ఈ ఘర్షణల్లో ఓడింది మానవత్వమే!
ABN , First Publish Date - 2023-10-19T01:08:35+05:30 IST
మనకందరికీ పాకిస్థాన్, ఇండియా విభజన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసు. మెజారిటీ ముస్లిం ఏరియాలు పాకిస్థాన్‌లో కలపాలి అని కాంగ్రెస్, ముస్లిం లీగులు సూత్రప్రాయ ఒప్పందానికి...
మనకందరికీ పాకిస్థాన్, ఇండియా విభజన ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసు. మెజారిటీ ముస్లిం ఏరియాలు పాకిస్థాన్‌లో కలపాలి అని కాంగ్రెస్, ముస్లిం లీగులు సూత్రప్రాయ ఒప్పందానికి రావడం వల్ల బంగ్లాదేశ్ విడిగా ఉన్నా అది పాకిస్థాన్ కిందకే వెళ్ళిపోయింది. కశ్మీర్‌లో హరిసింగ్ రాజు మాత్రం పాకిస్థాన్ దాడి నుంచి తప్పించుకోడానికి ఈ ఒప్పందంతో సంబంధం లేకుండా మొత్తం భూభాగాన్ని ఇండియాకు అప్పజెప్పడం, ఇండియా నుంచి నెహ్రూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని తప్పుడు వాగ్దానం చేయడం, అది నచ్చక అంబేడ్కర్ ఆర్టికల్ 320 రాయకపోవడం, ఇంకెవరో 320 రాయడం, ఆ తర్వాత రెండు దేశాల మధ్య రావణ కాష్ఠం లాంటి ఘర్షణ మొదలుకావడం... వగైరా అందరికీ తెలిసిన విషయాలే.
అట్లా కాక మరోలా జరిగి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహిద్దాం: పాకిస్థాన్ విభజన విషయంలో కాంగ్రెస్‌కు, ముస్లిం లీగ్‌కు ఏకాభిప్రాయం కుదరలేదనుకుందాం. సమస్య ఐక్యరాజ్యసమితికి వెళ్ళిందనుకుందాం. అక్కడ ఇప్పటి బాంగ్లాదేశ్‌తో కలిపిన పాకిస్థాన్‌ను, ఇండియాను విడగొడతారు. ఇది ఇక్కడి హిందువులకు నచ్చదు. పాకిస్థాన్‌కు కూడా కశ్మీరు విషయంలోనూ పంజాబ్, సింధ్ బార్డర్స్ విషయంలోనూ అసంతృప్తి ఉంటుంది. ఏదేమైతేనేం ఇండియా ఐక్యరాజ్య సమితి ఒప్పందంతో సర్దిపుచ్చుకుంది. అయితే ఆ ఒప్పందం నచ్చక పాకిస్థాన్ మిగతా ముస్లిం దేశాలతో కలిసి తనకు కావాల్సిన కశ్మీర్, పంజాబ్, సింధ్ భాగాల కోసం ఇండియా మీద దాడి చేసింది. ఇక ఇండియా అమెరికా సపోర్టుతో ఆ దాడిని తిప్పికొట్టి, కశ్మీరును కొంత ఆక్రమించింది. మళ్ళీ ఊరుకోకుండా ఓ పదేళ్ల తర్వాత పాకిస్థాన్ మరో దాడికి సిద్ధమైంది. ఇండియా మళ్ళీ తిప్పికొట్టింది. ఈ సారి మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇలా పాకిస్థాన్ ముస్లిం దేశాల సహాయంతో ఇండియా మీద దాడి చేయాలని చూసిన ప్రతిసారి ఇండియా దాన్ని తిప్పికొట్టి పాకిస్థాన్ భూభాగాన్ని మరింత ఆక్రమించుకుందనుకుందాం. పాకిస్థాన్ దాడి చేసి వందమందిని చంపితే, ఇండియా వెయ్యిమందిని చంపిందనుకుందాం. పాకిస్థాన్ ఒక సెంటిమీటరు ముందుకు రావాలని చూస్తే ఇండియా ఒక కిలోమీటర్ ముందుకెళ్ళిందనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయిల్ – పాలస్తీనాల మధ్య సంఘర్షణలో కూడా ఇలాంటి కథే చిన్న చిన్న తేడాలతో జరుగుతున్నది. తప్పొప్పుల బేరీజులో దశాబ్దాలు గడిచిపోతున్నాయి కాని, ఈ మారణహోమానికి అంతుచిక్కటం లేదు.
