స్వామినాథన్: ఒక విప్లవం, ఒక వివాదం

ABN , First Publish Date - 2023-10-11T03:29:12+05:30 IST

జనాభా పెరుగుదల కుందేలులా (geometric rate) పరుగులు తీస్తుంటే ఆహారోత్పత్తి పెరుగుదల తాబేలులా (arithmetic rate) నిదానంగా సాగుతుందనీ, అందుచేత కరువు కాటకాలు వచ్చి మనుషులు...

స్వామినాథన్: ఒక విప్లవం, ఒక వివాదం

జనాభా పెరుగుదల కుందేలులా (geometric rate) పరుగులు తీస్తుంటే ఆహారోత్పత్తి పెరుగుదల తాబేలులా (arithmetic rate) నిదానంగా సాగుతుందనీ, అందుచేత కరువు కాటకాలు వచ్చి మనుషులు చనిపోకతప్పదనీ ఇంగ్లండుకు చెందిన థామస్ మాల్థస్ 18వ శతాబ్దంలో ఓ సిద్ధాంతం చేశాడు.

మనం చరిత్రను పరిశీలిస్తే భారత ఉపఖండంలో మహా కరువుల్లో అత్యధిక భాగం బ్రిటిష్ వలస పాలన కాలంలోనే సంభవించాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. థామస్ మాల్థస్ జనాభా సిద్ధాంతం అర్థశాస్త్రంలో ఒక అర్థంలేని ప్రతిపాదన. మనిషి పొట్ట పెట్టుకుని తినడానికి మాత్రమే పుట్టడు; ఉత్పత్తి స్థాయిని పెంచడానికి ఒక మెదడు, రెండు చేతులతోనూ పుడతాడు.

ఈ విధిరాత లాంటి జనాభా సిద్ధాంతాన్ని కొందరు 1943 నాటి బెంగాల్ కరువుకు అన్వయిస్తుంటారు. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే– బెంగాల్ ప్రజలు ఆ ఏడాది ధాన్యం పండక చనిపోలేదు. పండిన ధాన్యాన్ని వలస ప్రభువులు రెండవ ప్రపంచ యుద్ధం కోసం యూరోప్‌కు తరలించడంతో, పౌరసరఫరాలు స్తంభించి, ఆహారం అందక చనిపోయారు.

ఈ భూమి మీద స్వర్గం అంటూ వుంటే అది భారత ఉపఖండమే. మనకు రాత్రీ పగలు సమానంగా చెరో 12 గంటలు, మూడు కాలాలూ సమానంగా చెరో నాలుగు నెలలు, సారవంతమైన భూములు, కావలసినంత నదీజలాలు. మన దేశంలో ఒక్క వరిలోనే అక్షరాలా లక్ష రకాల వంగడాలు ఉన్నాయని అంచనా. ఇలాంటి దేశం మరో చోట కనిపించదు. లోపం మన ప్రకృతిలో లేదు; ప్రభుత్వాల నిర్వహణలో ఉంది.

1840ల చివర్లో ఉత్తర భారతదేశ ప్రజల్లో వలస పాలన మీద తీవ్ర అశాంతి నెలకొంది. ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైన్యాన్ని అక్కడ మోహరించింది. దాదాపు అదే సమయంలో కృష్ణా, గోదావరి మండలాల్లోనూ కరువు, ఉప్పెనలు వచ్చాయి. దక్షిణాదిలో చెలరేగబోయే అంశాతిని మొగ్గలోనే అణచివేయడానికి కంపెనీ గవర్నర్ జనరల్ కొందరు సైనికాధికారుల్ని అక్కడికి పంపించాడు. ఆ బృందంలో వాడే కెప్టెన్ ఆర్థర్ కాటన్.

అశాంతిని ఆయుధాలతో కాకుండా ఆహారంతో చల్లార్చాలనుకున్నాడు ఆర్థర్ కాటన్. గోదావరి నది మీద ఓ మూడు నాలుగు అడుగుల చిన్న ఆనకట్ట కడితే జనం ఆహారం పండించుకుని ప్రశాంతంగా బతికేస్తారని, ఆపైన ప్రత్తి కూడ పండిస్తే మాంచెస్టరు బట్టల మిల్లులకు కావలసినంత ముడిసరుకు చవగ్గా లభిస్తుందని భావించాడు. బెజవాడ ఆనకట్టను రూపొందించింది కూడ కాటనే.

