Parliament : పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా
ABN , First Publish Date - 2023-03-17T12:22:30+05:30 IST
పార్లమెంటు ఉభయ సభలు సోమవారం (మార్చి 20)నాటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం అధికార, విపక్షాలు పరస్పర డిమాండ్లతో లోక్‌సభ
న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు సోమవారం (మార్చి 20)నాటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం అధికార, విపక్షాలు పరస్పర డిమాండ్లతో లోక్‌సభ, రాజ్యసభలను హోరెత్తించాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.
సభ శుక్రవారం మొదటిసారి వాయిదాపడినపుడు ప్రతిపక్షాలు అదానీ వివాదంపై జేపీసీ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ, గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించాయి.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి (Congress MP Adhir Ranjan Chowdhury) మాట్లాడుతూ, బీజేపీ సభ్యులు అక్కడ, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకిగల 56 అంగుళాల ఛాతీ తగ్గిపోయిందన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి వీ మురళీధరన్ జాతీయ జూట్ బోర్డుకు ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు అనేక చర్యలను అమలు చేస్తున్నట్లు పార్లమెంటుకు తెలిపారు.
అదానీ వివాదంపై జేపీసీ దర్యాప్తును డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొనకపోవడాన్ని టీఎంసీ సమర్థించుకుంది. కాంగ్రెస్ తనకు నచ్చినపుడు మద్దతు కోరకూడదని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో 50 ఏళ్ళకు పైబడి విచారణలో ఉన్న కేసులేవీ లేవన్నారు.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