ఈసారి హమాస్ నిద్రపోతున్న పులిని గిల్లి మరీ లేపింది. దీనికి యుద్ధ రూపం కూడా ఇవ్వకుండా మొండి దాడి చేసి దొమ్మీలా, కొట్లాటలా మార్చింది. ఇదే ఫార్ములాని ఇందాకటి ఊహాజనిత కథకి అన్వయిస్తే– అంటే పాకిస్తాన్ కశ్మీరును, చైనా అక్సాయ్‌చిన్‌ను ఆక్రమించాక ఇండియా మొండిగా దాడులు మొదలుపెట్టి ఉంటే– ఈ రోజు ఇండియాలో ఎంత భూభాగం మిగిలేదో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడకు దిగజారేదో ఊహాతీతం.
ఐక్యరాజ్యసమితి కూడా ఒక స్థాయి దాటాక నిస్సహాయంగా మిగిలిపోవాల్సిందే! ఇప్పటికి పాలస్తీనా ఏడుసార్లు యుద్ధాన్ని ప్రేరేపించడమో, యుద్ధం మొదలుపెట్టడమో చేసింది. యుద్ధం చేసిన ప్రతిసారీ కొంత భూభాగం కోల్పోయింది. అంతకుమించి ఆ దేశం ఈ యుద్ధాల వల్ల సాధించింది ఏమీ లేదు. ఐక్యరాజ్యసమితి మంచో చెడో 1947లో ఒక తీర్మానం చేసాక, ఇక దౌత్య యత్నాల ద్వారా సమస్యకు సమాధానాన్ని కనుగొనాల్సిందే తప్ప అంతకుమించి చేసేదేమీ లేదు. యుద్ధం పరిష్కారం అసలే కాదు. యుద్ధం ఒకసారి మొదలైతే గెలవాల్సిందే. ఓడిన తర్వాత అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. 1948లో ఐదు లక్షల జనాభా ఉన్న ఇజ్రాయిల్‌పై మొదటిసారి మూకుమ్మడిగా ఆరు కోట్ల జనాభా ఉన్న ఐదు అరబ్ దేశాలు దాడి చేసాయి. దాడి చేసేముందు ఆ దేశం సమ ఉజ్జీనా కాదా అని ఏ ఒక్క అరబ్ దేశమూ చూడలేదు. ఆ దేశాలకు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య సమస్యతో కేవలం మత సంబంధం తప్ప వేరే ఏ సంబంధమూ లేదు మరి! 1947–48లో కశ్మీరు గురించి ఇండియా పాకిస్థాన్ దేశాలే యుద్ధం చేసాయి గాని, వాళ్ళ తరపున వేరే ఎవ్వరూ ఆ యుద్ధంలో పాల్గొనలేదు. ఇందుకు భిన్నంగా 1948 అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం రెండు దేశాల మధ్య సమస్యకు పరిష్కారంగా ఒక భిన్న యుద్ధ సంస్కృతి తీసుకొచ్చింది. అప్పుడే హాలోకాస్ట్‌కు గురైన యూదులతో కూడిన ఇజ్రాయిల్ దేశానికి విపరీతమైన అభద్రతా భావం కలిగింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ తమ రక్షణ శాఖను పకడ్బందీగా మలచుకోవడాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి యువతీ రెండేళ్లపాటు, ప్రతి యువకుడూ మూడేళ్లపాటు తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలని ఆ దేశ ప్రజలు కఠినంగా తీర్మానించుకున్నారు. 1948లోనే యుద్ధాన్ని ప్రత్యామ్నాయంగా చూడకుండా, ఒక సంభాషణను కొనసాగించి ఉంటే ఈనాడు రెండు దేశాల మధ్య వాతావరణం వేరేగా ఉండేది.
యాసర్ అరాఫత్ అంతర్జాతీయ దౌత్యాన్ని ఉపయోగించి ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెచ్చి కొంత పురోగతి సాధించాడు. అయితే పాలస్తీనాలో ఉండే మత ఛాందసవాదులకు ఇది నచ్చకపోవడంతో అరాఫత్ అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మృతి చెందాడు. అలాగే గాంధీ పాకిస్థాన్ విభజనను అంగీకరించి గాడ్సే చేతుల్లో చనిపోయినట్టే, అప్పటి ఇజ్రయెల్ ప్రధాని ఒక మూర్ఖుడి చేతిలో కాల్చిచంపబడ్డాడు. అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల గురించే ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి నుదుటి మీద రెండు వెంట్రుకలు కనిపించాయని హిజాబ్ పేరుతో చంపేసి, అప్పుడు లేచిన ఉద్యమంలో వందలమందిని హతమార్చిన ఘాతుక ఇరాన్, పాలస్థీనాలు ప్రజల ప్రజాస్వామిక హక్కులను కోరుకుంటాయా?
