Adhir Ranjan: 'పాగల్ మోదీ' అంటూ అధీర్ రంజన్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-05-24T15:14:11+05:30 IST
ముర్షీదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మోదీ కాదు, పగ్లా మోదీ అని విమర్శించారు.
ముర్షీదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మోదీ కాదు, పగ్లా మోదీ (Pagla Modi) అని విమర్శించారు.
పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధీర్ రంజన్ మాట్లాడుతూ, మరోసారి అకస్మాత్తుగా ఆయన (ప్రధాని) రూ.2,000 నోట్లు రద్దు చేసినట్టు ప్రకటించారని, ఆయన మోదీ కాదని, పగ్లా మోదీ అని, ప్రజలు ఆయనను పగ్లా మోదీగా సంబోధిస్తు్న్నారని అన్నారు. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి ఊగిసలాట ధోరణలో ఉందని, రూ.2000 నోట్లు ఉపసంహరించుకుంటూ తీసుకున్న తాజా నిర్ణయంతో పరిస్థితి మరింత దిగజారనుందని అన్నారు. ప్రజలు పూర్తిగా ఈ ప్రభుత్వంతో విసిగెత్తిపోయారని, ఇప్పుడు తమ వాణిని వినిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో పోరాటం సాగించేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని ప్రజలు చెబుతున్నారని అన్నారు.
ప్రజాస్పందన గురించే చెప్పానంటూ వివరణ
కాగా, తాను చేసిన 'పాగల్ పీఎం' వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి బుధవారంనాడు వివరణ ఇచ్చారు. రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రజవాణిని మాత్రమే తాను చెప్పానని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారంనాడు సమావేశం కావడాన్ని అధీర్ రంజన్ విమర్శించారు. దీదీ, కేజ్రీవాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను ధ్వంసం చేయడం ద్వారా లాభపడాలని కోరుకుంటున్నవేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడమే వారి ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వాళ్లు ఎప్పుడూ పోరాడలేదని తప్పుపట్టారు.