Share News

పొరుగు ప్రళయం

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:16 AM

ప్రకృతి విపత్తుల ప్రియధాత్రి మయన్మార్‌! సుస్థిర ప్రజాస్వామ్య పాలనకు నోచుకోలేకపోతున్న దురదృష్ట దేశమది. ఈ రెండు వాస్తవాలూ, మయన్మార్‌ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితికి నిలువెత్తు దర్పణాలు....

పొరుగు ప్రళయం

ప్రకృతి విపత్తుల ప్రియధాత్రి మయన్మార్‌! సుస్థిర ప్రజాస్వామ్య పాలనకు నోచుకోలేకపోతున్న దురదృష్ట దేశమది. ఈ రెండు వాస్తవాలూ, మయన్మార్‌ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితికి నిలువెత్తు దర్పణాలు.

గత వందేళ్లలో మయన్మార్‌ 14 భూకంపాలను చవి చూసింది. వాటిలో కొన్ని గత శుక్రవారం నాటి భూ ప్రళయం లాంటివే. మయన్మార్‌ భౌగోళిక ఉనికి, భూభౌతిక వ్యవస్థ ఆ దేశాన్ని తరచు భూకంపాల తాకిడికి గురిచేస్తుంది. మార్చి 28 నాటి మహా ఉత్పాతం 1956 అనంతరం మయన్మార్‌ను కుదేలు చేసిన భూ కంపాలలో తీవ్రమైనది. భూమాత ఆగ్రహం వందలాది ప్రజల ప్రాణాలను హరించి వేసింది, భౌతిక ఆస్తులను, చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసింది. ఆధ్యాత్మిక సంస్కృతికీ తీవ్ర విఘాతం కలిగించింది. భూకంప కేంద్రానికి చేరువలో ఉన్న మాండలే నగరంలో ప్రతి రెండో గృహమూ కూలిపోవడమో లేక తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 పాయింట్ల తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం పొరుగుదేశం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ను కూడా కుదిపివేసింది.


అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతూ రెండు కోట్ల మంది ప్రజలు దైనందిన మనుగడకు అంతర్జాతీయ మానవతాపూరిత సహాయ చర్యలపై ఆధారపడి ఉన్న క్లిష్ట సమయంలో మయన్మార్‌ ఈ పెను భూకంపానికి గురయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని నాలుగేళ్ల క్రితం కూల్చివేసి అధికారాన్ని కైవసం చేసుకున్న సైనికాధికారుల దుర్మార్గ పాలనతో మయన్మార్‌ ఎడతెగని సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సైనిక పాలకులను సాయుధంగా వ్యతిరేకిస్తున్న ప్రజాస్వామ్య శక్తుల అధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక పాలకులు నిరంతర యుద్ధం చేస్తున్నారు. గత శుక్రవారం నాడు భూ ప్రళయం సంభవించిన మూడు గంటల వ్యవధిలోనే ప్రతిఘటనా శక్తుల నియంత్రణలోని ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించారు. ఆ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగేళ్లుగా సైనిక పాలకుల చేతుల్లో హతమయి సమాధుల్లో ఉన్న వారి ఎముకలు సైతం సైనిక పాలకుల ఈ ప్రస్తుత దుర్మార్గానికి వణికిపోతున్నాయని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.


తొలుత కోవిడ్‌ విలయం, ఆ వెన్వెంటనే అంతర్యుద్ధం ప్రారంభమవడంతో మయన్మార్‌లో ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంతో కునారిల్లుతున్నారు. దాదాపు నలభై లక్షల మంది అంతర్గత నిర్వాసితులుగా బతుకులు ఈడుస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మయన్మార్‌ మరో భూ ప్రళయంతో మాటల్లో వర్ణించలేని దురవస్థల పాలయింది. 1948లో స్వాతంత్ర్యం పొందిన తరువాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న సైనిక పాలకులు బయటి ప్రపంచంతో సంబంధాలను నిరాకరించే విచిత్ర వ్యక్తులు. 2008లో కనీసం లక్షన్నర మందిని బలిగొన్న పెను తుపాను సంభవించిన ఆపత్సమయంలో కూడా అంతర్జాతీయ సహాయాన్ని నిరాకరించిన జడబుద్ధులు. అయితే ఈసారి ప్రళయం సంభవించిన వెంటనే అంతర్జాతీయ సహాయాన్ని అంగీకరిస్తామని సైనిక పాలకుడు మిన్‌ అంగ్‌ హ్లాయింగ్‌ ప్రకటించాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా, మరెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో మయన్మార్‌లో యుఎస్‌ ఎయిడ్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మయన్మార్‌లో భూకంపం సంభవించిన రోజునే యుఎస్‌ ఎయిడ్‌ సంస్థలో ఉద్యోగులు అందరినీ తొలగించనున్నట్టు , ప్రపంచ వ్యాప్తంగా ఆ సహాయ సంస్థ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌కు చెప్పింది. 2024లో యుఎస్‌ ఎయిడ్‌ మయన్మార్‌లో సహాయ సేవలకు 240 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఆ దురదృష్టకర దేశవాసులకు అందించిన మొత్తం మానవతాపూరిత సహాయంలో మూడోవంతుగా ఉన్నది. అయితే గత జనవరి 20న రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మయన్మార్‌లో యుఎస్‌ ఎయిడ్‌ సహాయ కార్యక్రమాలు 18 నుంచి 3కు తగ్గిపోయాయి. కొన్ని దేశాల దిగుమతులపై సుంకాల విధింపును నెలరోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్‌ ప్రభుత్వం మయన్మార్‌లోని మానవతా సంక్షోభం దృష్ట్యా కనీసం కొన్ని నెలల పాటు అయినా ఆ దేశంలో తమ సహాయ కార్యక్రమాలను పునరుద్ధరించి ఎందుకు కొనసాగించకూడదు? వాతావరణ మార్పు యుగంలో సంభవిస్తున్న ప్రాకృతిక విపత్తులు మన నైతిక వివేకానికి సవాళ్లు విసరడం లేదూ?


సమీప, సుదూర దేశాలలో ఎక్కడైనా ప్రాకృతిక విపత్తులు సంభవించినా అత్యవసర సహాయాన్ని అందించడంలో ముందుండే భారత్‌ ఇప్పుడు మయన్మార్‌ విషయంలోనూ అంతే జరూరుగా ప్రతిస్పందించింది. వసుధైవ కుటుంబకం అన్న భారతీయ నాగరికతా ఆదర్శాన్ని ఔదలదాల్చిన న్యూఢిల్లీ ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ పేరిట భారీ ఎత్తున సహాయ కార్యకలాపాలకు పూనుకున్నది. ఇప్పుడు మయన్మార్ కష్టాల్లోనూ అదే విధంగా వ్యవహరిస్తూ మరింత సమున్నత బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యత న్యూఢిల్లీపై ఉన్నది. మయన్మార్‌లో సుస్థిర ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణకు పూనుకోవడమే ఆ కర్తవ్యం. దూరాలు కరిగిపోయి, వాస్తవ కాలాలు ఏకమైపోతున్న ప్రస్తుత యుగంలో ఆపత్సమయాలలోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం ఇరుగు పొరుగు దేశాలలోని ప్రజల బాగోగుల విషయమై శ్రద్ధ చూపడం ‘విశ్వగురు’గా ప్రభవించేందుకు ఆరాటపడుతున్న భారత్‌ విధ్యుక్త ధర్మం కాదూ?

ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 02:16 AM