Chandrayaan-3: జాబిల్లిపై అడుగు పెట్టేందుకు సిద్ధం

ABN , First Publish Date - 2023-08-19T04:03:51+05:30 IST

జాబిల్లి దిశగా తన ప్రయాణంలో చంద్రయాన్‌-3 (Chandrayaan-3)మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌(Propulsion module) నుంచి విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌(Lander module)ను చంద్రుడికి మరింత చేరువ చేయడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగం తగ్గింపు ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో(ISRO) ప్రకటించింది.

Chandrayaan-3: జాబిల్లిపై అడుగు పెట్టేందుకు సిద్ధం

విజయవంతంగా విక్రమ్‌ ల్యాండర్‌ వేగం తగ్గింపు

చంద్రుడికి మరింత చేరువైన మాడ్యూల్‌: ఇస్రో

రేపు రెండోసారి డీబూస్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహణ

ల్యాండర్‌ తీసిన తొలి జాబిల్లి వీడియో విడుదల

విక్రమ్‌ ల్యాండర్‌ వేగం తగ్గింపు విజయవంతం

న్యూఢిల్లీ/బెంగళూరు, ఆగస్టు 18: జాబిల్లి దిశగా తన ప్రయాణంలో చంద్రయాన్‌-3 (Chandrayaan-3)మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌(Propulsion module) నుంచి విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌(Lander module)ను చంద్రుడికి మరింత చేరువ చేయడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగం తగ్గింపు ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో(ISRO) ప్రకటించింది. ‘ల్యాండర్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎం) ఆరోగ్యం సాధారణంగానే ఉంది. ఈ మాడ్యూల్‌కు డీబూస్టింగ్‌ ఆపరేషన్‌(Deboosting operation) విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియ దాని కక్షను 113 కి.మీ.- 157 కి.మీ.కు తగ్గించింది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌కు భారత కాలమానం ప్రకారం ఈ నెల 20 వేకువజామున 2 గంటల సమయంలో రెండోసారి డీ బూస్టింగ్‌ ఆపరేషన్‌ జరగనుంది’’ అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న సాయంత్రం 5:47గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

కాగా, ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లి ఉపరితలంపై తీసిన తొలి చిత్రాలను భూమిపైకి పంపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్‌(Twitter)లో షేర్‌ చేసింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన కాసేపటికే ల్యాండర్‌ మాడ్యూల్‌ ఈ వీడియో తీసినట్లు తెలిపింది. ఈ చిత్రాల్లో జాబిల్లి ఉపరితలంపై ఉన్న బిలాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో ఫ్యాబ్రీ, గియార్డోనో బ్రునో, హర్కేబి జే తదితర బిలాల పేర్లను ఇస్రో వెల్లడించింది. ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లి పై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం 43 కిలోమీటర్ల వ్యాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రయాన్‌-3 వ్యోమనౌక తన ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పీడీసీ)ను ఉపయోగించి ఈ నెల 15న తీసిన జాబిల్లికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలతో కూడిన వీడియోను కూడా ఇస్రో షేర్‌ చేసింది.

Updated Date - 2023-08-19T05:25:37+05:30 IST