‌కు సింగిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ గుర్తింపునివ్వడం ద్వారా చిన్న కంపెనీలు సమయాన్ని ఆదా చేసుకొని వ్యాపార వృద్ధిపై దృష్టిసారించేందుకు అవకాశాలు ఏర్పడుతాయి. అంతేకాకుండా భారతీయ వ్యాపారం రగంలో పారదర్శకత, బాధ్యతలు మరింత మెరుగవుతాయనే విశ్లేషణలున్నాయి. ఒక వ్యాపారానికి ఒకే గుర్తింపు నంబర్ ఉంటే పన్ను దాఖలులతోపాటు వేర్వేరు చట్టాలు, నిబంధనల పాటింపును సులభంగా పర్యవేక్షించవచ్చు. పన్నుఎగవేతలు, ఇతర మోసపూరిత విధానాలకు చెక్ పెట్టవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2023-01-13T14:34:29+05:30 IST