Amritpal Sing manhunt: అమృత్‌పాల్ ఫోటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు

ABN , First Publish Date - 2023-03-21T18:55:56+05:30 IST

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్...

Amritpal Sing manhunt: అమృత్‌పాల్ ఫోటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు

చండీగఢ్: చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ఆచూకీ కోసం పంజాబ్ పోలీసుల వేట ముమ్మరమైంది. ఇందులో భాగంగా అమృత్‌పాల్ ఫోటోలను కొన్నింటిని పోలీసులు విడుదల చేశారు. వివిధ దుస్తుల్లో అమృత్‌పాల్ ఉన్నప్పటి పాత, కొత్త ఫోటోలు ఇందులో ఉన్నాయి. ప్రజల సహకారాన్ని కోరుతూ ఈ ఫోటోలను విడుదల చేసినట్టు పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) ఎస్ఎస్ గిల్ తెలిపారు. ఈ ఫోటోలు ద్వారా ప్రజలు అతన్ని గుర్తించి తగిన సమాచారం అందించే విషయంలో పోలీసులకు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

కాగా, అమృత్‌పాల్‌ను మెహత్‌పూర్ వద్ద ఛేజ్ చేసినప్పుడు అతను కారులోనే దుస్తులు మార్చుకుని, ఆ తర్వాత కారును విడిచిపెట్టి మోటారు బైక్‌పై పరారైనట్టు పోలీసులు చెబుతున్నారు. అతను దుస్తులు మార్చుకుని మోటార్‌బైక్‌పై పరారు కావడానికి ముందు ఒక గురుద్వారాలో ఉన్నట్టు గుర్తించారు. అమృత్‌పాల్‌ తప్పించుకునేందుకు సహకరించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 'ఆనంద్‌ పూర్ ఖల్తా ఫౌజ్' అనే పేరుతో ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసేందుకు అమృత్‌పాల్ ప్రయత్నించాడని, ఆయన నివాసం గేటు వద్ద 'ఏకేఎఫ్' అనే రాతలు గుర్తించామని, ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, తుపాకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అమృత్‌పాల్‌ మేనమామ అసోంలోని డిబ్రూగఢ్‌లో పోలీసులకు లొంగిపోయాడు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో 'వారిస్ పంజాబ్ దే' వ్యవస్థాపకడు దీప్ సిద్ధూ చనిపోవడంతో అతని స్థానంలో అమృత్‌పాల్ పగ్గాలు చేపట్టేందుకు అతని మామ సహకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. పంజాబ్‌లో తిరిగి ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో నిధులు ఇచ్చిందని, ఇండియాలోకి అడుగుపెట్టే ముందు అతన్ని శిక్షణ కోసం జార్జియాకు పంపించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-03-21T19:01:38+05:30 IST