Exam Special: జీ-20 (2023)-ఇండియా విశిష్టత గురించి..!

ABN , First Publish Date - 2023-09-18T10:21:51+05:30 IST

‘గ్రూప్‌ ఆఫ్‌ 20(జీ-20)’ 18వ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారత్‌ తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులు న్యూఢిల్లీలోని ‘భారత మండపం’- ఇంటర్నేషనల్‌

Exam Special: జీ-20 (2023)-ఇండియా విశిష్టత గురించి..!

‘గ్రూప్‌ ఆఫ్‌ 20(జీ-20)’ 18వ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారత్‌ తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులు న్యూఢిల్లీలోని ‘భారత మండపం’- ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ - కన్వెన్షన్‌ సెంటర్‌(ప్రగతి మైదాన్‌) వేదికైంది. ఈ నేపథ్యంలో అసలు జీ-20 అంటే ఏమిటి, దాని సభ్య దేశాలేవి, కూటమి పుట్టుపూర్వోత్తరాలు, ప్రాముఖ్యం వంటి వాటితోపాటు, భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన 2023 సదస్సు ముఖ్యాంశాలను పరిశీలిద్దాం...

జీ-20 అంటే

జీ-20 అనగా ‘గ్రూప్‌ ఆఫ్‌ 20’ అని అర్థం. దీనిలో 19 దేశాలకు తోడు మరొకటి చేర్చుకోగా(19+1) సభ్యులుగా ఉన్నట్లయింది.

సభ్యదేశాలు: 1) భారత్‌ 2) అమెరికా 3) ఆస్ర్టేలియా 4) ఇండోనేషియా 5) అర్జెంటీనా 6) బ్రెజిల్‌ 7) కెనడా 8) చైనా 9) ఫ్రాన్స్‌ 10) జర్మనీ 11) ఇటలీ 12) జపాన్‌ 13) మెక్సికో 14) రష్యా 15) దక్షిణకొరియా 16) సౌదీ అరేబియా 17) దక్షిణాఫ్రికా 18) టర్కీ 19) బ్రిటన్‌

సభ్య కూటమి: యురోపియన్‌ యూనియన్‌(ప్రస్తుత సదస్సులో ఆఫ్రికా యూనియన్‌ కూడా సభ్యత్వం పొందడంతో జీ-20 కూటమి (19+2) గా మారింది)

పుట్టుపూర్వోత్తరాలు

1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తరవాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. తరవాత క్రమేపి ఏకధ్రువ ప్రపంచం వైపు ప్రపంచ రాజకీయాలు మళ్లాయి. అమెరికా దాని మిత్రపక్షాల ఆధిపత్యంలోకి ప్రపంచ సంస్థలైన ఐక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్యసంస్థ వంటివి క్రమంగా వెళ్లిపోయాయి. ఈ పరిణామం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ వ్యవహారాలపరంగా చాలా సవాళ్లను ముందుంచింది. దీనికితోడు 1997 ప్రాంతంలో ఏషియన్‌ టైగర్స్‌ క్రైసిస్‌ ఆగ్నేయాసియా దేశాల్లో(సింగపూర్‌, ఇండోనేషియా, మలేషియా) ఉత్పన్నమై లాటిన్‌ అమెరికా వరకూ ఆర్థిక సంక్షోభాన్ని విస్తరించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకుగానూ 1998లో జీ-20 కూటమి ఏర్పడింది. అది అధికారికంగా 1999లో జీ-20గా రూపుదిద్దుకుంది. అయితే 2008 వరకూ ఈ కూటమికి ప్రపంచవ్యాప్తంగా పెద్దగా గుర్తింపు రాలేదు. అంతేకాక కూటమి సభ్యదేశాల అధ్యక్షుడు కూడా సమావేశాలకు హాజరయ్యేవారు కాదు. కేవలం ఆర్థికమంత్రులు, అధికారులే సదస్సులకు హాజరవుతూ ఒక ఆర్థిక ఫోరంలాగా దీనిని ముందుకు తీసుకెళ్లారు.

అయితే 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థికమాంధ్యం అమెరికాలో సబ్‌ ప్రైమ్‌ లెండింగ్‌ క్రైసి్‌సగా మొదలై అమెరికా ఆర్థికవ్యవస్థతోపాటుగా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. ఈ నేపథ్యంలో తమ ఆర్థికవ్యవస్థలను పటిష్టం చేసుకోవడానికి జీ-20ని ఒక వేదికగా సభ్యదేశాలన్నీ భావించి క్రమంగా దేశ నాయకులు సైతం హాజరవడం మొదలైంది.

