Pakistan Terrorist: పాకిస్తాన్‌కి మరో షాక్.. ఆ రెండు ఉగ్రదాడుల సూత్రధారి హతం
ABN , First Publish Date - 2023-12-06T16:28:17+05:30 IST
ఈమధ్య విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా.. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని టార్గెట్ చేసుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వారిని హతమారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా లష్కరే తోయిబా...
Terrorist Hamza Adnan Killed: ఈమధ్య విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా.. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని టార్గెట్ చేసుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వారిని హతమారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడైన హంజా అద్నన్‌ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. డిసెంబరు 2వ తేదీ కరాచీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్నన్ ఇంటి బయట ఉన్నప్పుడు.. కొందరు వ్యక్తులు సడెన్‌గా వచ్చి, కాల్పులు జరిపి పారిపోయారు. కొన్ని బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో.. అద్నన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ఆర్మీ.. రహస్యంగా అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. చికిత్స పొందుతూ అద్నన్ ప్రాణాలు విడిచాడని పాక్ మీడియా కథనాలు తెలిపాయి.
ఇంతకీ ఈ హంజా అద్నన్ ఎవరంటే.. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపుర్‌లో, అలాగే 2016లో కశ్మీర్‌లోని పంపోర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రదారి. 2015లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక 2016లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అద్నన్ తన కార్యకలాపాలు సాగించేవాడని, భారత్‌లోకి ముష్కరులను పంపిస్తూ అతడు దాడులు చేయించాడని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌లోనే ఉండి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడటంతో.. అతడ్ని పట్టుకోవడానికి వీలు పడలేదు. అయితే.. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన కాల్పుల్లో అద్నన్ తుదిశ్వాస విడిచాడు. ఇతనితో పాటు ఇతర అనుచరులు, టాప్ కమాండర్లు హత్యలకు గురవుతున్న తరుణంలో.. పాక్‌లోని ఉగ్రమూకలకు భయం పట్టుకుంది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఉగ్ర సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లకు చెందిన వారే హత్యలకు గురవుతుండటంతో పాక్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఏ విధంగా టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంతర్గత విభేదాల కారణంగా వారికి దగ్గరగా ఉండే వ్యక్తులే ఈ హత్యలు చేస్తున్నారా? లేకపోతే స్థానిక ప్రత్యర్థుల హస్తం ఉందా? అనే కోణాల్ని పరిశీలిస్తున్నాయి. తమదే పైచేయి అవ్వాలన్న ఉద్దేశంతో ఇతర ఉగ్ర సంస్థలు కూడా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. ఆ ఉగ్రసంస్థల్లోని అనుచరులు, ఇతర ముఖ్య నేతలకు మాత్రం ఈ హత్యలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ భారత్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో 19 మంది ఇలా అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో మృతి చెందారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి