Siddaramaiah Budjet: 5 హామీల అమలుకు బడ్జెట్‌లో రూ.52,000 కోట్లు కేటాయింపు
ABN , First Publish Date - 2023-07-07T15:52:41+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన 5 హామీల అమలుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరిపింది. 5 హామీల అమలుకు రూ.52,000 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన 5 హామీల అమలుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరిపింది. 5 హామీల అమలుకు రూ.52,000 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ఇందువల్ల 1.3 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. రూ.3.27 లక్షల కోట్లతో 2023-2024 బడ్జెట్‌ను సిద్ధరామయ్య శుక్రవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదు హామీల అమలుకు కేటాయించిన బడ్జెట్ ద్వారా ప్రతి కుటుంబానికి అదనంగా రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ సాయం అందుతుందని చెప్పారు.
సర్కార్ అమలు చేస్తున్న 5 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం, , ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ.2,000 సాయం, యువకులకు రూ.3,000 వరకూ నిరుద్యోగ భృతి వంటివి ఉన్నాయి. కాగా, 2023-24 బడ్జెట్ సమర్పణతో ఆర్థిక మంత్రిగా 14 సార్లు బడ్జెట్ ప్రతిపాదించిన రికార్డును సిద్ధరామయ్య సాధించారు. గతంలో 13 సార్లు బడ్జెట్‌ను ప్రతిపాదించిన రికార్డు మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే పేరున ఉంది. 224 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించగా, బీజపీ 66 సీట్లు, జేడీ(ఎస్) 19 సీట్లకు పరిమితమయ్యాయి.