Telegram : టెలిగ్రామ్‌లో ప్రముఖుల డేటా!
ABN , First Publish Date - 2023-06-13T04:20:57+05:30 IST
కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటుచేసిన కొవిన్ పోర్టల్‌లోని సున్నితమైన సమాచారం లీకైందన్న వార్తలు కలకలం రేపాయి. ప్రముఖుల ఫోన్, ఆధార్, పాన్, పాస్‌పోర్టు నంబర్లతో కూడిన వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర దుమారం రేపింది.
ఫోన్, ఆధార్, పాన్, పాస్‌పోర్టు నంబర్లు ప్రత్యక్షం..
రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల వివరాలూ లీక్
● కొవిన్ పోర్టల్ నుంచే డేటా లీక్ అయినట్టు వార్తలు.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటుచేసిన కొవిన్ పోర్టల్‌లోని సున్నితమైన సమాచారం లీకైందన్న వార్తలు కలకలం రేపాయి. ప్రముఖుల ఫోన్, ఆధార్, పాన్, పాస్‌పోర్టు నంబర్లతో కూడిన వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర దుమారం రేపింది. ఇది కొవిన్ పోర్టల్ నుంచే లీకైందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వంపై మండిపడ్డాయి. ఇది నేరపూరిత నిర్ల్యమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. ఈ పోర్టల్ చాలా సురక్షితమని, అందులోని సమాచారం అత్యంత గోప్యంగా ఉందని స్పష్టం చేసింది. ‘‘కొవిన్ పోర్టల్ గోప్యత పరంగా పూర్తి సురక్షితం. ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే దీనిలోని సమాచారాన్ని చూడగలం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ఆధారం లేకుండానే డేటా లీక్ ప్రచారం జరిగిందని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఈఆర్‌టీ–ఇన్‌ను ఆ ప్రకటనలో ఆదేశించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో ఫోన్, ఆధార్ నంబర్లు నమోదు చేసిన వారికి టీకాలు అందించింది. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ నంబర్లతో కూడిన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌లో దర్శనిమిస్తోందని డేటా ఆధారిత న్యూస్ పోర్టల్ దక్షిణాసియా ఇండెక్స్ సోమవారం ఉదయం వరుస ట్వీట్లలో పేర్కొంది. కాగా, డేటా లీకేజీ మూలాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిసింది. కొవిన్ పోర్టల్ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారలా లేదంటే మరేదైనా అప్లికేషన్ ద్వారా దీన్ని సేకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
లీకైన డేటాలో ప్రముఖుల పేర్లు..
లీకైన డేటాలో రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ ఎంపీలు సుస్మితా దేవ్, అభిషేక్ మను, శివసేన నేత సంజయ్ రౌత్ వంటి ప్రముఖల పేర్లు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే ట్విటర్ వేదికగా వెల్లడించారు. టెలిగ్రామ్ బాట్‌లో ఆ వ్యక్తి పేరు, వ్యాక్సిన్ తీసుకునే సమయంలో వారు సమర్పించిన ప్రభుత్వ ఐడీ, ఆధార్, పాన్ నంబర్లు, విదేశీ ప్రయాణాల కోసం అప్‌డేట్ చేసిన వారి పాస్‌పోర్టు నంబర్ల రికార్డులు కూడా ఇందులో ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరాలు కూడా లీక్ అయినట్టు తెలిసింది.
విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్
కొవిన్ పోర్టల్‌లో పౌరుల డేటా చోరీ అంశంపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. ‘డిజిటల్ ఇండియాలో భారత పౌరుల గోప్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నాతో సహా ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం బహిరంగంగా అందుబాటులో ఉంది. దీనికి బాధ్యులు ఎవరు’ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాగా, ‘కొవిన్’ యాప్ నుంచి సమాచారం బహిర్గతమైందన్న ఆరోపణలపై హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎంఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యం, ఇతర వ్యక్తిగత వివరాలను కొవిన్ యాప్ ద్వారా సేకరించిన కేంద్రం వాటిని భద్రపరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు స్పష్టమైందని పేర్కొంది