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులపై అంతర్జాతీయంగా పెల్లుబికిన సానుభూతికి ఖచ్చితమైన అర్థం ఉంది. అయితే దానికి సమాధానం పాలస్తీనానా కాదా అన్నది సమస్య. అప్పుడు అమెరికా యూదులకు తమ దేశంలో ప్రత్యేక దేశం ఇస్తానని వాగ్దానం చేసింది లేదు. అన్యాయం జరిగింది అని బాధపడ్డ పాలస్తీనాకు ఇరాన్, లెబనాన్ తదితర దేశాలు ప్రత్యేక చోటు కల్పించింది లేదు. ఏదేమైనా ఏదో ఒక ప్రాతిపదిక మీద అందరూ సమ్మతించి ఒక ఫోరంలో నిర్ణయం జరిగాక కూడా, సమస్యను యుద్ధం ద్వారా గెలుద్దాం అన్న తీరులోకి పాలస్తీనా మళ్ళాక, ఇక ఇజ్రాయిల్ ఎవరి ఉదారత్వం మీదో ఆధారపడే పరిస్థితి గాక, ఎదురుదాడి ద్వారా మాత్రమే తన ఉనికి కాపాడుకోగలనని నమ్మే పరిస్థితికి వచ్చింది. ఇక ఈ మధ్యలో ఎన్ని అసత్య వార్తలు వచ్చినా, అవి ఎవరి తరపున ఉన్నవాళ్ళు వారికి అనుగుణంగా సృష్టించుకుంటున్నారు. హమాస్ ఎటువంటి ప్రకటనా సూచనా లేకుండా, సాధారణ ఇజ్రాయిల్ మిలిటరీపై గాక ఇజ్రాయిల్ ప్రజానీకంపై ఆకస్మిక దాడి చేయటం అన్నది నిప్పును రాజేసేదే తప్ప పరిష్కారాన్ని సాధ్యం చేసే చర్య కాదు. అంతేగాక ప్రణాళికాత్మకంగా చూసినా – అది కేవలం ఆవేశపరమైన ఉగ్ర చర్యే తప్ప, అందులో ఒక క్రమబద్ధమైన యుద్ధం చేద్దామన్న ఉద్దేశం కూడా లేదు. ఇక ఆ తర్వాత ఇజ్రాయిల్ గాజాలో దేన్నీ నిలువనివ్వడం లేదు. హమాస్ తరహా మోటు పద్ధతులను అనుసరించకపోయినా, హింసలో ఆ దేశం పది అడుగులు ముందు ఉంది. గాజా స్ట్రిప్‌కు నీటిని, విద్యుత్తును, అన్నింటినీ కట్ చేసి మరీ హింసిస్తున్నది. ఐక్యరాజ్యసమితే గాక అమెరికా కూడా ఇది ‘యుద్ధ నేరా’ల కిందకు వస్తుంది అని చెప్తున్నా కూడా ఇజ్రాయిల్ వినే పరిస్థితిలో లేదు. తన కడుపు మంటను చల్లార్చుకోవడానికి గాజాను బూడిద చేస్తున్నది. నిజానికి ఒక బలమైన శక్తిగా నిలబడిన ఇజ్రాయిల్‌కు శాంతి గురించి ఎక్కువ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించి ఆ దేశం పగతో రగిలిపోతున్నది. నిద్రపోతున్న ఇజ్రాయిల్‌పై దాడి చేసి ప్రాణ నష్టం మొదలుపెట్టిన హమాస్ ఇప్పుడు ఇజ్రయెల్ దాడిని బలహీనంగా ప్రతిఘటిస్తున్నది.
హాలోకాస్ట్ తర్వాత ఎంతో గాయపడ్డ ఇజ్రాయిల్‌కు ఇప్పుడు పాలస్తీనా సార్వభౌమాధికారం అన్నది అప్రస్తుతం. మానవ జాతి ఇప్పుడు తలదించుకోవాల్సిన సంఘటనలు ఎన్నింటినో చూడ్డానికి సిద్ధపడక తప్పదు. ఎవరి తప్పు ఎంత అని బేరీజు వేస్తూ యుగాలు గడిచిపోతున్నాయి గాని, ఎవరో ఒకరు ఒక చోట ఆగటం లేదు. ఈ మారణ హోమం చాలు అని ఆపి, ఇద్దరి లాభాలను వదులుకుని ఒక పరిష్కారం చూసుకుందామనే ఆలోచన చేయటం లేదు. అందుకు ఒక విశ్వసనీయత గల మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తికి నిష్పాక్షిక ఎజెండా ఉండాలి. ఇన్నేళ్ళ ప్రజాస్వామిక చరిత్రలో ఈ ప్రపంచం ఆ దిశగా సాధించింది ఏమీ లేదు. మనమందరం ఒక దురదృష్ట సందర్భంలో నివసిస్తున్నాం.
పి. విక్టర్ విజయ్‌కుమార్