ప్రాముఖ్యం

ఈ జీ-20 కూటమిలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలైన జీ-7 దేశాలన్నీ సభ్యులుగా ఉన్నాయి. వీటితోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేషియా, సౌతాఫ్రికా వంటి దేశాలు కూడా సభ్యులుగా ఉన్నాయి. అంతేకాక పెట్టుబడుల కోసం, ఖనిజ వనరుల కోసం విస్తారమైన మార్కెట్‌ కోసం ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షిస్తున్న ఆఫ్రికా ఖండానికి చెందిన 55 దేశాల కూటమి అయిన ‘ఆఫ్రికా యూనియన్‌’ సైతం ప్రస్తుత సదస్సులో సభ్యదేశంగా చేరింది. దీనితో ఈ జీ-20 ప్రాముఖ్యం మరింత పెరిగింది. ఇప్పటికే ఈ కూటమి ప్రపంచ జీడీపీలో 85% వాటాను, ప్రపంచ వాణిజ్యంలో 75ు వాటాను, ప్రపంచ జనాభాలో 2/3వ వంతు వాటాను, ప్రపంచ మార్కెట్‌లో 2/3వ వంతు వాటాను కలిగి ఉంది.

సంస్థాగత నిర్మితి

ప్రాథమికంగా ఇది ఒక ఎకనామిక్‌ ఫోరం(ఆర్థిక కూటమి). అంతర్జాతీయంగా ఆర్థిక సుస్థిరత, సుస్థిరాభివృద్ధి, ఆర్థిక నియంత్రణలు, ప్రపంచ ఆర్థిక సంవిధాన పద్ధతులు ఏర్పాటు కోసం ఈ కూటమిని ఏర్పాటుచేశారు. అయితే ఇది ఒక అనధికారిక సంస్థ. ఎటువంటి చట్టబద్ధ సంస్థాగత ఏర్పాటు, ప్రధాన కార్యాలయం, సిబ్బంది కానీ దీనికి లేవు. కేవలం సభ్యుల మధ్య ఉన్న అవగాహన ఒప్పందమే దీనికి ప్రాతిపదిక. జీ-20 నిర్ణయాలను అమలు చేయడానికి ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థ ఉండదు. దాని సభ్యుల మధ్య జరిగిన ఒప్పందాలు, ఈ సదస్సులో ఆహ్వానితులైన అంతర్జాతీయ సంస్థలు, రీజినల్‌ ఆర్గనైజేషన్స్‌ వంటివాటితో జీ-20 సభ్యదేశాలు చేసుకున్న ఒప్పందాల ద్వారానే జీ-20 నిర్ణయాలు/ ఎజెండా కార్యరూపం దాల్చుతాయి. అంటే ఒకరకంగా నిర్ణయాల అమలు బాధ్యత కూటమి దేశాలపై ఒప్పందాలు చేసుకున్న సంస్థలపై ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?

జీ-20 ఏటా ఒక సభ్యదేశంలో సమావేశాలు జరుపుతుంది. ఆ సంవత్సరపు ఆతిథ్య దేశంలో ఏడాది పొడవునా దాదాపు 200లకు పైగా వివిధ అంశాలపై సమావేశాలు జరుగుతాయి. అన్ని సభ్యదేశాల నుంచి మంత్రులు, అధికారులు వీటిలో పాలుపంచుకుంటారు. చివరిగా జరిగే శిఖరాగ్ర సమావేశంలో సభ్యదేశాల, ఆహ్వానిత దేశాల/సంస్థల నాయకులు పాల్గొని చర్చలు జరిపి సదస్సు ఎజెండా/ డిక్లరేషన్‌లను ఆమోదిస్తారు.

జీ-20 కార్యనిర్వహణా కార్యక్రమం మొత్తం మూడు ట్రాక్‌లుగా పనిచేస్తుంది. అవి-

1. ఫైనాన్స్‌ ట్రాక్‌(ఆర్థికపరమైనది) 2. షెర్పా ట్రాక్‌(మార్గనిర్దేశిక సహాయం) 3. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ట్రాక్‌(సామాజిక వ్యవస్థలు)

  • ఫైనాన్స్‌ ట్రాక్‌, షెర్పా ట్రాక్‌ రెండూ అధికారిక ట్రాక్స్‌. కాగా, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ట్రాక్‌ మాత్రం అనధికారిక ట్రాక్‌.