ఇప్పటి మధ్య ఆంధ్రా ప్రాంతంలో అలా కొత్తగా ఒక ‘కాలువల సంతతి’ పుట్టింది. ఒకనాటి ‘కరువు ప్రాంతం’ ఆనకట్ట కట్టిన 50ఏళ్లలో ఏకంగా బియ్యం ఎగుమతి కేంద్రంగా మారిపోయింది. గోదావరి డెల్టాలోని గ్రామాల్లో గుర్రం ఎక్కిన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వుంటుంది. ఆయనకు ఇళ్ళల్లో పూజలు చేస్తారు, పూర్వీకులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారు. ‘నిత్యగోదావరీ స్నాన పుణ్య దోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ అంటూ శ్లోకాలు చదువుతారు.

స్వాతంత్ర్యానంతరం కూడ 1960లలో మళ్ళీ ఆహార కొరత వచ్చింది. వలస ప్రభువులు కట్టించిన రెండు మూడు ఆనకట్టలు, అప్పటికి మనం కట్టుకున్న నాగార్జునసాగర్, భాక్రా–నంగల్ వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులు దేశ అవసరాల మేరకు ఆహారోత్పత్తి చేయడానికి సరిపోలేదు. అమెరికా ‘పబ్లిక్ లా – 480’ (పిఎల్ – 480) పథకం కింద సహాయంగా పంపించే బియం, గోధుమలు, పాలపిండితో మనం కడుపు నింపుకోవాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది.

సరిగ్గా అప్పుడు ఒక అపద్బాంధవునిగా ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ ముందుకు వచ్చి అధికోత్పత్తి వంగడాల (HYV) సృష్టితో హరితవిప్లవాన్ని నడిపించాడు. ఇది భారత ఆహార రంగంలో పెను మార్పులు తెచ్చింది. ఓ ఇరవై ఏళ్ళు తిరక్కుండానే మనం అధికోత్పత్తితో పాటు అదనపు ఉత్పత్తినీ సాధించాం. పిఎల్ – 480 దగ్గర మొదలై ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోలేనంతగా విరగ పండించేంత వరకు ఇదొక మహత్తర విప్లవం. దానితో స్వామినాథన్ పేరు అభినవ అన్నదాతగా దేశమంతా మారుమోగిపోయింది.

అమెరికా మనకు పిఎల్ – 480 సహాయాన్ని అందిస్తున్న కాలంలోనే ఆ దేశంలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షులుగా వున్న కాలంలో అమెరికా వ్యవసాయశాఖ సెక్రటరీగా ఎర్ల్ బట్జ్ అని ఒకడుండేవాడు. నిజానికి అతను రక్షణ మంత్రిగా వుండాల్సినవాడు. ‘ఆహారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించే అవకాశమే వుంటే ఆనందంగా ప్రయోగిస్తాం’ అంటుండేవాడు.

అప్పట్లో అమెరికాకు బియ్యంతో అస్సలు పనిలేదు. కానీ, బియ్యమే ప్రధాన ఆహారంగా బతికే ఆసియా ఖండపు ఆర్థికరంగాన్ని నియంత్రించాలంటే వరి పంట మీద గుత్తాధిపత్యాన్ని సాధించాలని అమెరికా మెగా కార్పొరేట్లయిన హెన్రీ ఫోర్డ్, రాక్ ఫెల్లర్‌లకు స్ఫురించింది. ఆ రెండు సంస్థలు సంయుక్తంగా 1960లో ఫిలిప్పీన్స్‌లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IRRI)ను నెలకొల్పాయి. ఆసియాఖండపు వరి ఉత్పత్తిని, దాని మీద జరిగే పరిశోధనల్ని, సదరు శాస్త్రవేత్తల్ని నియంత్రించాలని వారొక విధాన పత్రమే రాసుకున్నారు. వరి, గోధుమల్ని ఎవరు పండించుకున్నా విత్తనాలు మొదలు ఎరువులు, పెస్టిసైడ్స్, ఇన్‍సెక్టిసైడ్స్, ట్రాక్టర్లు ఇతర యంత్ర పరికరాలన్నీ తమ దగ్గర కొనేలా చేసి ఆసియాలో ఒక సుస్థిర మార్కెట్‌ను నెలకొల్పాలని ఈ సంస్థ పాలసీగా పెట్టుకుంది. ఈ విధాన పత్రాన్ని స్వయంగా హెన్రీ ఫోర్డ్ రాసాడంటారు.


