Liquor policy case: విచారణ పేరుతో ఎక్కువకాలం జైళ్లలో ఉంచడం సరికాదు.. సుప్రీం ఆక్షేపణ
ABN , First Publish Date - 2023-12-08T16:40:06+05:30 IST
లిక్కర్ పాలసీ కేసులో దర్యాప్తు సంస్థల సుదీర్ఘ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ పేరుతో సుదీర్ఘ కాలం ఎవరినీ కటకటాల వెనుక ఉంచడం సరికాదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసు (Liquor policy case)లో దర్యాప్తు సంస్థల సుదీర్ఘ విచారణ తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ పేరుతో సుదీర్ఘ కాలం ఎవరినీ కటకటాల వెనుక ఉంచడం సరికాదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. పేరనోడ్ రికార్డ్ ఇండియా (Pernod Ricard India) సీనియర్ ఎగ్జిక్యూటివ్ బినయ్ బాబు (Benoy Babu)కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
''విచారణకు ముందు ఎక్కువకాలం ఎవరినీ మీరు జైలులో ఉంచరాదు. ఇది సరికాదు. ఇలా ఎందుకు జరుగుతోందో మాకు తెలియడం లేదు. సీబీఐ, ఈడీ చేస్తున్న ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి'' అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. బినయ్ బాబు ఇప్పటికే 13 నెలలు జైలులో ఉన్నారని జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో పలువురుని అరెస్టు చేయడం బీజేపీ, విపక్షాల మధ్య రాజకీయ వివాదం సృష్టించింది. ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అరెస్టులను తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా ఇద్దరు సీనియర్ ఆప్ నేతలను ఈ కేసులో అరెస్టు చేశారు. సిసోడియా గత ఫిబ్రవరి నుంచి జైలులోనే ఉండగా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అక్టోబర్ నుంచి జైలులో ఉన్నారు. గత అక్టోబర్‌లో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ ఉత్తర్వును పునఃసమీక్షించాలని కోరుతూ సిసోడియా గతవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఈడీ సుదీర్ఘ విచారణ జరిపి రెండు వారాల తర్వాత మార్చి 9న ఆయనను అరెస్టు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న సవరించిన లిక్కర్ ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాది లోపే లిక్కర్ పాలసీ అమలును రద్దు చేసింది. హోల్‌సేలర్ల మార్జిన్ లాభం అసాధారణ రీతిలో 5 నుంచి 12 శాతం పెంచేసినట్టు దర్యాప్తు సంస్థల అభియోగంగా ఉంది.