  • ఫైనాన్స్‌ ట్రాక్‌లో ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్స్‌ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులు తరచూ, అంటే కనీసం ఏడాదిలో నాలుగుసార్లైనా సమావేశమై ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమ్మిళితత్వం, అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక-పన్నులపరమైన సమస్యలు, ద్రవ్య విధానాలు, ఆర్థిక విధానాలు, ఆర్థికపరమైన నియంత్రణలు ఎలా ఏర్పర్చుకోవాలి వంటి అనేక ఆర్థికపరమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి గానూ ఈ ట్రాక్‌లో ఎనిమిది వర్కింగ్‌ గ్రూప్‌లు పనిచేస్తుంటాయి.

  • షెర్పా ట్రాక్‌ కూడా మరో ముఖ్యమైన అధికారిక ట్రాక్‌. దీనిలో 13 వర్కింగ్‌ గ్రూప్‌లు ఉన్నాయి. షెర్పా అనేది ఒక నేపాలీ పదం. పర్వతారోహకులకు మార్గనిర్దేశం, సహాయం చేసేవారిని షెర్పా అంటారు. జీ-20 దేశాధినేతల ప్రతినిధులుగా ఎజెండా రూపకల్పనలో పాలుపంచుకునే వారిని షెర్పా ట్రాక్‌గా వ్యవహరిస్తున్నారు.

  • షెర్పా ట్రాక్‌ తమ దేశాధినేతలతో సమన్వయం చేసుకుంటూ, వారి ప్రతినిధులుగా ఎజెండా రూపకల్పన చేస్తారు. జీ-20లో వీరిది చాలా కీలకపాత్ర. తమ దేశ సామాజిక, ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యం దక్కేలా చూసుకోవడంతోపాటు జీ-20 ప్రాధాన్యాంశాలైన వ్యవసాయం, అవినీతి నిరోధం, వాతావరణ మార్పు, డిజిటల్‌ ఎకానమీ, విద్య, ఉద్యోగం, ఎనర్జీ, పర్యావరణం, ఆరోగ్యం, పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు మొదలైన అనేక అంశాలపై 13 వర్కింగ్‌ గ్రూపులుగా విభజితమై విధానాల రూపకల్పన చేస్తారు.

  • కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ట్రాక్‌ అనేది ఒక అనధికార ట్రాక్‌. దీనిలో అనేక సామాజిక, సాంస్కృతిక సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వంటి అనేక ఇతరత్రా గ్రూపులు ఉంటాయి. వీరు పరోక్షంగా విధాన నిర్ణయాలపై ప్రభావం చూపుతుంటారు. మొత్తంగా 11 కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ గ్రూపులు ఉన్నాయి.

భారత్‌ ఆహ్వానిత దేశాలు/ సంస్థలు, వ్యూహాత్మక చర్యలు

జీ-20 సదస్సుకు ఆతిథ్య దేశంగా భారత్‌కు కొన్ని ప్రత్యేక సౌలభ్యతలు లభించాయి. భారత్‌ కొన్ని దేశాలను, సంస్థలను సదస్సుకు ఆహ్వానించడంతోపాటు సదస్సు ఽథీమ్‌ను, లోగోను నిర్ణయించడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. దీనిలో భాగంగా భారతదేశం వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, మారిషస్‌, నెదర్లాండ్‌, నైజీరియా, ఒమన్‌, సింగపూర్‌, స్పెయిన్‌, యూఏఈ వంటి దేశాలను; ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌(ఐఎ్‌సఏ), ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ), కొయిలేషన్‌ ఫర్‌ డిజార్డర్‌ సైలియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(డీడీఆర్‌ఐ) వంటి సంస్థలనూ ఈసారి అతిఽథులుగా పిలిచింది. వీటితోపాటు ఈ సదస్సుకు ఎప్పుడూ హాజరయ్యే ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ప్రపంచ కార్మికసంస్థ, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ డెవల్‌పమెంట్‌ వంటి సంస్థలనూ ఆహ్వానించింది. ఇవే కాకుండా కొన్ని రీజినల్‌ ఆర్గనైజేషన్స్‌(ప్రాంతీయ కూటములు) అయిన ఆఫ్రికన్‌ యూనియన్‌, ఆఫ్రికన్‌ యూనియన్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ, న్యూ పార్టనర్‌షిప్‌ ఫర్‌ ఆఫ్రికా డెవల్‌పమెంట్‌, ఏషియన్‌ గ్రూపులనూ ఆహ్వానించింది. ఈ సదస్సులో భారతదేశం ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం ఇప్పించేందుకుగానూ తీవ్రంగా కృషి చేసింది. దీనితో ఆఫ్రికా యూనియన్‌తో వ్యూహాత్మక సంబంధాలు మరింత దృఢపర్చుకొనే ప్రయత్నం భారత్‌ చేస్తోంది. భారత్‌ ఇప్పటికే ఆఫ్రికాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, పెట్టుబడులపరంగా ఏడో అతిపెద్ద భాగస్వామి. అంతేకాక ఇతరత్రా అనేక సహాయ సహకారాలు ఆఫ్రికాకు అందిస్తూ మంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొంటూ ఆఫ్రికాఖండంలో చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది.