సైంటిస్టులు అంత సులువుగా లోబడతారా? అనే అనుమానం చాలామందికి వుంటుంది. ‘అప్పటివరకు భక్తి మర్యాదలతో గౌరవమిస్తున్న వృత్తులకు వుండే అందమైన తొడుగులన్నింటినీ బూర్జువావర్గం పీకిపడేసింది. వైద్యుడినీ, న్యాయమూర్తినీ, మతగురువునీ, కవినీ, శాస్త్రవేత్తనీ (the man of science) డబ్బు తీసుకుని తనకు ఊడిగం చేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది’ అంటాడు కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆసియా దేశాల్లో ఆ పని చేయడానికే పుట్టింది; ఆ పనే చేసింది. చాలా మంది సైంటిస్టుల్ని ఆకర్షణీయమైన ప్యాకేజీలిచ్చి కొనిపడేసింది.

1980ల ఆరంభంలో హరిత విప్లవ ఫలితాల మీద కొన్ని అనుమానాలు పొడచూపాయి. ఆహారోత్పత్తి భారీగా పెరిగిందిగానీ, వ్యవసాయ రంగంలో ఇన్‌పుట్ కాస్ట్ కూడా భరించలేనంతగా పెరిగింది. రైతులకన్నా ఇన్‌పుట్స్ ఉత్పత్తిదారులకు ఎక్కువ మేలు జరిగింది. దీని వెనుక హెన్రీ ఫోర్డ్, రాక్ ఫెల్లర్ల కుట్ర వుందనే మాట కూడ వెలుగులోనికి వచ్చింది. మరో వైపు, క్లాడ్ ఆల్వరెస్ (Claude Alvares) వంటి పర్యావరణవేత్తలు హరిత విప్లవం దుష్ఫలితాలను గురించి విమర్శలు సంధించడం మొదలెట్టారు. మన సైంటిస్టులు ఇక్కడి సహజ వరి వంగడాల జెర్మ్ ప్లాజంను (germplasm) సేకరించి IRRIకి అందించారనేది ఈ సందర్భంగా ప్రధానంగా వినిపించిన ఆరోపణ.

సరిగ్గా ఈ సమయంలోనే, స్వామినాథన్ పిలిప్పీన్స్‌కు వెళ్ళి 1982–88 మధ్య కాలంలో ఇర్రీ డైరెక్టర్ జనరల్ పదవిని స్వీకరించారు. దానితో ఆయన విమర్శకుల ఆరోపణలకు ఒక బలం చేకూరింది.

IRRIలో పదవీ విరమణ చేసి పిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన స్వామినాథన్ సతత హరిత విప్లవం అమృతాన్నే గాక హాలాహలాన్ని కూడ ఇచ్చిందని గమనించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయనీ, తాను ఊహించని కొన్ని కొత్త రోగాలు కూడ విజృంభించి ఫార్మా కంపెనీల పంట పండిస్తున్నాయనీ అర్థం అయింది.

అటల్ బిహారీ వాజ్‍పాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో రైతుల ఆత్మహత్యలు ఒక పరంపరగా సాగాయి. కేవలం 2004లోనే 18,241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారికంగా నమోదయింది. ఆ తరువాత అధికారాన్ని చేపట్టిన మన్మోహన్ సింగ్ – సోనియాగాంధీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేందుకు ‘ద నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ (NCF)ను నెలకొల్పింది. 2004 నవంబరు 18న ఆ సంస్థకు ఎంఎస్ స్వామినాథన్‌ను చైర్మన్‌గా నియమించింది.

ఎన్‌సిఎఫ్ ఛైర్మన్‌గా ఆయన ప్రభుత్వానికి పది సూచనలు చేశారు. వ్యవసాయోత్పత్తులకు సాగుబడికి అయ్యే ఖర్చుతోపాటూ రైతుకు 30 శాతం లాభం మిగిలేలా కనీస మద్దతు ధరను నిర్ణయించాలనీ, ఏక పంట విధానాన్ని వదిలి బహుళ పంటల విధానాలను అనుసరించాలనీ, నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడమేగాక, నీటి యాజమాన్య నాణ్యతను పెంచాలనేవి ఇందులో ముఖ్యమైనవి.

అయితే, స్వామినాథన్ సిఫార్సుల్ని ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సంకర విత్తనాలు, రసాయన ఎరువులు, ఇనార్గానిక్ క్రిమిసంహారక మందులకు మార్కెట్ సృష్టించే సైంటిస్టు స్వామినాథన్ కార్పొరేట్లకు కావాలిగానీ రైతుల పక్షాన నిలిచే స్వామినాథన్ వారికెందుకూ? ఆయన జీవితంలో IRRIఅధ్యాయం లేకుంటే మన దేశంలో ఆర్థర్ కాటన్‌లా ప్రతి ఇంట్లోనూ స్వామినాథన్ ఫొటోలు వెలసి ఉండేవి.

డానీ

సీనియర్జర్నలిస్టు

Updated Date - 2023-10-11T03:29:12+05:30 IST