జీ-20 థీమ్‌, లోగో, అజెండా

థీమ్‌: వసుదైక కుటుంబం’(వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌) ఈ సంస్కృత పదాన్ని ‘మహా ఉపనిషత్‌’ నుంచి తీసుకున్నారు. భూమిపై జీవించే సకల జీవరాశుల మధ్య పరస్పర ఆధార జీవనాన్ని, విశ్వజనీన సయోధ్యతను ఇది సూచిస్తుంది.

అంతేకాక ఈసారి జీ-20 థీమ్‌లో లైఫ్‌(జీవనం)/స్టయిల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ‘ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ రెస్పాన్సిబుల్‌ చాయిసెస్‌’ అనే అంశాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు.

లోగో: భారత జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగులు ఈ లోగోలో ఉన్నాయి. కమలంలోని ఏడు రేకులు, ఏడు ఖండాలకు ప్రతీకలు. ఈవిధంగా అన్ని ఖండాలను వసుదైక కుటుంబంగా లోగోలో చూపారు. బురదలో సైతం వికసించే తామరపువ్వులో భూమినిచూపుతూ, కష్టాల్లో సైతం ఆశావాద దృక్పధంతో ఉండాలని ప్రపంచ మానవాళికి సందేశమిచ్చారు.

అజెండా ప్రధానాంశాలు

A - Geen Development, Climate Finance of life

B - Accelerated inclusive & Resilient growth

C - Accelerating progress on SDG's

D - Technological Transformation & Digital Public Infrastructure.

E - Multilateral Institutions for the 21st Century

F - Women - led development

జీ-20 సదస్సు నిర్ణయాలు

1. జీ-20లో శాశ్వత సభ్యదేశంగా ఆఫ్రికా యూనియన్‌ చేరిక.

2. జీవ ఇంధనాల అభివృద్ధికి, ప్రోత్సాహానికి, వాటి ప్రమాణాల నిర్ణయం, గుర్తింపులకు సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థ ‘గ్లోబల్‌ బయో ఫ్యుయల్‌ అలయన్స్‌(జీబీఏ)’ ఏర్పాటు. 3. సభ్యదేశాల సమ్మతితో ‘న్యూఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌’ ఏకగ్రీవ ఆమోదం.

4. భారత్‌-మధ్యప్రాశ్చ్య-యూరప్‌ దేశాలను కలుపుతూ ఒక షిప్పింగ్‌, రైల్‌ కారిడార్‌ను సభ్యదేశాలన్నీ కలిసి ‘ఇండియా - మిడిల్‌ ఈస్ట్‌ - యూరోప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’గా ఏర్పాటు చేయడానికి అంగీకరించడం.

5. గత సదస్సు వలే కాకుండా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఎటువంటి అంశమూ సదస్సు తీర్మానంలో నేరుగా చేర్చకుండా సంయమనం సాధించడం.

న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ముఖ్యాంశాలు

ఆతిథ్య దేశంగా భారత్‌ రూపొందించిన జీ-20 సదస్సు డిక్లరేషన్‌

(ఢిల్లీ డిక్లరేషన్‌), సభ్య దేశాలందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం అనేది భారత దౌత్య పటిమకు మచ్చుతునకగా అభివర్ణించవచ్చు.

డిక్లరేషన్‌ నినాదం: ‘మనందరిదీ ఒకటే భూగోళం, ఒకటే కుటుంబం, ఒకే భవిష్యత్తులో భాగస్వామ్యం’.

డిక్లరేషన్‌లో ఏముంది?

2030 నాటికి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రపంచ సమాజపు వైఫల్యాలను డిక్లరేషన్‌ ప్రవేశిక ప్రస్తావించింది. ఈ డిక్లరేషన్‌ ‘దృఢమైన, సుస్థిర, సంతులిత, సమ్మిళితాభివృద్ధిని’ కాంక్షిస్తూ...

1. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం గురించి పరోక్ష ప్రస్తావన: గత బాలీ సదస్సు తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం గురించి తీవ్ర పదజాలంతో రష్యా చర్యలను ఖండించడంతో డిక్లరేషన్‌కు రష్యా, చైనా ఆమోదం లభించడం చాలా కష్టమైంది. కానీ, ప్రస్తుత ఢిల్లీ డిక్లరేషన్‌లో ఎంతో చాకచక్యంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రపంచ శాంతిని ఆపేక్షిస్తూ ఏడు కొత్త పంక్తులను చేర్చారు. వీటి ప్రకారం ‘ప్రతీ దేశం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ప్రకారం నడుచుకోవాలి, ఏ దేశ భౌగోళిక సమగ్రతకూ, సార్వభౌమాధికారానికి, రాజకీయ అధికారానికి భంగం కలిగించే రీతిలో భౌగోళిక ప్రదేశాలను ఆక్రమించరాదు, అణ్వాయుధ ప్రయోగ బెదిరింపులు లేదా ప్రయోగాలు ఏ దేశమూ చేయరాదు’ అని స్పష్టంగా పేర్కొన్నారు. తద్వారా చైనా, రష్యాలను అన్యాపదేశంగా హెచ్చరిస్తూనే అందరికీ వర్తించేలా ప్రకటించి అత్యున్నత దౌత్యనీతితో అందరి ఆమోదం పొందగలిగింది.

2. ఆహార, భద్రత, సప్లయ్‌ మార్గాలు: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన ఆహార సంక్షోభం, నల్ల సముద్రపు ఆహార మార్గం, ఇంధనాలు, ఎరువులు వంటి వాటి సప్లయ్‌ చెయిన్స్‌లో కలిగిన అంతరాయం గురించి ప్రస్తావిస్తూ మానవతా కోణంలో ఇటువంటి వాటికి అంతరాయం కలగకుండా చూడాలని నిర్ణయించారు.

3. టెర్రరిజం: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాలి.

4. డిజిటల్‌ సాంకేతికతను ప్రోత్సహించడం: డిజిటల్‌ సాంకేతిక రంగంలో

పరస్పర సహకారానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు టెక్నాలజీ బదలాయింపునకు సంబంధించి ‘వన్‌ ఫ్యూచర్‌ అలయన్స్‌’ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

5. వాతావరణ మార్పులు: వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. వర్ధమాన దేశాలు వాతావరణ మార్పులను అరికట్టడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతికపరమైన సహకారాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అందించాలి అంటూ ‘కామన్‌ బట్‌ డిఫరెన్షియేటెడ్‌ రెస్పాన్సిబులిటీస్‌’ ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

6. మల్టీ లేటరల్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకుల పాత్ర: ఐఎంఈ, వరల్డ్‌ బ్యాంక్‌ వంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువగా సహకరించాలని, పర్యావరణ అనుకూల కార్యకలాపాలకు చేయూత అందించాలని అభ్యర్థించారు.

7. సుస్థిరాభివృద్ధి, విపత్తు నిర్వహణ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కృషి అవసరం. విపత్తుల నిర్వహణ సంసిద్ధతను సైతం పెంపొందించుకోవాల్సి ఉందన్నారు.

8. దేశాలు దివాళా తీయడాన్ని నివారించాలి: శ్రీలంక వంటి అనేక దేశాలు ఇటీవల అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా తీస్తుండటంతో వాటికి సరైన పరిష్కారం అన్వేషించాలని, ఒక మెకానిజాన్ని ఏర్పాటుచేసి దివాళాలను నివారించాలని సభ్యదేశాలకు సూచించింది.

9. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్రిప్టో కరెన్సీ వంటి వాటికి నియంత్రణ విధానాలను ఏర్పాటు చేయాలని ఆశించారు.

10. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఆరోగ్యరంగ మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలి.

11. ప్రపంచవ్యాప్తంగా సులభతర వాణిజ్య విధానాలను పెంపొందించాలి. ఆంక్షలను సడలించాలి.

12. పన్ను ఎగవేతలను అరికట్టడానికి ‘బేస్‌ ఎరోజన్‌ ప్రాఫిట్‌ షిఫ్టింగ్‌(తక్కువ పన్నులు ఉన్న దేశాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడటం) వంటి చర్యలను అడ్డుకోవడానికి అంతర్జాతీయ సుస్థిర పన్ను విధానాలను తీసుకురావాలని ప్రతిపాదించారు.

13. నిర్ణయీకరణలో మహిళా భాగస్వామ్యం పెంచాలని, లింగ అసమానతలు తగ్గించాలని, వాతావరణ మార్పుల ప్రభావాలు స్త్రీలపై ఎక్కువగా పడుతున్నందున వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు.

-ఎం.బాలలత, సివిల్స్‌ మెంటార్‌

Updated Date - 2023-09-18T10:21:51+05:30 IST